ఎమ్మెల్సీ విఠల్‌ ఎన్నిక చెల్లదన్న హైకోర్టు తీర్పుపై పిటిషన్‌

– సుప్రీంలో పత్తిరెడ్డి రాజేశ్వర్‌ రెడ్డి కేవియట్‌ దాఖలు
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ దండె విఠల్‌ ఎన్నిక చెల్లదన్న హైకోర్టు తీర్పుపై తమ వాదన వినకుండా ఎలాంటి ఆదేశాలు ఇవ్వొద్దని ఆదిలాబాద్‌ కాంగ్రెస్‌ నేత పత్తిరెడ్డి రాజేశ్వర్‌ రెడ్డి సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ మేరకు బుధవారం సుప్రీంకోర్టులో కేవియట్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. హైకోర్టు ఆదేశాలను సవాల్‌ చేస్తూ… దండె విఠల్‌ ఒకవేళ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే తమ వాదనలను పరిగణన లోకి తీసుకోవాలని ఈ పిటిషన్‌లో కోరారు. కాగా, ఆదిలాబాద్‌ స్థానిక సంస్థల కోటా బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీగా దండె విఠల్‌ ఎన్నిక చెల్లదని ఈ నెల 3న రాష్ట్ర హైకోర్టు తీర్పునిచ్చింది. అలాగే విఠల్‌కు రూ. 50 వేల జరిమానా విధించింది. ఈ తీర్పుపై అప్పీల్‌కు నాలుగు వారాల సమయం ఇచ్చింది. 2021లో ఆదిలాబాద్‌ స్థానిక సంస్థల కోటా నుంచి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీగా విఠల్‌ నామినేషన్‌ వేశారు. దీంతో టికెట్‌ ఆశించి భంగపడ్డ పత్తిరెడ్డి రాజేశ్వర్‌ రెడ్డి ఇండిపెండెంట్‌గా నామినేషన్‌ దాఖలు చేశారు. తాను నామినేషన్‌ విత్‌ డ్రా చేసుకోకపోయినా, తన సంతకాన్ని దండె విఠల్‌ ఫోర్జరీ చేశారని రాజేశ్వర్‌ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం, సంతకం ఫోర్జరీ జరిగిందన్న సెంట్రల్‌ ఫోరెన్సిక్‌ సైన్‌ ల్యాబోరేటరీ ఇచ్చిన నివేదిక ఆధారంగా విఠల్‌ ఎన్నిక చెల్లదని తీర్పును వెలువరించింది. అయితే హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్‌ చేస్తానని దండె విఠల్‌ ఇప్పటికే వెల్లడించారు. ఆ తీర్పును అప్పీల్‌ చేసేందుకు నాలుగు వారాల సమయం ఉన్నందున సుప్రీంకోర్టును ఆశ్రయిస్తానన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో… పిటిషనర్‌ పత్తిరెడ్డి ముందుగానే సుప్రీంకోర్టులో కేవియట్‌ పిటిషన్‌ దాఖలు చేశారు.

Spread the love