అభివృద్ధికి బాటలు వేయండి..ఆటంక పర్చకండి

– సత్తుపల్లిని జిల్లా చేయాలనే దృఢ సంకల్పం ఉంది
– సత్తుపల్లి బీఆర్‌ఎస్‌ అభ్యర్థి సండ్ర వెంకటవీరయ్య
నవతెలంగాణ-సత్తుపల్లి
సత్తుపల్లిని జిల్లాను చేయాలనే దృఢ సంకల్పం ఉందని, 10 జిల్లాలుగా ఉన్న తెలంగాణను 30కిపైగా జిల్లాలను చేసిన కేసీఆర్‌కు సత్తుపల్లిని జిల్లా చేయడం అంత పెద్ద పనేంకాదని సత్తుపల్లి అసెంబ్లీ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి సండ్ర వెంకటవీరయ్య స్పష్టం చేశారు. ఆదివారం సత్తుపల్లి మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో సండ్ర బీఆర్‌ఎస్‌ శ్రేణులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా వార్డుల్లో పలుచోట్ల సమావేశాలు ఏర్పాటు చేసి అక్కడి ప్రజలతో మాట్లాడారు. మళ్లీ అధికారంలోకి రాగానే మేనిఫెస్టోలో చెప్పిన హామీలన్నింటిని కేసీఆర్‌ అమలు చేయడం జరుగుతుందన్నారు. నియోజకవర్గ ప్రజల ఆశీర్వచనాలకు తోడుగా ప్రజల్లో కేసీఆర్‌ పట్ల, ఆయన అమలు చేస్తున్న పథకాలపై ప్రజా స్పందన అనూహ్యంగా ఉందన్నారు. గతంలో ఏ ప్రభుత్వాలు అమలు చేయలేని అనేక పథకాలను కేసీఆర్‌ చేసి చూపించారన్నారు. ప్రభుత్వం ఏర్పడగానే వచ్చే సంక్రాంతి నుంచి తెల్లకార్డు ఉన్న వారందరికి సన్నబియ్యాన్ని పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. రూ. 400లకే గ్యాస్‌బండ, పేదింటి మహిళలకు నెలకు రూ. 3వేలు అందిస్తారన్నారు. ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని, అభివృద్ధికి బాటలు వేయాలని, ఆటంక పర్చొద్దని సండ్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మెన్‌ కొత్తూరు ఉమామహేశ్వరరావు, మున్సిపల్‌ ఛైర్మెన్‌, డీసీసీబీ డైరెక్టర్‌ చల్లగుండ్ల కృష్ణయ్య, బీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్ష, కార్యదర్శులను ఎస్కే రఫీ, మల్లూరు అంకమరాజు, కౌన్సిలర్లు మట్టా ప్రసాద్‌, చాంద్‌పాషా, వేములపల్లి మధు, మేకల నరసింహారావు, నడ్డి ఆనందరావు పాల్గొన్నారు.
ఇంటింటి ప్రచారంలో సండ్ర సతీమణి మహాలక్ష్మి
నిత్యం ప్రజల మధ్యనే ఉంటూ ప్రజా సేవే పరమావధిగా భావించే ప్రజల మనిషి సండ్ర వెంకటవీరయ్యను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని సత్తుపల్లి బీఆర్‌ఎస్‌ అభ్యర్థి సండ్ర సతీమణి మహాలక్ష్మి ప్రజలను కోరారు. సోమవారం సత్తుపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 12, 14 వార్డుల పరిధిల్లో ఉన్న ద్వారకాపురి గాంధీనగర్‌ వీధుల్లో మహాలక్ష్మి జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మెన్‌ కొత్తూరు ఉమామహేశ్వరరావు, మున్సిపల్‌ ఛైర్మెన్‌ కూసంపూడి మహేశ్‌, డీసీసీబీ డైరెక్టర్‌ చల్లగుండ్ల కృష్ణయ్యలతో కలిసి ఆయా వీధుల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 12, 14 వార్డుల కౌన్సిలర్లు ఎండీ సలీమా ఖాతూమ్‌ గఫార్‌, గుండ్ర రాఘవేంద్ర, నాయకులు రుద్రాక్షల అప్పాచారి, గఫార్‌, యాసా రాంబాబు, కారంపుడి విద్యాసాగర్‌, వేల్పుల ప్రసాద్‌, జొన్నలగడ్డ విజరు, తడికమళ్ల సాల్మన్‌, అశోక్‌, నడ్డి నాగరాజు, హరనాధ్‌ పాల్గొన్నారు.

Spread the love