సీఏఏకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పిటిషన్

నవతెలంగాణ న్యూఢిల్లీ: పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌, అఫ్గానిస్థాన్‌ల నుంచి భారత్‌కు శరణార్థులుగా వచ్చిన ముస్లిమేతరులకు మనదేశ పౌరసత్వాన్ని కల్పించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పై నోటిఫికేషన్ ఇచ్చింది. దీనిపై కొన్నివర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇది రాజ్యాంగ విరుద్ధం, వివక్షాపూరితమైందంటూ ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్‌(IUML) అభ్యంతరం వ్యక్తం చేసింది. దీని అమలుకు విరామం ఇవ్వాలంటూ మంగళవారం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. 2019లో కూడా సీఏఏను సవాలు చేస్తూ ఐయూఎంఎల్‌ సుప్రీం మెట్లెక్కింది. నిబంధనలు ఇంకా నోటిఫై చేయకపోవడంతో ఆ చట్టం అమల్లోకి రాదని అప్పట్లో కేంద్రం కోర్టుకు వెల్లడించింది. తాజాగా నిబంధనలు నోటిఫై చేయడంతో.. మళ్లీ ఆ అంశం కోర్టుకు చేరింది. ఆ చట్టం రాజ్యాంగ చట్టబద్ధతను సవాలు చేస్తూ దాఖలైన 250 పిటిషన్లపై తీర్పు వచ్చేవరకు దాని అమలుపై స్టే విధించాలంటూ తన పిటిషన్‌లో కోరింది. దీనిని అమలుచేయబోమని పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ, ఈ చట్టాన్ని తాము అమలుచేసేది లేదని కేరళ ముఖ్యమంత్రి విజయన్‌లు తెగేసి చెప్పారు. తాజాగా తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కూడా ఇదేతరహా ప్రకటన చేశారు.

Spread the love