కొనసాగుతున్న నామినేషన్ల ప్రక్రియ

– ఐదు నియోజకవర్గాల్లో ఇప్పటివరకు 52 మంది అభ్యర్థులు నామినేషన్లు
– జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్‌ ప్రియాంక అల
నవతెలంగాణ-పాల్వంచ
ఈ నెల 3వ తేదీ నుండి ప్రారంభమైన నామినేషన్ల ప్రక్రియలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు 52 మంది అభ్యర్థులు నా మినేషన్లు దాఖలు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్‌ ప్రియాంక అల బుధవారం తెలిపారు. పినపాక లో 7 గురు, ఇల్లందులో 13 మంది, కొత్తగూడెంలో 15 మంది, అశ్వారావుపేటలో 9 మంది, భద్రాచలంలో 8 మంది నామినేషన్లు దాఖలు చేసినట్లు చెప్పారు. నామినేషన్ల స్వీకరణకు రెండు రోజులు సమయం మాత్రమే మిగిలి ఉన్నందున రిటర్నింగ్‌ అధికారుల కార్యాలయాల్లో రద్దీ ఉండే అవకాశం ఉందని ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలతో సిద్ధంగా ఉండాలని ఆర్వోలకు సూచించారు. నామినేషన్స్‌ వేసేందుకు ఇంకా కేవలం రెండు రోజులు మాత్రమే అనగా 9, 10వ తేదీలు మాత్రమే ఉన్నందున నామినేషన్స్‌ వేసేందుకు అధిక సంఖ్యలో వస్తే ఇబ్బందులు రాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని చెప్పారు. రిటర్నింగ్‌ అధికారుల కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన హెల్ప్‌ డెస్క్‌ ద్వారా నామినేషన్‌ వేయుటలో పాటించాల్సిన నియమ నిబంధనలపై అభ్యర్థులకు అవగాహన కల్పించాలని చెప్పారు. అధిక సంఖ్యలో నామినేషన్‌ దాఖలు చేయడానికి అభ్యర్థులు వస్తే సీరియల్‌ నంబర్లుతో టోకెన్లు జారీ చేయాలని, టోకెన్లు క్రమసంఖ్య ప్రకారం నామినేషన్స్‌ తీసుకోవాలని చెప్పారు. నామినేషన్‌ తీసుకున్న తేదీ, సమయం తప్పనిసరిగా రిజిస్టర్లులో నమోదు చేయాలని చెప్పారు. నామినేషన్‌ వేసేందుకు ఐదుగురికి అలాగే మూడు వాహనాలకు మాత్రమే అనుమతి ఉందని చెప్పారు. ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 3 గంటల వరకు మాత్రమే సమయం ఉన్నట్లు ఆమె చెప్పారు.

Spread the love