Tuesday, April 28, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిశివాజీ విగ్రహాల వెనుక…

శివాజీ విగ్రహాల వెనుక…

- Advertisement -

తెలంగాణతో సహా దేశవ్యాప్తంగా గ్రామ గ్రామాన శివాజీ మహారాజు విగ్రహాలు ఇటీవల అత్యధిక సంఖ్యలో వెలుస్తున్నాయి. ఇది సాంస్కృతిక ఉద్యమం కాదు. అది ఒక లోతైన రాజకీయ-సామాజిక మార్పిడి. హిందూ ధర్మ సమాజ రక్షణ అనే నేపథ్యంలో దేశభక్తిని తన లక్ష్యంగా చూపించి, వాస్తవంలో హిందూ కాషాయీకరణను గ్రామస్థాయిలో నాటుతున్న వ్యూహాత్మక ప్రయత్నం. గతంలో స్వాతంత్య్ర సమరయోధులు, జాతీయ నాయకుల విగ్రహాలు ఏకైక గ్రామీణ చిహ్నాలుగా ఉండేవి. ఇప్పుడు ఆ స్థానాన్ని శివాజీ ఆక్రమిస్తున్నారు. శివాజీకూడా మరాఠా యోధుడు. అందులో సందేహం లేదు. తమకంటూ చెప్పుకోవడానికి, స్వాతంత్య్ర ఉద్య మంలో పోరాటం చేసినవారు ఎవరూ లేకపోవడంతో ప్రజల్ని తమవైపు మళ్లించుకోవాలనే దుష్ట పన్నాగమిది. కొంతకాలం వల్లభారు పటేల్‌ పేరుతో ఇప్పుడు శివాజీ పేరుతో రాజకీయాలు చేస్తోంది.ఈ మార్పు లోతును అర్థం చేసుకోవాలంటే, దాని వెనుక ఉన్న ఆరెస్సెస్‌ కార్యకలాపాలు, బీజేపీ రాజకీయ లాభాలు, సినిమా సాధనం వంటి అంశాలను సమగ్రంగా విశ్లేషించాలి.

గత కాలంలో గ్రామాల్లో భగత్‌ సింగ్‌, జవహర్‌లాల్‌ నెహ్రూ, డా.బి.ఆర్‌. అంబేద్కర్‌, మహాత్మా గాంధీ, సర్దార్‌ వల్లభాయ్ పటేల్‌, ఇందిరా గాంధీ, స్వామి వివేకానందల విగ్రహాలు మాత్రమే ప్రతిష్టితమవుతుండేవి. ఇవి భారత స్వాతంత్య్ర పోరాటం, సమాజ సంస్కరణ, లౌకికత్వం, ఐక్యత వంటి విలువలను ప్రతిబింబించేవి. ఈ విగ్రహాలు ఏ ఒక్క మతం లేదా సంప్రదాయానికి పరిమితం కాకుండా, మొత్తం జాతిని ఒక్కటి చేసే చిహ్నాలుగా నిలిచాయి. కానీ ఇప్పుడు ఆ స్థానాన్ని శివాజీ విగ్రహాలు ఆక్రమించడం యాదృచ్ఛికం కాదు. ఇది ఆరెస్సెస్‌ సంస్థలు గ్రామ స్థాయిలో నిర్వహిస్తున్న చురుకైన కార్యక్రమాలు, హిందూ ధార్మిక మహాసభలతో ముడిపడి ఉంది. ప్రతి గ్రామంలో అట్టహాసంగా వేడుకలు, ఉత్సవాలు నిర్వహించడం ద్వారా ఈ విగ్రహాలను కేవలం చారిత్రక వ్యక్తిగా కాకుండా, ”హిందూ సమాజ రక్షకుడు”గా స్థాపించడం జరుగుతోంది.

ఈ ప్రక్రియకు ఇటీవలి కాలంలో ఒక బలమైన సాంస్కృతిక ఆయుధం లభించింది ‘చావా’ చిత్రం. గతేడాది విడుదలైన ఈ సినిమా శివాజీ తనయుడు సంభాజీ మహారాజు వీరత్వం, ధైర్యం, హిందూ సమాజ రక్షణను కేంద్రంగా చిత్రీకరించి భారతీయ ప్రజల మనసుల్లో గాఢంగా నాటుకుపోయింది. కానీ ఇది ఒక్కటే కాదు. ‘కాశ్మీర్‌ ఫైల్స్‌’ (2022), ‘ది కేరళ స్టోరీ’ (2023) వంటి చిత్రాలు కూడా ఇదే వ్యూహంలో భాగమయ్యాయి. కాశ్మీర్‌ ఫైల్స్‌ కాశ్మీరీ పండిట్ల బాధలను గ్రాఫిక్‌గా చూపి ముస్లింలను సాధారణీకరించి హింసాత్మకులు, ద్రోహులుగా చిత్రీకరించింది. కేరళ స్టోరీ ‘లవ్‌ జిహాద్‌’ అనే వివాదాస్పద థీరీని ఆధారం చేసుకొని ముస్లిం యువకు లను హిందూ-క్రిస్టియన్‌ అమ్మాయిలను ఆకర్షించి ఉగ్రవాదంలోకి నెట్టేవారిగా చూపి సామాజిక ధ్రువీకరణను రెచ్చ గొట్టింది. ఈ చిత్రాలన్నింటినీ భారతీయ జనతా పార్టీ సమర్థవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్లింది. సినిమా ద్వారా సఅష్టించిన భావోద్వేగాన్ని రాజకీయంగా ఉపయోగించుకోవడం బీజేపీ వ్యూహంలో కొత్త కాదు. కానీ ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఈ చిత్రాలు దేశభక్తిని కాకుండా, హిందూ ధర్మ రక్షణను ప్రధాన థీమ్‌గా ఎత్తిచూపి బీజేపీ-ఆరెస్సెస్‌ కలయిక ద్వారా జరుగుతున్న ”కాషాయీకరణ” ప్రక్రియకు బలం చేకూరుస్తున్నాయి.

ఈ వ్యూహం లోతైన అర్థం ఏమిటి? ఇది రాజకీయ లబ్ధి కోసం చేసే లెక్కలు. గ్రామ స్థాయిలో హిందూ ఐక్యతను సృష్టించడం ద్వారా బీజేపీ తన ఓటు బ్యాంకును విస్తరించుకోవాలని చూస్తోంది. దేశభక్తి అనే ఉదాత్తమైన భావనను హిందూ ధర్మ సంరక్షణతో ముడిపెట్టడం ద్వారా, మతపరమైన ధ్రువీకరణను ప్రోత్సహిస్తుంది. ఇది భారతదేశం లౌకిక స్వభావాన్ని, సమగ్ర జాతీయతను క్రమంగా కుంచించుతుంది. గతంలో జాతీయ నాయకుల విగ్రహాలు స్వాతంత్య్ర సమరం, సామాజిక న్యాయం, మతనిరపేక్షత వంటి విలువలను ప్రతిబింబిం చాయి. వాటిని భర్తీ చేస్తున్న శివాజీ విగ్రహాలు మాత్రం ఒక నిర్దిష్ట చారిత్రక సందర్భంలోని మరాఠా యోధుడిని, మొఘల్‌ సామ్రాజ్యంతో (అంటే ముస్లిం పాలనతో) జరిగిన సంఘర్షణను హిందూ-ముస్లిం దృష్టికోణంలో చూపించడం ద్వారా సమాజంలో ఇప్పటికే ఉన్న విభేదాలను మరింత లోతుగా చేస్తాయి.

ఆరెస్సెస్‌ దీర్ఘకాలిక సాంస్కృతిక ప్రాజెక్ట్‌ ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. గ్రామాల్లో ధార్మిక మహాసభలు, కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా హిందూ సమాజాన్ని ఒక రాజకీయ బ్లాక్‌గా మార్చడం జరుగుతోంది. బీజేపీ దీన్ని ఎన్నికల లాభంగా మార్చు కోవడం సహజం. కానీ ఈ ప్రక్రియ దేశం మొత్తం సామాజిక సామరస్యానికి, లౌకిక రాజ్యాంగ విలువలకు ఎంత పెద్ద సవాలుగా మారుతుందో గుర్తించాలి. జాతీయ నాయకుల విగ్రహాలు ఏకత్వాన్ని నిర్మించాయి. శివాజీ విగ్రహాలు మాత్రం ఒక నిర్దిష్ట ధార్మిక గుర్తింపును బలపరుస్తాయి. ఇది భారతదేశం వైవిధ్యభరితమైన సమాజాన్ని ఒక ఏకపక్ష హిందూ దృక్పథంతో చూడడానికి దారితీ స్తుంది. ఈ నేపథ్యంలో ఒక విషయం స్పష్టం – దేశభక్తి నిజమైనది కావాలంటే అది అన్ని వర్గాలను, అన్ని మతాలను కలుపుకొని ఉండాలి. హిందూ కాషాయీకరణ ద్వారా రాజకీయ లాభాలు పొందడం స్వల్పకాలిక విజయం కావచ్చు, కానీ దీర్ఘకాలికంగా దేశ ఐక్యత, సామాజిక స్థిరత్వానికి హాని చేస్తుంది. గ్రామాల్లో శివాజీ విగ్రహాలు ఎంత భారీగా వెలుస్తున్నాయో, అంతగా మనం ఆలోచిం చాలి -ఇది నిజంగా దేశాన్ని బలపరుస్తుందా, లేక ఒక నిర్దిష్ట రాజకీయ ఎజెండాను గ్రామస్థాయి నుంచి బలపరు స్తుందా? ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వడం భారతీయ ప్రజాస్వామ్య భవిష్యత్తుకు కీలకం.
కాలగిరి శ్రీనివాస్‌ రెడ్డి

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -