దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా పింఛన్లు మంత్రి గంగుల కమలాకర్‌

– బీడీ టేకేదారులకు పింఛన్ల పంపిణీ ప్రారంభం
నవతెలంగాణ – కరీంనగర్‌
పేదలు సంతోషంగా ఉండాలని దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా పింఛన్లు అమలు చేస్తున్న రాష్ట్రం తెలంగాణ ఒక్కటేనని బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. బీడీ టేకేదారులకు నూతన పింఛన్లు, వికలాంగులకు పెంచిన ఆసరా పింఛన్ల పంపిణీని శనివారం కరీంనగర్‌ కలెక్టరేట్‌ ఆడిటోరియంలో మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అన్ని అవయవాలు పని చేసినా వక్రబుద్ధితో ఉన్నవారే అసలైన వికలాంగులని, ఎలాంటి కల్మషం లేకపోయినా విధి వశాత్తు అంగవైకల్యంతో పుట్టిన వారు దైవసమానులని చెప్పారు. వారు సమాజంలో చులకన భావానికి గురికాకుండా, సగౌరవంతో బతకాలని వికలాంగులను అక్కున చేర్చుకుని రూ.4016, బీడీ టేకేదారులకు రూ.2016 పింఛన్‌ అందిస్తున్నామని అన్నారు. కరీంనగర్‌ జిల్లాలోని 15 మండలాలు, 5 మున్సిపాలిటీలలో 1,38,135 మందికి పింఛన్లు అందించగా, అందులో 23641మంది వికలాంగులు, 40మంది బీడీ టేకేదారులు ఉన్నారన్నారు. కరీంనగర్‌ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోనే 6433 మంది వికలాంగులకు రూ.4016 చొప్పున రూ.2,58,34,928, 10మంది బీడీ టేకేదారులకు రూ.2016 చొప్పున రూ.20,160 పింఛన్ల రూపంలో అందిస్తున్నామన్నారు.
కరీంనగర్‌ నియోజకవర్గంలోని బీడీ టేకేదారులకు ప్రొసీడింగ్స్‌, వికలాంగులకు రూ.2,58,34,928 చెక్కును అందజేశారు. కార్యక్రమంలో మేయర్‌ సునీల్‌రావు, జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ కనుమల్ల విజయ, కలెక్టర్‌ డాక్టర్‌ బి.గోపి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ ప్రఫుల్‌ దేశారు, డీఆర్డీఓ శ్రీలత, వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మెన్‌ రెడ్డవేణి మధు, కొత్తపల్లి మున్సిపల్‌ చైర్మెన్‌ రుద్రరాజు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

 

Spread the love