జీపీ కార్మికుల పెండింగ్‌ వేతనాలు చెల్లించాలి

– రూ.5 లక్షల ఇన్సూరెన్స్‌ పథకాన్ని అమలు చేయాలి
– మల్టీపర్పస్‌ వర్కర్‌ విధానం రద్దు చేసి పాత కేటగిరీలను కొనసాగించాలి
– ఎమ్మెల్యే కూనంనేనికి సీఐటీయూ వినతి
నవతెలంగాణ-కొత్తగూడెం
గ్రామ పంచాయతీ కార్మికుల పెండింగ్‌ వేతనాలు చెల్లించాలని, రూ.5 లక్షల ఇన్సూరెన్స్‌ పథకాన్ని అమలు చేయాలని, మల్టీపర్పస్‌ వర్కర్‌ విధానం రద్దు చేసి పాత కేటగిరీలను కొనసాగించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఏజే.రమేష్‌ ప్రభుత్వాన్ని కోరారు. శనివారం కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుకు వినతి పత్రం అందజేశారు. స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యేను కలిసి వినతి పత్రం అందజేసిన అనంతరం ఏజే మాట్లాడారు. గ్రామ పంచాయతీ సిబ్బందికి గత 5, 6 నెలల బకాయి వేతనాలు తక్షణమే చెల్లించాలని, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 12,769 గ్రామ పంచాయతీలలో ప్రభుత్వ లెక్కల ప్రకారం 52,000 మంది గ్రామ పంచాయతీ ఉద్యోగులు, కార్మికులు పని చేస్తున్నారు. గ్రామాలలో పారిశుద్ధ్యం, మంచినీటి సరఫరా, వీధి లైట్స్‌, డంపింగ్‌ యార్డ్స్‌, హరితహారం, పల్లె ప్రకృతి వనాలు, వైకుంఠ ధామాలు తదితర పనుల్లో నిత్యం శ్రమిస్తూ గ్రామీణ ప్రాంతాలలో ఎలాంటి అంటువ్యాధులు, అనారోగ్యాలు రాకుండా ప్రజలకు సేవలందిస్తున్నారు. గ్రామ పంచాయతీలలో ప్రజల అవసరాల మేరకు అదనంగా కార్మికులను నియమించి వారికి వేతనాలు చెల్లించడం లేదన్నారు. ఈ వేతనాలు కూడా నెలల తరబడి ఇవ్వకపోవడంతో అర్థాకలితో, అప్పులు చేసుకుని బతకాల్సిన పరిస్థితుల్లో పంచాయతీ కార్మికులున్నారని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో గ్రామ పంచాయతీ సిబ్బంది సమస్యలు పరిష్కరించాలని 34 రోజుల పాటు సమ్మె చేసిన సందర్భంలో గ్రామ పంచాయతీ సిబ్బందికి రూ.5 లక్షల ఇన్సూరెన్స్‌, దహన సంస్కారాలకు రూ.10,000లు ఇస్తామని సర్క్యులర్‌ జారీ చేసి ఈ స్కీముల విధి విధానాలు ప్రకటించలేదని తెలిపారు. అందువల్ల అవి అమలు కావడం లేదని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం తమ ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపర్చిన విధంగా గ్రామ పంచాయతీ కార్మికులందరి పర్మినెంట్‌, కనీస వేతనాలు అమలు చేస్తామని ప్రకటించింది. ప్రభుత్వం ప్రకటించిన హామీలు అమలు చేయాలని, మల్టీపర్పస్‌ వర్కర్‌ విధానం రద్దు చేయాలని, కార్మికుల పెండింగ్‌ వేతనాల చెల్లించాలని తదితర సమస్యలకు పరిష్కారానికి మార్గం చూపగలరని విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా పలు డిమాండ్స్‌ వివరించారు. గ్రామ పంచాయతీ సిబ్బందినందరినీ పర్మినెంట్‌ చేయాలి. వేతనాలకు ప్రభుత్వం ప్రత్యేక బడ్జెట్‌ కేటాయించాలని, 1వ పీఆర్‌సీలో నిర్ణయించిన 30 శాతం వేతనాలు గ్రామ పంచాయతీ సిబ్బందికి అమలు చేయాలి. 2వ పీఆర్‌సీ పరిధిలోకి గ్రామ పంచాయతీ సిబ్బందిని తీసుకురావాలి. కారోబార్‌, బిల్‌ కలెక్టర్లను సహాయక కార్యదర్శులుగా నియమించాలి. పర్మినెంట్‌ చేయాలి. జీవో నెం.51ని సవరించాలి. మల్టీపర్పస్‌ వర్కర్‌ విధానాన్ని రద్దు చేయాలి. పాత కేటగిరీలన్నింటినీ యధావిధిగా కొనసాగించాలని, విధి నిర్వహణలో ప్రమాదం జరిగి మరణించిన సిబ్బంది కుటుంబానికి రూ.10 లక్షల నష్టపరిహారాన్ని ప్రభుత్వమే ఇవ్వాలి. దీని అమలు పోస్టాఫీస్‌ బీమా పథకం ద్వారా చెల్లించాలన్నారు. ప్రమాదంలో మరణించిన కార్మికుల కుటుంబ సభ్యులలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి. సహజ మరణానికి ఇన్సూరెన్స్‌ పథకాన్ని రూ.5 లక్షలకు పెంచాలి. 2011 జనాభా ప్రకారం కాకుండా అవసర ప్రాతిపదికన కార్మికుల్ని తీసుకోవాలని, పి.ఎఫ్‌, ఈఎస్‌ఐ ప్రమాద బీమా, గ్రాట్యూటీ సౌకర్యాలు కల్పించాలని, గ్రామ పంచాయతీ సిబ్బంది అందరికీ రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ అమలు చేయాలి. ప్రమాదంలో మరణించిన కార్మికుని దహన సంస్కారాలకు రూ.10,000లు కాకుండా రూ.20,000లు ఆర్థిక సహాయం అందించాలని, వయస్సు మీరిందనే సాకుతో కార్మికులను మార్చితే ఆ కుటుంబంలోని ఒకరికి ఉద్యోగం కల్పించి, బెనిఫిట్గా రూ.5 లక్షలు ఇవ్వాలి. ఆదాయమున్న పంచాయతీలలో వేతనాలు పెంచుకునేందుకు అనుమతి ఇవ్వాలి. ఆంధ్రప్రదేశ్‌ నాటి గుర్తింపు కార్డులను తొలగించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ గుర్తింపు కార్డులను ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఈ సీఐటియూ జిల్లా సహాయ కార్యదర్శి డి.వీరన్న, గ్రామ పంచాయతీ యూనియన్‌ నాయకులు ఉప్పెర్ల ప్రశాంత్‌, కాంతారావు, జయరాం, నరేష్‌, భాస్కర్‌ తదితరులు పాల్గొన్నారు.

Spread the love