Saturday, June 6, 2026
E-PAPER
Homeఆటలుఇక టెస్టు సవాల్‌

ఇక టెస్టు సవాల్‌

- Advertisement -

నేటి నుంచి అఫ్గాన్‌తో భారత్‌ ఏకైక టెస్టు
కెరీర్‌ 50వ టెస్టుకు సిద్ధమైన రిషబ్‌ పంత్‌
ఉదయం 9.30 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో..

గత వారం ఐపీఎల్‌ ప్లే ఆఫ్స్‌కు వేదికగా నిలిచిన న్యూ చంఢీగడ్‌ స్టేడియం నేటి నుంచి భారత్‌, అఫ్గనిస్తాన్‌ ఏకైక టెస్టు మ్యాచ్‌కు వేదికగా నిలువనుంది. ఐపీఎల్‌ పైనల్‌ ముగిసిన ఆరు రోజుల్లోనే భారత క్రికెటర్లు టెస్టు క్రికెట్‌ సవాల్‌కు సిద్ధమయ్యారు. ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్స్‌లో ఈ టెస్టు మ్యాచ్‌ భాగం కాకపోయినా.. ఇరు జట్లు ప్రతిష్టాత్మకంగా బరిలోకి దిగుతున్నాయి. భారత్‌, అఫ్గనిస్తాన్‌ ఏకైక టెస్టు మ్యాచ్‌ నేటి నుంచి ఆరంభం.

​నవతెలంగాణ-న్యూ చంఢీగడ్‌
ఐపీఎల్ ఫైనల్‌ ముగిసి ఆరు రోజులు అవుతోంది. ఐపీఎల్‌ ఫైనల్లో ఆడిన ఆటగాళ్లలో ఎనిమిది మంది భారత టెస్టు జట్టులో ఉన్నారు. టీ20 ఫార్మాట్‌ ధనాధన్‌, శైలిలో రెండు నెలలుగా బిజీగా గడిపిన క్రికెటర్లు… ఆరు రోజుల వ్యవధిలోనే ఐదు రోజుల ఫార్మాట్‌కు అలవాటుకు కావాల్సి ఉంది. టెక్నిక్‌, టెంపర్‌మెంట్‌లో మార్పుతో పాటు ఓపిగ్గా, సహనంతో క్రీజులో నిలబడే తత్వం వేగంగా అందుకోవాల్సి ఉంది. టీ20 ధనాధన్‌ మూడ్‌లో ఉన్న భారత క్రికెటర్లు.. నేటి నుంచి అఫ్గనిస్తాన్‌తో ఏకైక టెస్టులో ఆడనున్నారు. న్యూ చంఢీగడ్‌ ఈ టెస్టు మ్యాచ్‌కు వేదికగా నిలువనుంది. ఉదయం 9.30 గంటలకు మ్యాచ్‌ ఆరంభం కానుండగా, 9 గంటలకు టాస్‌ ఉంటుంది.

​పంత్‌పైనే ఫోకస్‌
టెస్టుల్లో టీమ్ ఇండియా ట్రంప్‌కార్డ్‌ రిషబ్‌ పంత్‌. రెడ్‌బాల్‌ ఫార్మాట్‌లో పంత్‌ గణాంకాలు అసామాన్యం. కానీ తాజాగా ఐపీఎల్‌లో పేలవ ప్రదర్శన చేసిన పంత్‌ టెస్టు జట్టులో వైస్‌ కెప్టెన్సీ కోల్పోయిన పంత్‌.. ఐపీఎల్‌లో లక్నో సూపర్‌జెయింట్స్‌ సారథ్యాన్ని వదులుకున్నాడు. కెప్టెన్సీ భారం దించేసుకున్న పంత్‌ నేడు కెరీర్‌ 50వ టెస్టు మ్యాచ్‌ ఆడనున్నాడు. ఎం.ఎస్‌ ధోని, సయ్యద్‌ కిర్మాణి తర్వాత 50 ప్లస్‌ టెస్టులు ఆడనున్న తొలి వికెట్‌ కీపర్‌ రిషబ్‌ పంత్‌. అఫ్గనిస్తాన్‌తో టెస్టులో బ్యాటర్‌గా పరుగులు చేస్తూనే.. బ్యాటింగ్‌ లైనప్‌ను ముందుండి నడిపించాల్సిన బాధ్యత పంత్‌పై ఉంది. పరుగుల దాహంతో కనిపిస్తున్న పంత్‌ను నిలువరించటం అఫ్గాన్‌ బౌలర్లకు కత్తి మీద సామే కానుంది. ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ సైతం ఐపీఎల్‌లో నిరాశపరిచాడు.

ఓపెనర్‌గా కొత్త బంతిపై విరుచుకుపడేందుకు జైస్వాల్‌ ఎదురుచూస్తున్నాడు. ఐపీఎల్‌లో అద్భుతంగా రాణించిన సాయి సుదర్శన్‌ మరోసారి నం.3 పొజిషన్‌ దక్కించుకోనున్నాడు. ఈసారి స్వదేశంలో లభించే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనే తపన సాయి సుదర్శన్‌లో కనిపిస్తోంది. కెఎల్‌ రాహుల్‌, శుభ్‌మన్‌ గిల్‌ మంచి ఫామ్‌లో ఉన్నారు. ధ్రువ్‌ జురెల్‌, వాషింగ్టన్‌ సుందర్‌లు సైతం తమదైన జోరు చూపించాలని అనుకుంటున్నారు. అశ్విన్‌ వీడ్కోలు తీసుకోగా, జడేజాకు విశ్రాంతి లభించింది. దీంతో కుల్‌దీప్‌ యాదవ్‌ ప్రధాన స్పిన్నర్‌గా బరిలోకి దిగుతున్నాడు. హర్ష్‌ దూబె, మానవ్‌ సుథర్‌లో ఒకరు కుల్‌దీప్‌ యాదవ్‌తో కలిసి స్పిన్‌ బాధ్యతలు పంచుకోనున్నారు. జశ్‌ప్రీత్‌ బుమ్రా లేని వేళ మహ్మద్‌ సిరాజ్‌, ప్రసిద్‌ కృష్ణ పేస్‌ బాధ్యతలు చూసుకోనుండగా4.. ఆల్‌రౌండర్‌ నితీశ్‌ కుమార్‌ రెడ్డికి తుది జట్టులో చోటు దక్కే అవకాశాలు కనిపించటం లేదు.

​పోటీ ఇవ్వగలరా?
అఫ్గనిస్తాన్‌ టెస్టు అరంగేట్రం భారత్‌తోనే చేసింది. బెంగళూరులో జరిగిన ఆ టెస్టులో రహానె సారథ్యంలోని భారత్‌ రెండు రోజుల్లోనే ఇన్నింగ్స్‌ విజయం అందుకుంది. అఫ్గనిస్తాన్‌కు ఇది 13వ టెస్టు కానుంది. ప్రధాన స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌ సేవలు అందుబాటులో లేవు. ధనాధన్‌ బ్యాటర్‌ ఇబ్రహీం జద్రాన్‌ సైతం జట్టులో లేడు. అయినా, ఆతిథ్య జట్టుకు గట్టి పోటీ ఇచ్చేందుకు అఫ్గనిస్తాన్‌ సిద్ధమవుతోంది. రెహమత్‌ షా అఫ్గనిస్తాన్‌ జట్టులో కీలక బ్యాటర్‌. ఆ జట్టు బ్యాటింగ్‌ లైనప్‌లో అత్యధిక సెంచరీలు, అర్థ సెంచరీలు సాధించిన బ్యాటర్‌ రెహమత్‌ షానే. టెక్నికల్‌గా రెహమత్‌ షా బ్యాటింగ్‌ తీరు అమోఘం. దీంతో ఆ జట్టు బ్యాటింగ్‌ భారం అంతా అతడే మోయనున్నాడు. రెహ్మనుల్లా గుర్బాజ్‌, కెప్టెన్‌ హస్మతుల్లా షాహిది, అజ్మతుల్లా ఓమర్‌జాయ్‌లు సైతం మెరిస్తే అఫ్గనిస్తాన్‌ నాలుగు రోజులైనా పోటీ ఇవ్వగలదు. కొత్త బౌలర్లను ఎదుర్కొవటంలో టీమ్‌ ఇండియా బ్యాటర్ల బలహీనతను అఫ్గనిస్తాన్‌ సొమ్ము చేసుకునేందుకు చూస్తోంది.

​31వ టెస్టు వేదిక
న్యూ చంఢీగడ్‌ భారత్‌లో 31వ టెస్టు వేదికగా నిలువనుంది. ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్‌ హోమ్‌ గ్రౌండ్‌గా కొనసాగిన న్యూ చంఢీగడ్‌, ప్లే ఆఫ్స్‌ మ్యాచ్‌లకు సైతం ఆతిథ్యం వహించింది. నేడు అఫ్గనిస్తాన్‌, భారత్‌ టెస్టుతో ఐదు రోజుల ఫార్మాట్‌లో ఆతిథ్యానికి అరంగేట్రం చేయనుంది. ఐదు రోజుల పాటు టెస్టును వీక్షించేందుకు రూ.250 పాస్‌ను ప్రవేశపెట్టగా.. అభిమానుల నుంచి పెద్దగా స్పందన లభించటం లేదు. ఇప్పటివరకు అమ్ముడుపోయిన టికెట్లు కేవలం 5000 లోపే ఉన్నాయని తెలుస్తోంది. దీంతో టెస్టు సమరం అభిమానుల కోలాహలం లేకుండా చప్పగా సాగే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

​పిచ్‌, వాతావరణం
భారత్‌, అఫ్గనిస్తాన్‌ టెస్టు మ్యాచ్‌కు న్యూ చంఢీగడ్‌లో ఎర్ర మట్టి పిచ్‌ను సిద్ధం చేశారు. ఈ పిచ్‌ బ్యాటింగ్‌కు అనుకూలం. జూన్‌లో ఇక్కడ అధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయి. మధ్యాహ్నం ఉష్ణోగ్రతలు గరిష్టంగా 40 డిగ్రీలు తాకే అవకాశం ఉంది. ఆటగాళ్లు క్రికెట్‌ సవాల్‌తో పాటు సూర్యతాపం సవాల్‌ను సైతం అధిగమించాల్సి ఉంటుంది. టాస్‌ నెగ్గిన జట్టు తొలుత బ్యాటింగ్‌ ఎంచుకోనుంది.

​తుది జట్లు (అంచనా)
భారత్‌ : యశస్వి జైస్వాల్, కెఎల్‌ రాహుల్‌, బి. సాయి సుదర్శన్‌, శుభ్‌మన్‌ గిల్‌ (కెప్టెన్‌), రిషబ్‌ పంత్‌ (వికెట్‌ కీపర్‌), ధ్రువ్‌ జురెల్‌, వాషింగ్టన్‌ సుందర్‌, హర్ష్‌ దూబె, కుల్‌దీప్‌ యాదవ్‌, మహ్మద్‌ సిరాజ్‌, ప్రసిద్‌ కృష్ణ.

అఫ్గనిస్తాన్‌ : సదిఖుల్లా అటల్‌, రెహ్మనుల్లా గుర్బాజ్‌, రెహమత్‌ షా, హస్మతుల్లా షాహిది (కెప్టెన్‌), అజ్మతుల్లా ఒమర్‌జాయ్‌, రెహ్మనుల్లా, అఫ్సర్‌ జజాయ్‌ (వికెట్‌ కీపర్‌), షరాఫుద్దీన్‌ అష్రాఫ్‌, నంగేయాలియ, ఖ్వాయిస్‌ అహ్మద్‌, జియుర్‌ రెహ్మాన్‌.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -