ఒకటికి నాలుగు రెట్ల ప్రతీకారం అమెరికా అధ్యక్షుడికి ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్
-చమురు పైప్‌లైన్లను పేల్చేస్తామని ట్రంప్ బెదిరింపులు
-రష్యాలో ఇరాన్ విదేశాంగమంత్రి అబ్బాస్ అరాగ్చీ
వాషింగ్టన్..టెహ్రాన్: రెండో విడత శాంతి చర్చల వేళ వడ్రోజుల్లో ఒప్పందం కుదుర్చు కోవాలని, లేకపోతే చమురు పైప్‌లైన్లను పేల్చేస్తాని ఇరాన్‌కు అమెరికా అధ్యక్షడు డోనాల్డ్ ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. దీనిపై ఇరాన్ తీవ్రంగా స్పందించింది. దేశ మౌలిక సదుపాయాలకు నష్టం కలిగించే ఏ విషయానికైనా మద్దతు ఇచ్చే దేశాలపై నాలుగు రెట్లు ప్రతీకారం తీర్చుకుం టామని ఇరాన్ ఉపాధ్యక్షుడు ఇస్మాయిల్ సగ్‌హబ్ ఇస్ఫహానీ తెలిపారు. ఈ మేరకు ఎక్స్‌లో పోస్ట్ చేశారు.’ఇరాన్ మౌలిక సదుపాయాలపై ఏ దాడి జరిగినా దానికి ప్రతిస్పందనగా తీవ్రమైన చర్యలు తీసుకుంటాం. దిగ్బంధం ఫలితంగా చమురు క్షేత్రాలతో పాటు మా దేశ మౌలిక సదుపాయాల్లో దేనికైనా నష్టం జరిగితే సహించం. అందుకు మద్దతు ఇచ్చే దేశాల్లోని అదే మౌలిక సదు పాయాలకు నాలుగు రెట్ల నష్టం కలిగిస్తామని మేం హామీ ఇస్తున్నాం. మా లెక్కలు వేరు. ఒక చమురు బావి అంటే నాలుగు చములు బావులు’ అని ఇస్మాయిల్ సగ్‌హబ్ తెలిపారు.
మిత్రదేశమే కానీ..
పాకిస్తాన్ తమకు మంచి మిత్ర దేశమేనని కానీ చర్చలకు సరైన మధ్యవర్తి కాదని రెజాయి అన్నారు. మధ్యవర్తిత్వానికి అవసరమైన విశ్వసనీయత పాక్?కు లేదని పేర్కొన్నారు. పాక్, అమెరికా ప్రయోజనాలకు అనుగుణంగా ప్రవర్తిస్తుందని, కానీ ఆ దేశ వైఖరిని సవాలు చేయడాన్ని అసలు సహించదని అన్నారు. లెబనాన్ విషయంలోనూ అమెరికా అంగీకరించలేని విధంగా డిమాండ్లను తెరపైకి తీసుకొచ్చిందని, ఆ సమయంలో పాక్ నేతలు ఎవరూ అడ్డు చెప్పలేదని గుర్తు చేశారు. మధ్యవర్తులు నిష్పక్షపాతంగా ఉండాలే కానీ, ఒకరివైపు ఉండటం కరెక్ట్ కాదని తెలిపారు. చర్చల విషయంలో ఇప్పటివరకు పాక్ నేతలు చేసిన చర్యలు చూస్తే వారు నిష్పక్షపాతంగా వ్యవహరించగలరా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయని అన్నారు.
సెనెట్‌లోనూ భంగపాటేనా ?
తాజా సమాచారం ప్రకారం ట్రంప్‌ను కేవలం 33 శాతం మంది మాత్రమే సమర్థిస్తున్నారు. ఆయన రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత రేటింగ్ ఇంత దారుణంగా పడిపోవడం ఇదే మొదటిసారి. ఇరాన్ యుద్ధం, వలసదారులపై ఉక్కుపాదం, ద్రవ్యోల్బణం సహా పలు సమస్యల విషయంలో ట్రంప్ వ్యవహార శైలిపై అమెరికన్లలో నెలకొన్న భయాందోళనల కారణంగా ఆయన రేటింగ్ పడిపోతోంది. 62 శాతం మంది అమెరికన్లు ట్రంప్ పనితీరుపై అసమ్మతి వ్యక్తం చేశారు. ఈ పరిణామం మధ్యంతర ఎన్నికలపై తప్పనిసరిగా ప్రభావం చూపుతుందని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ప్రతినిధిసభతో పాటు సెనెట్‌లో కూడా రిపబ్లికన్లు మెజారిటీ కోల్పోవచ్చునని తాజా పోల్స్ చెబుతు న్నాయి. కొన్ని నెలల క్రితం వరకూ అసాధ్యంగా కన్పించిన పరిస్థితి ఇది. ప్రస్తుతం 40 స్థానాల ఫలితాలపై ఎటూ చెప్పలేని పరిస్థితి నెలకొంది. ప్రతినిధిసభపై పట్టు సాధించడానికి డెమొక్రాట్లకు కేవలం మూడు స్థానాలు అదనంగా లభిస్తే సరిపోతుంది. ఇక సెనెట్ విషయానికి వస్తే ఒకప్పుడు రిపబ్లికన్లకు కంచుకోటలుగా ఉన్న లోవా, ఓహియో, టెక్సాస్ వంటి రాష్ట్రాలలో ఇప్పుడు అనూహ్యంగా తీవ్ర పోటీ నెలకొని ఉంది. చారిత్రకంగా చూస్తే అమెరికాలో అధికారంలో ఉన్న పార్టీ మధ్యంతర ఎన్నికలలో సగటున 22 స్థానాలను కోల్పోతోంది.
అన్నీ సవాళ్లే
ట్రంప్ అధికారంలోకి రావడానికి ఉపకరించిన ఏకైక అంశం వలసలు. ఇప్పుడు ఆ సమస్యే ఆయనకు గుదిబండలా మారింది. ఇప్పుడు పౌర స్వేచ్ఛ, పౌర హక్కులు వంటి అంశాలు ముందుకొచ్చాయి. ఇరాన్ యుద్ధం ట్రంప్ విదేశాంగ విధాన వైఫల్యమేనని చెప్పాలి. ఈ యుద్ధం రిపబ్లికన్ల సిద్ధాంతానికే వ్యతిరేకం. యుద్ధం కారణంగా అమెరికా అనేక నాటో మిత్ర దేశాలను దూరం చేసుకుంది. స్వదేశంలో పెట్రోల్ ధరల పెరుగుదల ట్రంప్ ప్రతిష్టను దిగజార్చింది. ఇరాన్ యుద్ధం అమెరికా ఖజానాను ఖాళీ చేస్తోంది. అందుకే ఈ ఊబి నుంచి బయటపడడానికి ట్రంప్ శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. గత 12 నెలల కాలంలో అమెరికాలో నిరుద్యోగ రేటు 4.7 శాతానికి పెరిగింది. అమెరికాను కుదిపేసిన ఎప్‌స్టీన్ ఫైల్స్ కుంభకోణం విషయంలో ట్రంప్ ప్రభుత్వం గోప్యతను పాటించడాన్ని అమెరికన్లు జీర్ణించుకోలేక పోతున్నారు. అయితే ఇక్కడ ఓ విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంది. ట్రంప్ వైఖరి కారణంగా రిపబ్లికన్లు అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ అమెరికా ఓటర్లలో ఇప్పటికీ డెమొక్రాట్లపై సానుకూలత కన్పించడం లేదన్న విషయాన్ని మరువకూడదు.
అత్యవసరాలపై ఇరాన్ దృష్టి తిరిగి సాధారణస్థితిలోకి జనజీవనం
ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో జనజీవనం తిరిగి సాధారణ స్థితికి చేరుతోంది. మార్కెట్లు, కేఫ్‌లు, దుకాణాల తలుపులు తెరుచుకున్నాయి. రహదారులపై వాహనాల రాకపోకలు పెరిగాయి. ప్రజలకు నిత్యావసరాలను అందుబాటులో ఉంచే విషయంపై ఇరాన్ ప్రభుత్వం దృష్టి సారించింది. అత్యవసరమైనవిగా భావించిన వాటినే ప్రజలు కొనుగోలు చేస్తున్నారు. అయితే తిరిగి యుద్ధం ప్రారంభమైతే పరిస్థితి ఎలా ఉంటుందోనన్న భయాందోళనలు మాత్రం టెహ్రాన్ వాసులను వీడడం లేదు. దీంతో ప్రభుత్వం ఆహారం, మందుల సరఫరాలకు కొరత లేకుండా చర్యలు తీసుకుంటోంది. గోధుమలు, మందులు, వైద్య పరికరాలు వంటి ముఖ్యమైన నిత్యావసరాల సేకరణ కోసం ప్రత్యేక కేటాయింపులు జరిపింది. చమురు, గ్యాస్ విక్రయాలలో తనకు లభించే సొమ్ములో మూడున్నర బిలియన్ డాలర్లను నిత్యావసరాల దిగుమతుల కోసం వినియోగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంతేకాక సావరిన్ వెల్త్ ఫండ్ నుంచి కొంత మొత్తాన్ని నిత్యావసరాల కొనుగోలుకు కేటాయిస్తారు. చక్కెర, బియ్యం, బార్లీ, మొక్కజొన్న, సోయాబీన్ మీల్, రెడ్ మీట్, చికెన్ మీట్ దిగుమతుల కోసం జాతీయాభివృద్ధి నిధి నుంచి మిలియన్ డాలర్లు తీసుకుంటారు.
పశ్చిమాసియాలో శాంతి కోసం కృషి చేస్తా : రష్యా అధ్యక్షుడు పుతిన్
పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధాన్ని నివారించి శాంతి కోసం కృషి చేస్తానని రష్యా అధ్యక్షుడు పుతిన్ హామీ ఇచ్చారు. ఓవైపు ఇరాన్‌ను రెచ్చగొట్టేలా ట్రంప్ రోజుకో ప్రకటన చేస్తున్నారు. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయిల్ మధ్య యుద్ధోన్మాదానికి తెరపడటం లేదు. ఈ నేపథ్యంలో ఇరాన్ విదేశాంగ మంత్రి రష్యా అధ్యక్షుడు పుతిన్‌ని కలవగా పై విధంగా స్పందించారు.
దౌత్యంపై ట్రంప్‌నకు ఆసక్తి ఉందా ?
రష్యాలో ఇరాన్ విదేశాంగమంత్రి అబ్బాస్ అరాగ్చీ
అమెరికాతో జరిగిన చర్చల వివరాలు తెలిపేందుకు పుతిన్‌తో భేటీ
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌నకు నిజంగా దౌత్య యత్నాలపై ఆసక్తి ఉన్నదా అని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ అనుమానం వ్యక్తం చేశారు. అమెరికా ప్రతినిధి బృందం పాకిస్తాన్ పర్యటనను ట్రంప్ రద్దు చేసిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్య చేశారు. ఇప్పటి వరకూ అమెరికాతో జరిగిన చర్చల వివరాలను రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్‌రోవ్, ఇతర అధికారులకు తెలియజేసేందుకు అరాగ్చీ సోమవారం సెయింట్ పీటర్స్‌బర్గ్ చేరు కున్నారు. కాల్పుల విరమణ ఒప్పందం పరిస్థితి, తాజా పరిణామాలను కూడా వారికి వివరిస్తారు.
భారత నౌకపై ఇరాన్ కాల్పులు ఒమన్ తీర సమీపంలో టోగో దేశ జెండాతో వెళ్తుండగా దాడి
ఒమన్ తీర సమీపంలో భారతీయ సిబ్బందితో వెళ్తున్న నౌకపై ఇరాన్ కోస్ట్‌గార్డ్ దళాలు కాల్పులు జరిపాయి. ఈ విషయాన్ని కేంద్ర ఓడరేవులు, నౌకా రవాణా, జలమార్గాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. టోగో దేశ జెండాతో వెళ్తున్న ఎంటీ సిరాన్ అనే చమురు నౌకపై శనివారం ఈ దాడి జరిగినట్టు తెలిపింది. ఇతర నౌకలతో పాటు ఎంటీ సిరాన్ కలిసి ప్రయాణిస్తుండగా ఇరాన్ తీర రక్షకదళం దానిని అడ్డగించి, హెచ్చరికగా పలు రౌండ్ల కాల్పులు జరిపినట్టు పేర్కొంది. తమ అనుమతి లేకుండా వెళ్తే నౌకలను వదిలిపెట్టబోమని ఇరాన్ స్పష్టం చేసిన విషయం విదితమే. అయితే అక్కడి పరిస్థితులను పర్యవేక్షించడానికి విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ , భారత రాయబార కార్యాలయాలు అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలిపింది. నౌకలోని సిబ్బంది సురక్షితంగా ఉన్నట్టు వెల్లడించింది.
పాకిస్తాన్ మధ్యవర్తిత్వంపై ఇరాన్ ప్రశ్నలు
అమెరికా- ఇరాన్ రెండో విడత చర్చల అనిశ్చితి నేపథ్యంలో పాకిస్తాన్ మధ్యవర్తిత్వంపై ఇరాన్ కీలక వ్యాఖ్యలు చేసింది. పాకిస్తాన్ తటస్థ వైఖరితో సమర్థవంతంగా వ్యవహరించగలదా అని ఇరాన్ ఎంపీ, జాతీయ భద్రత విదేశాంగ విధాన కమిషన్ అధికార ప్రతినిధి ఇబ్రహీం రెజాయీ ప్రశ్నించారు. పాక్ సరైన మధ్యవర్తి కాదని, ఇస్లామాబాద్‌లో దౌత్యానికి అనుకూల పరిస్థితులు లేవని తెలిపారు. ఇరాన్ పార్లమెంట్‌లో మాట్లాడుతూ ఈ మేరకు రెజాయి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
రిపబ్లికన్లకు మధ్యంతరం ముప్పు నానాటికీ పడిపోతున్న ట్రంప్ రేటింగ్ పెరుగుతున్న ప్రజా వ్యతిరేకత
అమెరికాలో మధ్యంతర ఎన్నికలు జరగడానికి ఇంకా ఏడు నెలల సమయం ఉంది. ట్రంప్ ప్రభుత్వ పనితీరుపై అమెరికా ప్రజలలో వ్యక్తమవుతున్న వ్యతిరేకత నేపథ్యంలో రిపబ్లికన్లకు ఈ ఎన్నికలు అగ్నిపరీక్షగా నిలవబోతున్నాయి. 2024లో శ్వేతసౌధంలో అధికారం చేపట్టిన నాటి నుంచి ట్రంప్ చర్యల కారణంగా ఆయన ప్రాభవం సన్నగిల్లిపోతోంది. అనేక సర్వేలు కూడా ఇదే విషయాన్ని సూచిస్తున్నాయి. అమెరికాలో అధికారంలో ఉన్న పార్టీ మధ్యంతర ఎన్నికలలో ఓడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ విషయం ట్రంప్‌నకు బాగా తెలుసు. అమెరికా అధ్యక్షుడు నాలుగు సంవత్సరాలు పదవిలో ఉంటాడు. ఆ పదవీకాలం మధ్యలో జరిగేవే ఈ మధ్యంతర ఎన్నికలు. బరాక్ ఒబామా, బిల్ క్లింటన్, రోనాల్డ్ రీగన్ వంటి ప్రజాదరణ పొందిన, రెండుసార్లు అధికారంలో ఉన్న నేతలకే మధ్యంతర ఎన్నికలలో ఓటమి తప్పలేదు. వాస్తవానికి ప్రస్తుతం రిపబ్లికన్ల పరిస్థితి ఏమంత ఆశాజనకంగా లేదు.



