విద్యార్థుల ప్రయోజనాల కోసమే బిల్లుల ఆమోదం

– కామన్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు బిల్లుపై ఆలస్యంగా రాష్ట్ర ప్రభుత్వ వివరణ
– యూజీసీ, ఇతర రాష్ట్రాల్లో అధ్యయనం చేసి రాష్ట్రపతికి సిఫారసు :వీసీల కాన్ఫరెన్స్‌లో గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌
– ఓయూ, కేయూ, జేఎన్టీయూ సహా ఐదుగురు ఉపకులపతుల గైర్హాజరు
– రాజ్‌భవన్‌లో డిజిటల్‌ లైబ్రరీ ప్రారంభం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
విద్యార్థుల ప్రయోజనాలు, వారి ఆకాంక్షలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం పంపిన బిల్లులను ఆమోదించడం, వెనక్కి పంపడం, తిరస్కరిండం చేశానని వర్సిటీల చాన్సలర్‌, గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ అన్నారు. సోమవారం హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో విశ్వవిద్యాలయాల ఉప కులపతుల (వీసీ) కాన్ఫరెన్స్‌ను నిర్వహించారు. రాజ్‌భవన్‌లో డిజిటల్‌ లైబ్రరీని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా గవర్నర్‌ మాట్లాడుతూ కామన్‌ యూనివర్సిటీ రిక్రూట్‌మెంట్‌ బోర్డు బిల్లుపై వివరణను రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగానని చెప్పా రు. ఏడాది ఆలస్యంగా ప్రభుత్వం వివరణణిచ్చిందన్నారు. యూజీసీ నిబంధనలు, ఇతర రాష్ట్రాల్లో నియామకాల ప్రక్రి య ఎలా ఉందనే దానిపై నిపుణులు, విద్యావేత్తలతో అధ్య యనం చేసి రాష్ట్రపతికి ఆ బిల్లును సిఫారసు చేశానని వివరిం చారు. ప్రయివేటు విశ్వవిద్యాలయాల బిల్లును కూడా ప్రభు త్వానికి తిప్పి పంపానని అన్నారు. అయితే ప్రభుత్వ విశ్వ విద్యాలయాలను తాను సందర్శించి అక్కడ మౌలిక వసతు లు, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వా నికి లేఖ రాశాననీ, అయినా స్పందన లేదన్నారు. ప్రభుత్వం తో కొన్ని ఇబ్బందులున్నాయని అన్నారు. విశ్వవిద్యా లయాల్లో విద్యార్థుల ఆత్మహత్యలు బాధాకరమన్నారు. బాసర త్రిపుల్‌ ఐటీలో ఆత్మహత్యల ఘటన కలచివేసిందని చెప్పారు. విద్యా ర్థులకు కౌన్సిలింగ్‌ ఇచ్చి పరివర్తన తేవాలని కోరారు. విద్యా ర్థులు విజ్ఞానం ఆకలితో ఉన్నారని, వారి ఆకాంక్షలకు అనుగు ణంగా విద్యనందించాలని సూచించారు. విశ్వవిద్యాల యాల్లో ఎన్‌ఈపీ-2020ని అమలు చేయాలన్నారు. ప్రపంచ స్థాయి లో కాకున్నా జాతీయ స్థాయిలోనూ వర్సిటీల ర్యాంకులు పడి పోవడం పట్ల ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. మౌలిక వసతు లు ముఖ్యంగా అమ్మాయిల మరుగుదొడ్లు, తరగతి గదుల సదుపాయాలపై దృష్టి సారించాలని కోరారు. స్వచ్ఛ భారత్‌ తరహాలో స్వచ్ఛ క్యాంపస్‌లుగా తీర్చిదిద్దాలని, హరిత వర్సిటీ లుగా మార్చాలని సూచించారు. ప్రాథమిక విద్యపై ముఖ్యం గా ఉన్నత విద్యపై దృష్టికేంద్రీకరించాలని చెప్పారు. ప్రాక్టికల్‌ ఎడ్యుకేషన్‌ అందించాలన్నారు. విద్యార్థులు ఉద్యోగాలు పొందే వారిగా కాకుండా ఇచ్చే వారిలాగా తయారు చేయాల ని అన్నారు. కెరీర్‌ గైడెన్స్‌, ప్లేస్‌మెంట్లు, కాంపిటీటివ్‌ పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యేందుకు శిక్షణ ఇవ్వాలని చెప్పారు. జి-20 సద స్సుపై అవగాహన కలిగించాలని సూచించారు.
అల్యూమ్ని సమావేశాలను నిర్వహించాలన్నారు. పరి శోధనలు, ఆవిష్కర ణలపై దృష్టిసారించాలని కోరారు. విద్యార్థుల ఆరోగ్యంపై హెల్త్‌ ప్రొఫైల్‌ తయారు చేయాలని వివరించారు. 70 శాతం మంది ఎనీమియాతో బాధపడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. సీపీఆర్‌ చాలెంజ్‌పై అవగాహన కల్పించాలని అన్నా రు. గవర్నర్‌ కార్యదర్శి సురేంద్ర మోహన్‌, యూజీసీ జాయింట్‌ సెక్రెటరీ అవిచల్‌ కపూర్‌, వీసీలు బి కరుణాకర్‌రెడ్డి, టి కిషన్‌రావు, ఎం విజ్జులత, వి రవీందర్‌రెడ్డి, బి నీరజ ప్రభా కర్‌, ఎన్‌ కవితా దర్యానీరావు, సిహెచ్‌ గోపాల్‌రెడ్డి, లక్ష్మికాంత్‌రాథోడ్‌, కె సీతారామారావుతోపాటు రిజిస్ట్రార్లు లక్ష్మినారాయణ, ఎం వెంకట రమణ, ఎం వరప్రసాద్‌ పాల్గొన్నారు. కాన్ఫరెన్స్‌లో ఓయూ, కేయూ, జేఎన్టీయూ, ఎస్‌యూ, టీయూ వీసీలు పాల్గొనకపోవడం గమనార్హం.

Spread the love