నేరాల దారిలో…

On the way to crime...అసాంఘిక శక్తులను కట్టడిచేసి సమాజంలో శాంతిభద్రతలను పరిరక్షించే ఉదాత్త బాధ్యత పోలీసులది. భయానికి తావులేని, భద్రతకు ఊతమిచ్చే పరిస్థితులను కల్పించడమే వారి అంతిమ లక్ష్యం. అలాంటి బాధ్యతాయుత వృత్తిని చేపట్టిన రక్షక భటులు వారి శాఖ కీర్తిని ఇనుమడింపజేస్తూ ప్రజల మన్ననలు పొందాలి. కానీ, వాస్తవ చిత్రం ఇందుకు విరుద్ధంగా ఉండటంతో పోలీసుల ప్రతిష్టకు తూట్లు పడుతున్నాయి. రాష్ట్రంలో ఇటీవల చోటుచేసుకొన్న ఘటనలే ఇందుకు తార్కాణం. భూవివాదాల్లో తలదూర్చడం, బెదిరింపులకు పాల్పడటం వంటి ఆరోపణలు పోలీసుశాఖకు కొత్తేమీ కాదు. ప్రస్తుతం ఆ స్థాయి దాటిపోయి లైంగికదాడులకు పాల్పడే స్థితికి దిగజారింది. అవినీతి, భూ, ఆస్తి తగాదాల కేసుల్లో చిక్కుకోవడంతోపాటు తమ అనైతిక చర్యలతో శాఖ పరువును, విశ్వసనీయతను అభాసుపాలు చేస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. తాజాగా కాళేశ్వరం ఎస్సై తన కింద పనిచేసే ఓ మహిళా హెడ్‌కానిస్టేబుల్‌పై లైంగిక వేధింపులకు పాల్పడ్డ వ్యవహారం రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గతంలోనూ ఇలాంటి ఘటనలకు పాల్పడ్డ చరిత్ర ఆయనకు ఉంది.
ఒక్కొక్క చోట ఒక్కో వివాదం. ఏ తీగ లాగినా కదులుతోంది పోలీసు డొంకలే. ‘భూవివాదంలో కొట్టి చంపుతున్నారు.. కాపాడండి’ అంటూ నారాయణపేట జిల్లా ఊట్కూరు పోలీసుస్టేషన్‌ పరిధిలో బాధితులు డయల్‌-100కు ఫోన్‌ చేస్తే స్థానిక ఎస్సై మాత్రం స్పందించలేదు. దాదాపు 4 గంటల తర్వాత ఘటనా స్థలానికి పోలీసులు చేరుకునేటప్పటికి ఓ వ్యక్తి నిండు ప్రాణం పోయింది. హైదరాబాద్‌ సీసీఎస్‌లో ఏసీపీ ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టయ్యారు. గతంలోనూ ఆయనపై అనేక ఆరోపణలు ఉన్నప్పటికీ ఉన్నతాధికారులు పట్టించుకోక పోగా.. కీలకమైన కేసుల బాధ్యతలు అప్పగించారు. ఇదే సీసీఎస్‌లో సీఐ రూ.3 లక్షల లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కారు. ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారం పోలీసుశాఖకు మాయనిమచ్చలా మారింది. ఈ కేసులో ఇప్పటికే నలుగురు పోలీసు అధికారులు అరెస్టు కాగా.. విశ్రాంత ఐజీ స్థాయి అధికారి కీలక నిందితుడిగా ఉన్నారు. చివరకు జడ్జీల ఫోన్లు కూడా ట్యాప్‌ చేసినట్టు నిందితులు ఒప్పుకోవడం సంచలనంగా మారింది. ఎన్నికల సందర్భంగా ఒక ఎస్పీ స్థాయి అధికారే స్వయంగా డబ్బు తరలింపునకు ఎస్కార్ట్‌ ఏర్పాటు చేశారని దర్యాప్తులో వెల్లడైంది. ఓ విశ్రాంత ఐఏఎస్‌ అధికారి ఇంటి కబ్జా కేసులో ఐపీఎస్‌ అధికారిపై కేసు నమోదైంది. మరోవైపు నగరవాసులు ‘డయల్‌ 100’కు ఫోన్‌ చేయాలంటేనే హడలిపోతున్నారు. తమకు ఫోన్‌ చేసిన భాధితుల వివరాలు స్వయంగా పోలీసులే రౌడీమూకలకు అందిస్తుండటమే ఇందుకు కారణం. వివాదాలను పరిష్కరించాల్సిన వ్యవస్థే ఇలా కొత్త సమస్యాత్మకంగా మారడం సోచనీయం.
కేసుల విచారణలో.. సాంకేతికత వినియోగంలో తెలంగాణ పోలీసులకు దేశవ్యాప్తంగా మంచి పేరుంది. కానీ కొందరి తీరుతో ఆ కీర్తి కాస్తా మసకబారుతోంది. పోలీసులకు ప్రజల మధ్య సత్సంబంధాల విషయంలో ఆదినుంచీ ఉన్న అగాధం నేడు మరింత పెద్దది అవు తుందే తప్ప తగ్గడం లేదు. ఫలితంగా సమాజంలో ఆ శాఖ పట్ల ప్రతికూల వైఖరి, వ్యతిరేక దృక్పథం వేళ్లూనుకున్నాయి. ప్రజల్లో నెలకొన్న ఈ అభిప్రాయాలను తొలగించుకొవాల్సిన బాధ్యత నిస్సందేహంగా పోలీసులదే. ఆ దిశగా అడుగులు వేయాల్సిందిపోయి…కఠిన శిక్షపడే సెక్షన్ల కింద నేరాన్ని మోపేందుకు కొందరు పోలీసులు ఎంతమాత్రం వెనకాడరని వాస్తవ ఘటనలు రుజువు చేస్తున్నాయి. ఇలాంటి ఘటనలు ఆ శాఖ ప్రతిష్టను మంటగలుపుతున్నాయి.
గతంలో తెరవెనకే ఉండిపోయిన దురాగతాలు సామాజిక మాధ్యమాల పుణ్యమా అని నేడు కళ్లెదురుగా కనిపిస్తున్నాయి. నడిరోడ్డుపై ప్రజలను చితకబాదడం, చిరువ్యాపారులపై ప్రతాపం చూపడం, మద్యం తాగి ఒళ్లు తెలియకుండా పడిపోవడం లాంటి ఘటనలు పోలీసులను మరింత చులకన చేస్తున్నాయి. శాఖలో అంతర్గత సంబంధాల్లోనూ కర్కశత్వం రాజ్యమేలడం గమనార్హం. కిందిస్థాయి సిబ్బంది పట్ల చిన్నచూపు, నియంతృత్వ వైఖరి, ప్రతీకార ధోరణులకు పాల్పడే ధోరణులు అంతకంతకూ తీవ్రమవుతుండటం కూడా పోలీసు వ్యవస్థలో అతిపెద్ద సమస్యగా మారింది.
సహజంగా రాజ్యం చేసే ప్రతి పనికి వత్తాసు పలకడం పోలీసు వ్యవస్థ పని. అందుకనే అధిపత్యం, పీడన ఆ వ్యవస్థకు అలవాటుగా మారిపోయాయి. సమాజంలో నెలకొన్న అవినీతిని వెలికితీయాల్సిన వ్యవస్థ అవినీతిలో కూరుకుపోతోంది. ఇప్పుడు నేరాల మకిలి కూడా అంటించుకుంటోంది. ప్రజాస్వామిక దృక్ఫథంతో ప్రజలను రక్షించే వ్యవస్థగా పోలీసుశాఖ మారడం కష్టతరమైనప్పటికీ జరగాల్సిన అది అవసరం ఉంది. ‘ప్రెండ్లీ పోలీస్‌’ వంటి నినాదాలు ఎన్ని ఇచ్చినప్పటికీ, సంస్థాగతంగా మారకుండా ప్రజా’రక్షకులు’గా పేరు తెచ్చుకోలేరు.

Spread the love