– గులాబీ కండువా కప్పుకుంటేనే వస్తుందనడం సరికాదు
– అర్హులైన దళితులందరికీ ఇవ్వాలి
– సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు
నవతెలంగాణ-సత్తుపల్లి
దళితబంధు ఎంపికలో రాజకీయ జోక్యం తగదని, గులాబీ కండువా కప్పుకుంటేనే ఇస్తామనడం సరికాదని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు అన్నారు. శనివారం స్థానిక ప్రజా సంఘాల కార్యాలయంలో ఆ పార్టీ నియోజకవర్గస్థాయి ముఖ్య నాయకులతో ఏర్పాటు చేసిన సమావేశంలో నాగేశ్వరరావు మాట్లాడారు. అర్హులైన దళితులందరికి దళితబంధు ఇవ్వాలన్నారు. అంతేగాని గులాబీ కండువా కప్పుకుంటేనే వస్తుందనడం సరికాదన్నారు. ఈ రకమైన చర్యలు ఫిరాయింపులను ప్రోత్సహించే విధంగా ఉందన్నారు. అంతేగాకుండా ఎంపికైన వారిచేత ప్రమాణాలు కూడా చేయించుకోవడం శోచనీయమన్నారు. దళితబంధు పథకం బీఆర్‌ఎస్ పథకం కాదని, ఆ ఇచ్చే డబ్బులు కేసీఆర్‌వి కావని నాగేశ్వరరావు విమర్శించారు. నిబంధనల మేరకు అర్హులైన దళితులందరికి ఈ పథకాన్ని అందజేయాలన్నారు. లేకుంటే రోడ్లెక్కి పెద్దఎత్తున నిరసన కార్యక్రమాలను చేపడతామన్నారు. బీసీ, మైనారిటీ బంధు విషయంలో కూడా రాజకీయ జోక్యాన్ని చొప్పించారని ఆరోపించారు. తొమ్మిదిన్నర యేండ్ల కాలంలో డబుల్ బెడ్రూం ఇండ్ల ఏర్పాటులో విఫలం చెందిన కేసీఆర్ కొత్తగా గృహలక్ష్మీ పథకం పేరుపెట్టి సొంత స్థలాల్లో ఇండ్లంటూ ప్రచారాన్ని హౌరెత్తిస్తున్నారని నున్నా విమర్శించారు. సత్తుపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా గృహలక్ష్మీ పథకంలో 3వేల మందికి ఇస్తామనడం సరికాదని, కనీసం 5వేల ఇండ్లకు పెంచాలని ఆయన డిమాండ్ చేశారు. గృహలక్ష్మీలో కూడా అను కూలంగా వారికే ఇస్తున్నారన్నారు. అలా కాకుండా రాజకీయాలకు అతీతంగా అర్హులైన అందరికి ఇవ్వాలన్నారు. ఎన్నికల ముందు ఇచ్చే హామీలు, పథకాలు ఎంతవరకు అమలవుతాయో అనుమా నాస్పదమే నన్నారు. ఎన్నికల కోడ్ రాగానే కోడ్ వచ్చిందని తప్పించుకొనే అవకాశం లేకపోలేదన్నారు. రుణమాఫీ ఇంత వరకు జరగలేదన్నారు. ప్రజల్లో బీఆర్‌ఎస్ గ్రాఫ్ జెడ్ స్పీడుతో పడిపోతోందన్నారు. ప్రజలు మార్పుకోరు కుంటున్నారని నాగేశ్వరరావు స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేకుండా పోయిందన్నారు. కార్మికులు, ఉద్యోగులు సమస్యల సాధన కోసం కార్యక్రమాలు చేపడితే ఉద్యోగాలను తొలగిస్తామని బెదిరిస్తున్నారన్నారు. కనీస వేతనం రూ. 26వేలు ఉండాలన్నారు. మధ్యాహ్న భోజన కార్మికుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యహరించిన ప్రభుత్వం ఇప్పుడేమో కొత్తగా పాఠశాలల్లో బ్రేక్‌ఫాస్ట్ పథకాన్ని తీసుకొచ్చి గొప్పగా ప్రారంభోత్సవాలు చేస్తున్నారని మండిపడ్డారు. మధ్యాహ్న భోజన కార్మికులకు రావాల్సిన డబ్బులు ఇంతవరకు చెల్లించలేదన్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా చెల్లింపులు జరగాలన్నారు. ఈ పథకంలో పనిచేసే కార్మికులకు కనీసం రూ. 26వేలు వేతనం ఇవ్వాలన్నారు. అధికారంలోకి వస్తే కాంట్రాక్టు పద్ధతే ఉండదని కేసీఆర్ ఎంతో గొప్పగా చెప్పడం జరిగిందన్నారు. ఇప్పుడంతా కాంట్రాక్టు మయమేనన్నారు. ఉద్యోగులకు 5శాతం ఇంటీరియం రిలీఫ్ ప్రకటించడం సరికాదన్నారు. దీనిని 15శాతానికి పెంచాలని నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు మోరంపూడి పాండురంగారావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు మాదినేని రమేశ్, చలమాల విఠల్‌రావు, శీలం సత్యనారాయణరెడ్డి, తన్నీరు కృష్ణార్జునరావు, గాయం తిరుపతిరావు, అర్వపల్లి జగన్మోహనరావు, పట్టణ కార్యదర్శి రావుల రాజబాబు, మల్లూరు చంద్రశేఖర్, కొలికపోగు సర్వేశ్వరరావు, చావా రమేశ్ పాల్గొన్నారు.