వ్యవసాయానికి తీవ్ర నష్టం :
రైతు సంఘం ప్రధాన కార్యదర్శి టి.సాగర్
మిగులు ఉత్పత్తి అమ్ముకోవడానికే యుద్ధాలు : వ్యకాస రాష్ట్ర మహాసభ ఆహ్వాన సంఘం అధ్యక్షులు ఏ.మధుసూదన్ రెడ్డి
నవతెలంగాణ- మహబూబ్‌నగర్ ప్రాంతీయ ప్రతినిధి
”విదేశీ వాణిజ్య ఒప్పందాలు ప్రజల సమక్షంలో చేసుకోవాలని దొడ్డిదారిన ఒప్పందాలు చేసుకుని ప్రకటించడం సరికాదు.. ఈ ఒప్పందాల వల్ల భారత వ్యవసాయ రంగానికి తీవ్ర నష్టం జరుగుతోంది.. ఇరాన్‌పై యుద్ధం వల్ల అమెరికాకు ఒరిగిందేం లేదు.. అమెరికాలో ఆర్థిక సంక్షేమం ఏర్పడింది” అని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.సాగర్, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర మహాసభ ఆహ్వాన సంఘం అధ్యక్షులు డాక్టర్ ఏ.మధుసూదన్‌రెడ్డి వివరించారు. మే నెలలో జరగనున్న వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర మహాసభ సన్నాహక కార్యక్రమంలో భాగంగా మహబూబ్‌నగర్‌లోని జలజం కళాశాలలో బుధవారం ”అమెరికా- భారత్ వాణిజ్య ఒప్పందం- దేశ వ్యవసాయ రంగంపై ప్రభావం” అనే అంశంపై సెమినార్ నిర్వహించారు. ఈ సందర్భంగా సాగర్ మాట్లాడుతూ.. అమెరికాలో వ్యవసాయం మిగులు ఉత్పత్తులను అమ్ముకోవడానికి భారత్‌తో ఒప్పందం చేసుకుందని, దాని వల్ల దేశంలో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు.
11శాతం ఉన్న విదేశీ పత్తి కాటన్ దిగుమతి సుంకాన్ని జీరో శాతానికి తీసుకొచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు.
దీనివల్ల దేశంలో పత్తి పండిస్తున్న సుమారు 40లక్షల మంది రైతులు వీధిన పడాల్సి వచ్చిందన్నారు. ఎకరాకు 7 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేస్తామని చెప్పి సీసీఐలకు ఆదేశించడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. విదేశీ పత్తిని మన దేశానికి తీసుకొచ్చి స్వదేశీ కాటన్ రైతులను ముంచేస్తున్నారన్నారు. మొక్కజొన్న రైతులకు మద్దతు ధర రూ.2400 ఇస్తామని చెప్పి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించకుండా ప్రయివేటు వ్యక్తులకు అమ్ముకునే విధంగా కంపెనీలకు వేసులుబాటు కల్పిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విదేశీ వాణిజ్య ఒప్పందాల వల్ల దేశంలోని రైతులకే కాకుండా పాడి, పాల ఉత్పత్తిదారులకు కూడా శాపంగా మారిందన్నారు. తక్షణమే దేశ రైతాంగం మేలుకొనాలని, కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు.
వీటన్నింటిపై వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర మహాసభలో చర్చించి భవిష్యత్ ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు. వ్యకాస రాష్ట్ర మహాసభ ఆహ్వాన సంఘం అధ్యక్షులు డాక్టర్ ఏ.మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ.. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయిల్ చేస్తున్న యుద్ధంతో ఈ రెండు దేశాలకూ ఎలాంటి లాభమూ కలగలేదని తెలిపారు. అమెరికాలోని మిగులు ఉత్పత్తులను ఇతర దేశాల్లో అమ్ముకోవడానికే యుద్ధాలను ప్రోత్సహిస్తోందని వివరించారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం రాష్ట్ర నాయకులు ఏ.రాములు, సీఐటీయూ సీనియర్ నాయకులు కిల్లె గోపాల్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బి.జగన్, కడియాల మోహన్, ఆర్.రామ్‌రెడ్డి, కేవీపీఎస్ జిల్లా అధ్యక్షకార్యదర్శులు మల్లెల మాణిక్యం రాజు, మీసాల కురుమయ్య, సీఐటీయూ జిల్లా కోశాధికారి చంద్రకాంత్, పెన్షనర్స్‌యూనియన్ నాయకులు కె.రామదాస్, కామర్ అల్లి, డీవైఎఫ్‌ఐ జిల్లా కన్వీనర్ ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.



