– 2023లో 53 లక్షల భారతీయ ఖాతాల గుర్తింపు
న్యూఢిల్లీ : గతేడాదిలో మొత్తంగా 53లక్షల భారతీయ ఆన్‌లైన్ ఖాతాలు డేటా ఉల్లంఘనకు గురయ్యాయని ఒక నివేదిక వెల్లడించింది. ప్రయివేట్ వర్చువల్ నెట్‌వర్క్ ప్రొవైడర్ సర్ఫ్‌షార్క్ సోమవారం వార్షిక నివేదికను విడుదల చేసింది. ‘విశ్వసనీయమైన, సున్నితమైన డేటా అనధికార తృతీయ పక్షానికి వెల్లడైంది.” అని ఆ నివేదిక వ్యాఖ్యానించింది. ఆన్‌లైన్ సర్వీసుల కోసం రిజిస్టర్ కావడానికి ఉపయోగించిన ఈ మెయిల్ అడ్రస్‌లను లీక్ చేయడం జరిగింది. పాస్‌వర్డ్స్, ఫోన్ నెంబర్లు, ఇంటర్‌నెట్ ప్రొటోకాల్ అడ్రస్‌లు, జిప్ కోడ్‌లు, డేటా వంటి అదనపు సమాచారంతో ఈ ఖాతాలు లీకయ్యాయని ఆ నివేదిక తెలిపింది. 2023లో ప్రతి నిముషానికి దాదాపు 10 భారతీయ ఖాతాలు లీకయ్యాయని తెలిపింది. ప్రతి వెయ్యి ఖాతాల్లో నాలుగు ఉల్లంఘించబడ్డాయని పేర్కొంది. అత్యంత ఎక్కువగా డేటా ఉల్లంఘనలకు బాధపడిన దేశాల్లో భారత్ ఐదవ స్థానంలో నిలిచిందని నివేదిక పేర్కొంది. గతేడాది జనవరిలో భారతీయ దుస్తుల తయారీ సంస్థ కేవల్ కిరణ్ క్లోతింగ్ నుంచి అత్యంత ఎక్కువగా డేటా ఉల్లంఘనలు చోటు చేసుకున్నాయి. మొత్తంగా 12,32,580 యూజర్ ఖాతాలు లీకయ్యాయి. రెండవది ఫర్నిచర్ అండ్ ఎలక్ట్రానిక్ అప్లయన్స్ రెంటల్ సర్వీస్ రెంటోమోజోలో ఏప్రిల్‌లో జరిగింది.