– నిబంధనలు గాల్లోకి
– అక్రమ సిట్టింగ్‌ల జోరు!
– మద్యం మత్తులో ఎక్సైజ్ శాఖ
నవతెలంగాణ-తంగళ్ళపల్లి : పర్మిట్ రూములు బార్లను తలపిస్తున్నాయి. ప్రభుత్వ నిబంధనలను గాలికి వదిలేసి జోరుగా అక్రమంగా సిట్టింగ్లను వైన్ షాప్ యజమానులు ఏర్పాటు చేశారు. కానీ ఈ వ్యవహారం అంతా చూస్తే పర్మిట్ రూములు బార్లను తలపించేలా ఉన్నాయి. ఈ వ్యవహారం అంతా ఎక్సైజ్ శాఖ కనసన్నలోనే నడుస్తుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇదేంటని ఎవరైనా అడిగితే వారిపై ఘర్షణలకు దిగుతున్నారు వైన్ షాప్ యజమానులు. తంగళ్ళపల్లి మండల కేంద్రంలోని జైశ్రీరామ్ వైన్స్ నిర్వాహకులు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పర్మిట్ రూంలో ఇష్టానుసారంగా పదుల సంఖ్యలో టేబుల్ లను బెంచ్ లను వేసి సిట్టింగ్ ఏర్పాటు చేయడమే కాకుండా బహిరంగ ప్రదేశాల్లో కూడా పదుల సంఖ్యలో టేబుల్ లు, బెంచీలు మందు బాబులకు సిట్టింగును ఏర్పాటు చేశారు. మందుబాబులు అడిగితే చికెన్, ఫిష్ లాంటి మాంసాహారాలు అక్కడే వండి అందిస్తున్నారు.
ప్రభుత్వ ఎక్సైజ్ నిబంధనల ప్రకారం… పర్మిట్ రూమ్ అంటే కేవలం మద్యం కొనుగోలు చేసిన వారు అక్కడ నిలబడి లేదా తాత్కాలికంగా సేవించడానికి కేటాయించిన స్థలం మాత్రమే.
పర్మిట్ రూమ్‌లలో ఎలాంటి వంటకాలు చేయడానికి వీల్లేదు. కేవలం ప్యాక్ చేసిన స్నాక్స్, వాటర్ బాటిల్స్ మాత్రమే అందుబాటులో ఉంచాలి.నిర్దేశిత సమయం లోపలే వీటిని మూసివేయాలి. పర్మిట్ రూమ్‌లకు ప్రభుత్వానికి ప్రత్యేకంగా లైసెన్స్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
అక్రమంగా సిట్టింగ్..
నిబంధనల ప్రకారం ఉండాల్సిన పర్మిట్ రూమ్‌లు కాస్తా, అక్రమ ‘సిట్టింగ్ రూమ్స్’గా రూపాంతరం చెందాయి. క్షేత్రస్థాయిలో పరిస్థితి ఇందుకు పూర్తిగా విరుద్ధంగా ఉంది. కుర్చీలు, టేబుళ్లతో మినీ బార్లను తలపించేలా ఉన్నాయి. కేవలం నిలబడే స్థలం ఉండాల్సిన చోట, యథేచ్ఛగా కుర్చీలు, టేబుళ్లు, బెంచీలు వేసి పూర్తిస్థాయి సిట్టింగ్ ఏర్పాటు చేస్తున్నారు. బార్లకు వెళ్లకుండా తక్కువ ధరలోనే ‘బార్ తరహా సదుపాయం’ కల్పిస్తూ మందుబాబులను ఆకర్షిస్తున్నారు..
బార్ల యజమానుల లబోదిబో!
ఈ అక్రమ సిట్టింగ్‌ల వల్ల కోట్ల రూపాయలు పెట్టి లైసెన్స్ ఫీజులు చెల్లించిన బార్ల యాజమాన్యాలు తీవ్రంగా నష్టపోతున్నాయి. “మేము ప్రభుత్వానికి భారీగా ట్యాక్సులు కట్టి బార్లు నడుపుతుంటే, వైన్ షాపుల వారు ఎలాంటి అదనపు అనుమతులు, నిబంధనలు లేకుండా మాలాంటి సదుపాయాలే కల్పిస్తూ మా వ్యాపారాన్ని దెబ్బతీస్తున్నారు” అని బార్ ల యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మద్యం మత్తులో ఎక్సైజ్ శాఖ..
ఈ అక్రమ సిట్టింగ్‌లపై ఎక్సైజ్ అధికారుల నిఘా కరువైందనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. అక్కడక్కడా కొన్ని షాపులపై దాడులు చేసి చేతులు దులుపుకుంటున్నారే తప్ప, శాశ్వత చర్యలు చేపట్టడం లేదని ప్రజలు మండిపడుతున్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు, పోలీసులు కూడా ఈ అక్రమ సిట్టింగ్‌లపై కఠినంగా వ్యవహరించాలని, సమయ పాలన పాటించని, అక్రమంగా వంటలు వండుతున్న వైన్ షాపుల లైసెన్సులను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. తంగళ్ళపల్లి మండల కేంద్రంలోని జైశ్రీరామ్ వైన్స్ లో ఉన్న ఈ అక్రమ సిట్టింగ్ సంస్కృతికి ఎక్సైజ్ శాఖ ఎప్పుడు అడ్డుకట్ట వేస్తుందో వేచి చూడాలి.
పర్మిట్ రూమ్స్ @ ‘బార్స్’…
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


