డెడ్ స్టోరేజికి చేరిన పోచారం ప్రాజెక్టు..

నవతెలంగాణ – నాగిరెడ్డిపేట్

నాగిరెడ్డిపేట్ ఎల్లారెడ్డి రెండు మండలాలకు వరప్రదాయని అయినటువంటి పోచారం ప్రాజెక్టులో ప్రస్తుత నీటిమట్టం పూర్తిగా అడుగంటిపోయి డెడ్ స్టోరేజ్ కి చేరింది. పోచారం ప్రాజెక్టు పూర్తి నీటిమట్టం 14.64 అడుగులు (1.820 )టీఎంసీలు కాగా ప్రస్తుతం ప్రాజెక్టులో కేవలం 0.121 టిఎంసి నీరు మాత్రమే ఉంది. ఈసారి ఖరీఫ్, రబీ 2 పంటల సాగు ప్రాజెక్టు ద్వారా నీటి పారుదల శాఖ అధికారులు నీటిని అందించారు.  గత వర్షాకాలంలో పుష్కలంగా నీరు కురవడంతో ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండింది. వర్షాకాలంలో నాగిరెడ్డిపేట ఎల్లారెడ్డి మండలాలకు చెందిన అధికారిక లెక్కల ప్రకారం 10,500 ఎకరాలు సాగునీరు అందించగా, అనధికార లెక్కల ప్రకారం 17వేల ఎకరాలకు సాగునీరు అందించింది. అలాగే రబీ సీజన్లో ప్రాజెక్టు పరిధిలో బీజోన్ కు చెందిన ఎల్లారెడ్డి మండలంలోని సాగు భూములకు ప్రాజెక్టు ద్వారా నీరు అందించారు.  ప్రస్తుతం పోచారం ప్రాజెక్టు డెడ్ స్టోరేజ్ కి చేరింది. నాగిరెడ్డిపేట మండలం వ్యాప్తంగా పోచారం ప్రాజెక్టు పైనే ఎక్కువ రైతులు ఆధారపడి జీవిస్తున్నారు. పోచారం ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండితే నాగిరెడ్డిపేట మండలంలో గల బోరుబావిలో పుష్కలంగా నీరు అందిస్తాయి. యాసంగి పంట ముగించుకొని వర్షాకాల పంటకు రైతులు సిద్ధమవుతున్నారు. వర్షాకాలం కంటే ముందే వర్షాలు కురవడం ప్రారంభం కావడంతో రైతులందరూ పొలాలను దున్నే పనిలో పడ్డారు. నాగిరెడ్డిపేట మండలంలో చిన్న కొద్దిపాటి వర్షానికి అక్కడక్కడ దున్నకాలు ప్రారంభించినట్లు సమాచారం. ఈసారి కూడా వర్షాలు సమృద్ధిగా కురిసి పోచారం ప్రాజెక్టు పూర్తి సయిలో నిండితే రెండు పంటలు పండే అవకాశం ఉంది.
Spread the love