Monday, June 22, 2026
E-PAPER
Homeమానవివిద్యారంగంలో ఆదర్శమూర్తి పామర్తి పద్మావతి

విద్యారంగంలో ఆదర్శమూర్తి పామర్తి పద్మావతి

- Advertisement -

​విద్యారంగంలోనూ, సేవారంగంలోనూ తనదైన ముద్ర వేసుకున్నారు. గాంధీజీ ఆశయాలను నిజం చేస్తున్న అసాధారణ విద్యావేత్తగా, అధ్యాపకురాలిగా గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ఆమే పామర్తి పద్మావతి. కేవలం 48 మంది పిల్లలతో ‘శ్రీరామకృష్ణ విద్యానికేతన్ హైస్కూల్’ను స్థాపించి, మురికివాడల పిల్లల జీవితాల్లో విద్యా వెలుగులు నింపారు. చదువుతో పాటు ఆటపాటలు, పద్యపఠనం వంటి పాఠ్యేతర అంశాల్లో పిల్లలను ప్రోత్సహించారు. వారిని ఎన్నో పోటీల్లో విజేతలుగా నిలిపారు. విద్యార్థుల్లో దేశభక్తిని, సేవాభావాన్ని నూరిపోస్తూ.. అటు పిల్లలకు, ఇటు తల్లిదండ్రులకు ఎంతో ప్రియమైన గురువుగా మారారు. కాలక్రమేణా తన పిల్లలు పెద్దవారవడంతో పాఠశాల నిర్వహణ బాధ్యతల నుండి తప్పుకున్నప్పటికీ నేటికీ ఆమె సంఘసేవలోనే తన జీవితాన్ని కొనసాగిస్తూ సమాజానికి స్ఫూర్తినిస్తున్నారు.

పద్మావతి ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి ఎం.ఎ., , ఎం.ఎ. (ఫిలాసఫీ) పూర్తి చేశారు. అలగప్ప యూనివర్సిటీ నుండి ఎం.ఫిల్ (ఎడ్యుకేషన్), అన్నామలై యూనివర్సిటీ నుండి ఎం.ఈడి పట్టాలను పొందారు. పెండ్లి తర్వాత రెండేండ్లు రెసిడెన్షియల్ స్కూల్‌లో అధ్యాపకురాలిగా సేవలందించారు. బాబు పుట్టడంతో ఉద్యోగానికి విరామం ఇచ్చి, ఇంటి వద్దనే ట్యూషన్లు చెప్పడం ప్రారంభించారు. మూడేండ్ల తర్వాత పాప పుట్టింది. కుటుంబ బాధ్యతలను నిర్వర్తిస్తూనే సొంతంగా ‘పద్మావతి విద్యాసంస్థల’ను స్థాపించి పట్టుదలతో అంచెలంచెలుగా ఎదుగుతూ నేడు ఉన్నత శిఖరాలను అధిరోహించారు.

విద్యార్థుల జీవితాల్లో వెలుగులు
వేల మంది విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపిన ఆదర్శ మూర్తిగా ఆమె పేరు తెచ్చుకున్నారు. వినాయక్ నగర్‌లోని మురికివాడలో 25 ఏండ్ల పాటు పాఠశాలను నడుపుతూ, సుమారు 8,000 మంది పిల్లల భవిష్యత్తుకు ఆమె దారిదీపంగా నిలిచారు. నాడు ఆమె తీర్చిదిద్దిన విద్యార్థులు నేడు సమాజంలో వివిధ ఉన్నత రంగాల్లో రాణిస్తున్నారు. పిల్లలను కేవలం విద్యకే పరిమితం చేయకుండా వారు అనేక రంగాల్లో రాణించేలా ప్రోత్సహిస్తున్నారు. అలాగే ఆమె కేవలం విద్యారంగంలోనే కాక 2002 నుంచి ఒక ప్రముఖ ఎన్.జి.ఓ. ప్రతినిధిగా మహిళల, బాలికల సంక్షేమం కోసం నిరంతరం శ్రమిస్తున్నారు. ప్రస్తుతం మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా పరిధిలో ‘సఖీ’ కేంద్రం ద్వారా గృహ హింస బాధితులకు, లైంగిక హింసకు గురైన అభాగ్య పిల్లలకు అండగా నిలుస్తున్నారు. వారికి పునరావాసం కల్పిస్తూ అమ్మలా చేయూతనందిస్తున్నారు.

అంకిత భావానికి గుర్తుగా
​పదేండ్ల పాటు రెండు తెలుగు రాష్ట్రాలలో ఛైల్డ్ వెల్ఫేర్ కమిటి ఛైర్‌పర్సన్‌గా సేవలందించిన పద్మావతి సామాజిక రంగంలో విశేష అనుభవం గడించారు. ఒక వ్యూహాత్మక నాయకురాలిగా తనని తాను మలచుకున్నారు. ప్రస్తుతం ఆమె కస్తూర్బా గాంధీ నేషనల్ మెమోరియల్ ట్రస్ట్ ప్రతినిధిగా, వివిధ కంపెనీలకు గ్రీవెన్స్ రిడ్రెసల్ కమిటీ మెంబర్‌గా కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. విద్యా, సామాజిక రంగాలలో ఆమె కనబరిచిన అంకితభావానికి రంగారెడ్డి జిల్లా విద్యాశాఖ నుండి 2000లో ‘బెస్ట్ హెడ్ మిస్ట్రెస్ అవార్డు’ను, 2006లో ఇండోర్ కస్తూర్బా గాంధీ న ేషనల్ మెమోరియల్ ట్రస్ట్ నుండి ‘బెస్ట్ సోషల్ వర్కర్ అవార్డు’ను అందుకున్నారు. నిరంతర ఆమె చేస్తున్న సామాజిక సేవలను గుర్తిస్తూ 2012లో ‘బెస్ట్ ఎన్‌‌జీఓ రిప్రజెంటేటివ్ అవార్డు’, 2014లో ‘వోకేషనల్ ఎక్సలెన్సీ అవార్డు’లతో పాటు తెలంగాణ ప్రభుత్వ ‘బెస్ట్ ఎన్‌‌జీఓ’ పురస్కారం కూడా లభించింది. వీటితో పాటు ప్రతిష్టాత్మక అక్కినేని నాగేశ్వరరావు గోల్డ్ మెడల్, ఈనాడు వసుంధర అవార్డు వంటి మరెన్నో సత్కారాలు ఆమె కార్యదక్షతకు, సమాజం పట్ల ఆమెకున్న నిబద్ధతకు నిదర్శనాలుగా నిలుస్తున్నాయి

ఆదర్శ మహిళ – స్ఫూర్తిప్రదాత
​గాంధీజీ రచనలను, ఆయన ఆదర్శాలను మనసా, వాచా, కర్మణా ఆచరిస్తూ సమాజ సేవకే అంకితమైన నిరుపమాన వ్యక్తిత్వం పద్మావతిది. 2002 నుండి ఆమె ‘కస్తూరిబా గాంధీ నేషనల్ మెమోరియల్ ట్రస్ట్’ ఇన్‌ఛార్జ్‌గా అందిస్తున్న సేవలు ఎందరికో ఆదర్శం. మహిళా సాధికారత కోసం ఆమె ఎంతో పాటుపడ్డారు. ఆమె కృషికి ఫలితంగా 600 మంది మహిళలకు ఉపాధి అవకాశాలతో పాటు, పలువురు ఉద్యోగాలు పొందారు. అలాగే సామాజిక భద్రత కోసం కూడా ఆమె పని చేశారు. ‘స్వాధార్’, ‘ఉజ్వల’ హోమ్స్ నిర్వ హిస్తూ.. వృద్ధులకు, హ్యూమన్

ట్రాఫి కింగ్ (అక్రమ రవాణా) బాధితులకు అండగా నిలిచి ఆశ్రయం కల్పిస్తున్నారు. కుటుంబాల లో వస్తున్న సమస్యలు పరిష్కరించి భార్యాభర్తలు కలిసి వుండేలా ఎంతో మందికి కౌన్సెలింగ్‌ ఇస్తున్నారు. ఇప్పటి వరకు సుమారు 1200 మందికి కౌన్సెలింగ్ ఇచ్చి, వారిని కుటుంబాలతో తిరిగి కలిపారు. అలాగే పదకొండు మంది నిరుపేద యువతులకు వివాహాలు జరిపించారు. మహిళల ఆరోగ్యంపై దృష్టి పెడుతూ తక్కువ ధరకే శానిటరీ నాప్‌కిన్స్ అందజేస్తున్నారు. బాలల హక్కుల పరిరక్షణ తో పాటు వారి విద్యకై ప్రత్యేక కృషి చేస్తున్నారు.

​అంతర్జాతీయ గుర్తింపు
ఆమె నిరంతర కృషికి గానూ 2019లో మెక్సికోలో జరిగిన ‘గ్లోబల్ పీస్ జస్టిస్’ సమావేశంలోనూ, అదే ఏడాది ‘స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ’ అంతర్జాతీయ సమావేశంలోనూ పాల్గొనే అరుదైన గౌరవం దక్కింది. సమాజ మార్పు కోసం అలుపెరగక శ్రమిస్తున్న పద్మావతి నేటి తరానికి నిజమైన స్ఫూర్తిదాత, ఆదర్శ మహిళ అనడంలో ఎలాంటి సందేహం లేదు.
అచ్యుతుని రాజ్యశ్రీ

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -