”లొంగదీసుకోవడం వీలు కానప్పుడు నడ్డి విరవడం ఒక్కటే మార్గం” అన్నదిగా ఉంది బీజేపీ సిద్ధాంతం. దానికి అనుగుణంగానే ఆమ్ ఆద్మీ పార్టీని నిలువునా చీల్చేసింది. మొన్నటిదాకా బీజేపీ మీద అగ్గి మీద గుగ్గిళమైన ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా తన సహచర ఎంపీలు ఏడుగురిని వెంటేసుకుని బీజేపీలో చేరిపోయారు. రాజ్యసభలో వడింట రెండువంతులమంది సభ్యులను ఎత్తుకుపోయిన తీరును ‘ఆపరేషన్ కమల్’గా ఆప్ అభివర్ణించింది. నిజానికి భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజ్యసభకు ఒక విశిష్టమైన స్థానం ఉంది. లోక్‌సభలో సంఖ్యాబలం ఉన్న ప్రభుత్వం ఒక్కోసారి ఆవేశపూరితమైన లేదా ఏకపక్ష నిర్ణయాలు తీసుకున్నప్పుడు, వాటిని మేధోపరంగా సమీక్షించి, రాష్ట్రాల ప్రయోజనాలను కాపాడటమే ఎగువ సభ ప్రధాన ఉద్దేశ్యం. అందుకే దీన్ని ‘కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్’ అని పిలుస్తారు. కానీ, ఇటీవల రాజ్యసభలో జరుగుతున్న పరిణామాలు గమనిస్తుం టే, ఈ వ్యవస్థ తన ప్రాముఖ్యతను కోల్పోతూ, ‘రాజ్యాంగ హననానికి’ వేదికగా మారుతోందా అన్న ఆందోళన కలగక మానదు.
బీజేపీ పాలనలో సాగుతున్న ఫిరాయిం పులతో ప్రజాస్వామ్యం పరిహాసం పాలవుతోంది. ఈడీ, సీబీఐ వంటి కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు దాడులు చేయడం… నిందితులుగా ఆరోపించబడినవారు ఆ తరువాత అధికార పార్టీలో చేరి తమ పంకిలాన్ని కడిగేసుకుని ‘పునీతులు’ అవడం పరిపాటిగా మారింది. ఈ ‘వాషింగ్ మెషీన్ రాజకీయాల’కు బీజేపీ పెట్టింది పేరు. ఆ క్రమంలోనే తాజా ఆప్ రాజ్యసభా పక్షం విలీనాన్ని చూడాలి. ఆప్ రాఘవ్ చద్దాను రాజ్యసభలో డిప్యూటీ లీడర్ పదవి నుంచి తప్పించింది. ఆ తరువాత డిప్యూటీ లీడర్ పదవిని పొందిన అశోక్ కుమార్ మిట్టల్ సంస్థలపై ఈడీ సోదాలు నిర్వహించింది. సరిగ్గా పది రోజులు తిరగకుండానే ఆయన సహా ఏడుగురు ఎంపీలు ఆప్‌కు రాజీనామా చేసి బీజేపీలో చేరారు. గత కొంతకాలంగా ఆప్‌తో విభేదిస్తున్న ఆ పార్టీ ఎంపీ స్వాతి మాలివాల్ ఒంటరిగా బయటకు వస్తే పదవి పోతుందని భావించి వేచి చూసి ఇప్పుడు వారితో చేతులు కలిపారు. మిట్టల్‌తో సహ ఈ ఏడుగురికి సంబంధించిన వారెవరిపైనా ఇక కేంద్ర దర్యాప్తు సంస్థల నీడ కూడా పడదు. కమల తీర్థం పుచ్చుకోవడంతోనే వారంతా పునీతులై పోతారు. అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ, కేంద్ర మంత్రి పూరీ వంటి ‘పునీతనేతల’ జాబితా చిన్నదేమి కాదు.
‘ప్రస్తుత రాజ్యాంగం పరిపాలనకు అడ్డంకిగా ఉంది, దీనిని మార్చేసి 2047 కల్లా కొత్త రాజ్యాంగం రూపొందించుకోవాలి’ అంటూ తారకమంత్రం వల్లించే కాషాయినేతలు అదే రాజ్యాంగంలోని పదవ షెడ్యూల్‌కు వక్రభాష్యం చెబుతూ ప్రతిపక్ష పార్టీలలోని నేతలకు గాలాలు వేస్తున్నారు. మరో పదినెలలలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పంజాబ్‌లో పాగా వేయడానికి అడ్డుగా ఉన్న అధికార పార్టీ ఆప్‌ను కొలుకోని దెబ్బకొట్టాలని గోతికాడ నక్కలా కాచుకు కూర్చున్న బీజేపీకి ‘రాఘవ్ చద్దా’ చక్కగా దొరికాడు. ఫిరాయించిన ఏడు గురిలో ఆరుగురు పంజాబ్ నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నవారే. పంజాబ్ ప్రజలకు బీజేపీ మరోసారి వెన్నుపోటు పొడిచిందన్న ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మాటలు అక్షర సత్యాలు. గతంలో మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ వంటి ఫిరాయింపుదార్లను ముందు పెట్టినా బీజేపీకి పరాభవం తప్పలేదు. అయినా బీజేపీ తీరు మారలేదు.
పంజాబ్‌లో ఆప్ అధికారంలో ఉన్నందువల్లే రాఘవ చద్దా, సందీప్ పాఠక్, రాజేంద్ర గుప్తా, హర్భజన్ సింగ్ లాంటి వారు ఎంపీలు కాగలిగారు. ఇప్పుడు ఈ ఏడుగురు మరే నూతన శిఖరాలు అధిరోహించ డానికి బీజేపీలో చేరారో తెలియదు. చెమటోడ్చి, రక్తం ధారపోసి తాను ఆ పార్టీ బలోపేతం చేస్తే ఇప్పుడాపార్టీ విలువలను, సూత్రాలను, నైతికతను వదిలేసినందువల్లే తాను రాజీనామా చేశానని రాఘవ చద్దా అంటున్నారు. పార్టీని వదిలి వెళ్లినప్పుడు అందరూ ఇలాంటి సూక్తి ముక్తావళే వల్లిస్తారు. ఆప్ విడనాడిన నైతికత, విలువలు చద్దా ఆయనతో పాటు రాజీనామ చేసిన వారికి బీజేపీలో కనిపిస్తున్నాయా? అన్నది పెద్ద ప్రశ్నగా మిగిలింది.
రాజ్యసభలో తన హోదాని తొలగించినప్పుడు చద్దా తన గురించి తాను చాలా చెప్పుకున్నారు. అనేక ప్రజాసమస్యలను సభలో ప్రస్తావించి, ప్రభుత్వం దృష్టికి తెచ్చి పరిష్కారం కోసం కృషిచేశానన్నారు. కానీ, ఇప్పుడు ఆప్ అధిష్టానం తన గొంతునొక్కేసి ఇంతకాలమూ తనను నోరువిప్పనివ్వలేదని అంటున్నారు. ఇకపైన, సభలో నూతన ఉత్సాహంతో, అంకితభావంతో ప్రజల పక్షాన పోరాడతానని హామీ ఇస్తున్నారు. కరడుగట్టిన బీజేపీ వ్యతిరేక పార్టీలో ఉండగా ప్రజల గురించి మాట్లాడలేకపోయానంటున్న వ్యక్తి ఇప్పుడు నేరుగా అధికారపక్షంలో చేరిన తరువాత ఏదో చేస్తానంటు న్నారు. గతంలో వామపక్షాల పాలనలో ఉన్న త్రిపురలో కాంగ్రెస్ నేతలను గుంపగుత్తగా చేర్చుకుని దొడ్డిదారిన అక్కడ అధికారంలోకి వచ్చింది కమలం పార్టీ. ఎన్నికల్లో ప్రజల ఓట్లతో తాను నేరుగా గెలవలేని రాష్ట్రాల్లో బీజేపీ అనుసరిస్తున్న కుటిల నీతి ఇదే! ప్రజాస్వామ్యాన్ని భ్రష్టు పట్టించే ఇటువంటి దుర్విధానాల పట్ల ప్రజలు అప్రమత్తంగా వుండాలి. కమలనాథుల కుట్రలను వమ్ముచేయాలి. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి! రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి!!
పు’నీతు’లు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



