– పోస్టులను భర్తీ చేయాలి: కోదండరాంకు నర్సింగ్ ఆఫీసర్స్ వినతి
నవతెలంగామ బ్యూరో – హైదరాబాద్
నర్సింగ్ ఆఫీసర్ పరీక్షా ఫలితాలను విడుదల చేయాలనీ, 5,204 ఖాళీలను భర్తీ చేయాలని రిజిస్టర్ నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ (ఆర్‌ఎన్‌ఓఏ), నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ (ఎన్‌ఓఏ) కోరాయి. ఈ మేరకు ప్రభుత్వానికి విన్నవించాలని టీజేఎస్ అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరామ్‌ను ఆర్‌ఎన్‌ఓఏ అధ్యక్షురాలు సుజాత రాథోడ్, నర్సింగ్ ఆఫీసర్ రామలక్ష్మి, ఎన్‌ఓఏ వ్యవస్థాపకులు లక్ష్మణ్ రుఢావత్, నర్సింగ్ ఆఫీసర్ సోమేశ్ కలిసి విజ్ఞప్తి చేశారు. 317 జీవో ద్వారా సమస్యలను పరిష్కరించాలని కోరారు. తెలంగాణ వైద్య విధాన పరిషత్‌లో పనిచేస్తున్న వారికి ట్రెజరీ ద్వారా జీతాలు, హెల్త్ కార్డులు పంపిణీ చేయాలని విజ్ఞప్తి చేశారు. పదోన్నతులు కల్పించాలనీ, సాధారణ బదిలీలు చేపట్టాలన్నారు. నర్సింగ్ కాలేజీల్లో ఖాళీ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలన్నారు. నర్సింగ్ డైరెక్టరేట్ నిర్మాణం చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం కోదండరాం మాట్లాడుతూ త్వరలోనే ఉద్యోగ సంఘాల సమావేశం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. సమస్యలన్నింటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.