Thursday, May 14, 2026
E-PAPER
Homeజాతీయంకేరళ కాంగ్రెస్‌లో ముసలం

కేరళ కాంగ్రెస్‌లో ముసలం

- Advertisement -

కేసీ వేణుగోపాల్‌కు సీఎం పదవి..!
వ్యతిరేకిస్తున్న విడి సతీషన్..?

నవతెలంగాణ – న్యూఢిల్లీ బ్యూరో
ఇటీవల జరిగిన ఐదు అసెంబ్లీలకు సంబంధించి నాలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు కొలువుదీరాయి. నాలుగు రాష్ట్రాల్లో సిఎంలు ప్రమాణ స్వీకారం చేశారు. కానీ, కేరళలో మాత్రం ఇంకా సీఎం ఎంపిక ప్ర‌క్రియ‌ పూర్తి కాలేదు. కొత్త ప్రభుత్వం ఏర్పడలేదు. దీనంతటికీ కారణం.. కేరళ కాంగ్రెస్ పార్టీలోని వర్గ విబేధాలే. సీఎం ఖ‌రారు విషయంలో కాంగ్రెస్ అధిష్టానం ఎటూ తేల్చడం లేదు. సీఎం ఎంపిక విషయంలో కేరళ కాంగ్రెస్ పార్టీలో ముసలం ఏర్పడినట్లు కనిపిస్తోంది. కేరళలో కాంగ్రెస్ ఆధ్వర్యంలోని యూడీఎఫ్ కూటమికి అధికారం దక్కింది. మే 4న ఫ‌లితాలు వచ్చాయి. దాదాపు 11 రోజులు అవుతున్నా ముఖ్యమంత్రి ప్ర‌మాణ స్వీకారం కాలేదు.

ఈ కూటమిలో అత్యధిక సీట్లు సాధించ‌డంతో కాంగ్రెస్ పార్టీకే ముఖ్యమంత్రి పీఠం ద‌క్కుతుంది. కానీ, పార్టీ అగ్రనేతల మధ్య సీఎం సీటు విషయంలో బేధాభిప్రాయాలున్నాయి. ఆ పదవి కోసం కాంగ్రెస్ నుంచి ఆ పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి (సంస్థాగ‌త‌) కేసీ వేణుగోపాల్, ప్ర‌తిప‌క్ష నేత వీడీ సతీషన్, సీనియ‌ర్ నేత‌ రమేష్ చెన్నితల పోటీ పడుతున్నారు. వీరిలో కేసీ వేణుగోపాల్‌ పేరే ప్రముఖంగా వినిపిస్తోంది. ఎక్కువ మంది ఎమ్మెల్యేల మద్దతుతో పాటు, అధిష్టానం మద్దతు కూడా ఆయనకే ఉంది. అయితే, ఆయనను సీఎం చేయడాన్ని సతీష‌న్ వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. వేణుగోపాల్‌ను ముఖ్యమంత్రిగా ఎన్నుకుంటే ఆయన తన ఎంపీ స్థానానికి రాజీనామా చేయాలి.

అలాగే, మరో చోట ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీగా ఎన్నికవ్వాలి. అయితే కేర‌ళ‌లో శాస‌న మండ‌లి లేక‌పోవ‌డంతో ఎమ్మెల్యేగా గెల‌వ‌డం అనివార్యం. అంటే, తను రాజీనామా చేసిన స్థానంతోపాటు కొత్తగా పదవి కోసం ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. దీంతో రెండు చోట్ల ఎన్నిక జరగాలి. ప్రస్తుత పరిస్థితుల్లో ఇది పార్టీకి అంత మంచిది కాదని సతీషన్ వర్గం వాదిస్తోంది. ఒకవేళ వేణుగోపాల్‌ను సీఎం చేస్తే.. తాను ఆ మంత్రివర్గంలో చేరబోనని కూడా సతీషన్ స్ప‌ష్టం చేశారు. అంతేకాకుండా త‌న‌కు ముఖ్యమంత్రి ప‌ద‌వి త‌ప్ప మ‌రేదీ వ‌ద్ద‌ని అధిష్టానం వ‌ద్ద తెగేసి చెప్పిన‌ట్టు స‌మాచారం. దీంతో ఈ ఇద్దరి వర్గాలు పార్టీలో విబేధాలు తీసుకొచ్చాయి. అలాగే, రమేష్ చెన్నితల వర్గం సీఎం పదవి కోసం గట్టి ప్రయత్నాలే చేస్తోంది. దీంతో ఎవరికి పదవి ఇవ్వాలో తెలియక కాంగ్రెస్ సతమతమవుతోంది.

మ‌రోవైపు ముఖ్యమంత్రి ఖ‌రారుపై జరుగుతున్న జాప్యం గురించి యూడీఎఫ్ భాగ‌స్వామ్య పార్టీ ఐయూఎంఎల్ పెద‌వి విరుస్తోంది. ఈ విష‌యంపై ప్ర‌జ‌ల ప్ర‌శ్న‌ల‌ను ఎదుర్కొలేక‌పోతున్నామ‌ని ఆ పార్టీ నేత‌ల్లో చాలా మంది అంటున్నారు. ఐయూఎంఎల్ ఎమ్మెల్యే కురుక్కోలి మొయిదీన్ మాట్లాడుతూ తాను ఎక్క‌డికి వెళ్లినా ప్ర‌జ‌లు, ముఖ్యంగా మ‌హిళ‌లు, ముఖ్య‌మంత్రి ఎంపిక ఎందుకు ఆల‌స్యం అవుతోంద‌ని అడుగుతున్నారని అన్నారు. అయితే జాప్యం క‌న్నా, ఈ విష‌యంపై కాంగ్రెస్‌లో బ‌హిరంగంగా ఉన్న విభేదాలే ప్ర‌ధాన స‌మ‌స్య అని ఆయ‌న అన్నారు. ఇది పెద్ద స‌మ‌స్య‌గా మారింద‌ని, కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌లు కూడా నిరాశ చెందుతున్నార‌ని తెలిపారు. మ‌రో ఎమ్మెల్యే టివి ఇబ్ర‌హీం మాట్లాడుతూ సీఎం ఎవ‌రు కావాల‌నే విష‌యంపై కాంగ్రెస్ నిర్ణ‌యం తీసుకోవ‌డంలో జ‌రుగుతున్న జాప్యం యుడిఎఫ్ విజ‌య శోభ‌ను త‌గ్గించింద‌ని అన్నారు. సాంకేతికంగా ఇది కాంగ్రెస్ అంత‌ర్గ‌త విష‌యం కావ‌చ్చ‌ని, కానీ ప్ర‌జా ప్ర‌యోజ‌నాల దృష్ట్యా ఈ జాప్యం ఆమోదయోగ్యం కాద‌ని అన్నారు. వీలైనంత త్వ‌ర‌గా ఒక నిర్ణ‌యం తీసుకోవాల‌ని కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -