Sunday, May 10, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంక్రూయిజ్‌ షిప్‌లో నోరో వైరస్‌ కలకలం

క్రూయిజ్‌ షిప్‌లో నోరో వైరస్‌ కలకలం

- Advertisement -

115 మందికి అనారోగ్యం ..! : సెంటర్స్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ వెల్లడి
అమెరికా : ప్రిన్సెస్‌ క్రూయిజ్‌ షిప్‌లో నోరో వైరస్‌ కలకలం రేగింది. ఫోర్ట్‌ లాడర్‌డేల్‌ నుంచి బయలుదేరిన ఈ షిప్‌లో 100 మందికి పైగా ప్రయాణికులు, సిబ్బంది ఈ వైరస్‌ బారిన పడినట్టు సెంటర్స్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ తెలిపింది. కరేబియన్‌ ప్రిన్సెస్‌ నౌకలో మొత్తం 102 మంది ప్రయాణికులు, 13 మంది సిబ్బంది అనారోగ్యానికి గురైనట్టు సీడీసీ వెల్లడించింది. మొత్తంగా 115 మందికి ఈ వైరస్‌ సోకినట్టు అధికారులు వెల్లడించారు. నౌకను శుభ్రపరచడం, క్రిమిసంహారక ప్రక్రియలను ముమ్మరం చేసినట్టు అధికారులు తెలిపారు. మల నమూనాలను సేకరించి పరీక్షలు నిర్వహిస్తున్నారు. అనారోగ్యంతో ఉన్న ప్రయాణికులు, సిబ్బందిని వేరుగా ఉంచి చికిత్స అందిస్తున్నారు.

ప్రయాణం మొత్తం సమయంలో కేసులు క్రమంగా పెరిగాయి. ఒక్కసారిగా కాకుండా దశలవారీగా ప్రయాణికులు అస్వస్థతకు గురయ్యారు. మొత్తం ప్రయాణికుల్లో 3 శాతానికి మించి కేసులు నమోదయ్యాయి. ఈ నౌక ఏప్రిల్‌ 29న పోర్ట్‌ ఎవర్గ్లేడ్స్‌ నుండి బయలుదేరి, మే 11న పోర్ట్‌ కెనవెరాల్‌కు చేరుకోవాల్సి ఉంది. నౌకలోని 3,116 మంది ప్రయాణికులలో సుమారు 3.3 శాతం మంది, సిబ్బందిలో 1.2 శాతం మంది అనారోగ్యానికి గురయ్యారని సీడీసీ తెలిపింది. ప్రయాణంలో భాగంగా ఓడ అరుబా, బొనైర్‌, ప్యూర్టో రికో, బహామాస్‌ వంటి పర్యాటక ప్రాంతాల్లో ఆగింది. ఈ సమయంలోనే ప్రయాణికుల్లో అనారోగ్య లక్షణాలు కనిపించడం ప్రారంభమయ్యాయి.

అతిసారం, వాంతుల వ్యాప్తి ….
సీడీసీ (వ్యాధి నియంత్రణ, నివారణ కేంద్రం) వివరాల ప్రకారం …. అమెరికా సంయుక్త రాష్ట్రాలలో అతిసారం, వాంతుల వ్యాప్తికి నోరో వైరస్‌ ప్రధాన కారణం. ఇది ఇతరులతో ప్రత్యక్ష సంబంధం ద్వారా, వైరస్‌తో కలుషితమైన ఆహారం, ద్రవాలను సేవించడం ద్వారా, అలాగే కలుషితమైన ఉపరితలాలను తాకడం ద్వారా వ్యాపిస్తుంది. ఉపరితలాలను క్రిమిరహితం చేయడం, తరచుగా చేతులు కడుక్కోవడం ద్వారా నోరో వైరస్‌ను నివారించవచ్చని సీడీసీ పేర్కొంది.

నోరోవైరస్‌ అంటే ?
నోరోవైరస్‌ అనేది కడుపు, ప్రేగులకు సోకే అత్యంత అంటువ్యాధి వైరస్‌. ఇది చాలా వేగంగా వ్యాపి స్తుంది. ముఖ్యంగా మూసి ఉన్న, రద్దీగా ఉండే ప్రదేశాల్లో ఈ వైరస్‌ వ్యాప్తి ప్రమాదం అధికంగా ఉంటుంది. అందుకే క్రూయిజ్‌ షిప్‌లలో ఇలాంటి వైరస్‌లు త్వరగా వ్యాపిస్తాయి. ఈ వైరస్‌ సోకిన వ్యక్తి చేతులు, ఆహారం, నీరు లేదా వారు తాకిన వస్తువుల ద్వారా ఈ వైరస్‌ ఇతరులకు సులభంగా వ్యాపిస్తుంది. బఫే ఆహారం, స్విమ్మింగ్‌ పూల్స్‌, ఎలివేటర్లు, హ్యాండ్‌రైల్స్‌ వంటి సామూహిక వినియోగ వస్తువులు వైరస్‌ వ్యాప్తికి కారణమవుతాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -