ఎన్నికల్లో ప్రజలు గెలవాలి

People should win elections– సీఎం కుర్చీ కోసం 11 మంది పోటీనా?
– కాంగ్రెసోల్ల మాటలు నమ్మొద్దు
– వాళ్లు కోర్టుకెళ్లడం వల్లే ‘డిండి’ పనులు ఆలస్యం
– రాహుల్‌కు ఎద్దుఎవసం ఉంటే ధరణి వద్దనడు
– అధికారులతో మాట్లాడి సాగర్‌ ఎడమకాల్వకు నీరు విడుదల : ప్రజా ఆశీర్వాద సభల్లో సీఎం కేసీఆర్‌
నవతెలంగాణ-మఠంపల్లి/మిర్యాలగూడ/దేవరకొండ
”ఎన్నికలు వస్తుంటాయి… పోతుంటాయి. నాయకులు కాదు ప్రజలు గెలవాలి. ఓటు వేసేటప్పుడు అభ్యర్థి వ్యక్తిత్వం, మనస్తత్వం గుర్తుంచుకోవాలి. అతను ఏ పార్టీ నుంచి పోటీ చేస్తున్నాడో ఆ పార్టీ చరిత్ర, దృక్పథం, సరళిని దష్టిలో ఉంచుకోని ఓటు వేయాలి’ అని సీఎం కేసీఆర్‌ అన్నారు. మంగళవారం సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌, నల్లగొండ జిల్లా మిర్యాలగూడ, దేవరకొండ పట్టణకేంద్రాల్లో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభల్లో సీఎం ప్రసంగించారు. కాంగ్రెస్‌ వాళ్లకు పదవులు వస్తే చాలు ప్రజలు ఎటుపోయిన వారికి అవసరం లేదన్నారు. వారి పాలనలో ప్రజలు ఎన్ని కష్టాలు పడ్డారో మీరే ఆలోచించాలన్నారు. బీఆర్‌ఎస్‌ వచ్చిన తర్వాత ప్రజల కష్టాలు ఒక్కొక్కటి తీరుస్తూ ముందుకు పోతున్నామని తెలిపారు. కాంగ్రెస్‌ వాళ్లు ఎన్నికలు వస్తే గోల్మాల్‌ చేసి ఓట్లు వేయించుకోవాలని చూస్తారు. వారిని నమ్మకండి అని పిలుపునిచ్చారు. నాగార్జునసాగర్‌ ప్రాజెక్టును కట్టవలసిన చోట కాకుండా ఆంధ్ర పాలకులకు అవసరం ఉన్న చోట కట్టారని, అనాడు తెలంగాణ ప్రాంత కాంగ్రెస్‌ నాయకులు ఏం చేస్తున్నారని కోదాడ సభలో తానంటే, ఉత్తమకుమార్‌రెడ్డి ఎగిరి పడుతున్నాడని అన్నారు. అలూ లేదు సూలు లేదు ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలిస్తే నేనంటే నేనే ముఖ్యమంత్రినని డజన్‌ మంది ప్రచారం చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. రాహుల్‌కు ఎద్దు ఎగసం ఉందో లేదో తెలియదు కానీ ఆయన ధరణి వద్దంటున్నాడన్నారు. అవి ఉంటే వద్దనడని అన్నారు. ఎమ్మెల్యే కోరిక మేరకు సాగర్‌ ఎడమ కాలువకు అధికారులతో చర్చించి నీటిని విడుదల చేస్తామని హామీ ఇచ్చారు.
పంజాబ్‌ను తలదన్నే విధంగా 3 కోట్ల టన్నుల ధాన్యం పండించే స్థాయికి తెలంగాణ రాష్ట్రం చేరుకున్నదని, రేషన్‌కార్డు దారులందరికి సన్నబియ్యం అందించి పేదల ఆకలి తీరుస్తామన్నారు. రైతుబంధు దుబారాంటా….. మూడు గంటల కరెంటు చాలంట.. కాంగ్రెస్‌ వాళ్లకు బుద్ధి లేకుండా మాట్లాడుతున్నారని ,వారి మాయమాటలు నమ్మి మోసపోవద్దన్నారు. దళితుల్లో ఆత్మవిశ్వాసం ఉండేందుకు దళిత బంధు తెచ్చామన్నారు. కాంగ్రెస్‌ నాయకులు కోర్టు స్టే తేవడం వల్లనే డిండి లిఫ్టు పనుల్లో ఆలస్యం జరిగిందన్నారు. కొద్ది నెలల క్రితమే ఆ చిక్కులు పోయాయి అన్నారు. త్వరలో దిండి లిఫ్టు పనులు పూర్తయితే దేవరకొండ దరిద్రం పోతుందన్నారు. మా తండాలలో మా రాజ్యం -మా పరిపాలన అనే విధంగా తండాలను గ్రామపంచాయతీలుగా ఏర్పాటు చేశామన్నారు. ఓ మంచి వ్యక్తిని గెలిపించుకుంటే అంతా మంచే జరుగుతదన్నారు.
మేమెన్నడూ అరాచకాలు చేయలేదు…
తెలంగాణ వచ్చిన పది సంవత్సరాల కాలంలో తెలంగాణాల్లో కర్ఫ్యూలు, మత కల్లోలాలు లేవని కేసీఆర్‌ అన్నారు. మేము ఏనాడూ అరాచకాలు చేయలేదన్నారు. లౌకికవాదానికి తమ పార్టీ నిదర్శనమని ,ముస్లిం సమాజం ఆలోచించాలని కోరారు. కెసిఆర్‌ బతుకున్నంతకాలం సెక్యురిలిజం కోసం బతికి ఉంటాడన్నారు. అభివద్ధికి ఆటంకం కలుగకుండా మరోసారి బిఆర్‌ఎస్‌ను గెలిపించాలని కోరారు.

Spread the love