Monday, June 22, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంత్రిపుల్ మర్డర్ కేసును ఛేదించిన పోలీసులు

త్రిపుల్ మర్డర్ కేసును ఛేదించిన పోలీసులు

- Advertisement -

సాంకేతిక ఆధారాలతో నిందితుడి అరెస్ట్ : వివరాలు వెల్లడించిన నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్రపవార్
​నవతెలంగాణ-నల్లగొండ టౌన్

​మిర్యాలగూడ పట్టణంలోని కలాల్‌వాడలో ఈ నెల 4వ తేదీన జరిగిన అగ్నిప్రమాద ఘటనలో ముగ్గురు సజీవదహనమైన కేసును నల్లగొండ జిల్లా పోలీసులు ఛేదించారు. ఆదివారం నల్లగొండ జిల్లాకేంద్రంలోని పోలీస్ కార్యాలయంలో హత్యకేసుకు సంబంధించిన వివరాలను ఎస్పీ శరత్‌‌చంద్ర పవార్ వెల్లడించారు. తొలుత ప్రమాదవశాత్తు జరిగిన అగ్నిప్రమాదంగా భావించిన ఈ ఘటన వెనుక పథకం ప్రకారం జరిగిన హత్య ఉన్నట్టు పోలీసుల దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది. డీసీఆర్‌బీ డీఎస్పీ జి. రవి పర్యవేక్షణలో ప్రత్యేక దర్యాప్తు బృందాలు ఏర్పడి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, సీసీటీవీ ఫుటేజీలు, సాంకేతిక ఆధారాలను విశ్లేషించి నిందితుడిని గుర్తించి అరెస్టు చేశారు. దర్యాప్తులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం, ఊళ్ళ పాలెం గ్రామానికి చెందిన కాళహస్తి శిరీష్ కుమార్ ఈ ఘాతుకానికి పాల్పడినట్టు నిర్దారణ అయ్యింది. నిందితుడు గతంలోనే వివిధ ప్రాంతాల్లో దొంగతనాలు, మోసాలకు పాల్పడిన చరిత్ర కలిగి ఉన్నట్టు విచారణలో తేలింది. తెలుగు మ్యాట్రిమోనీ వంటి వివాహ వెబ్‌సైట్ల ద్వారా మహిళలతో పరిచయాలు పెంచుకుని, వారి నమ్మకాన్ని సంపాదించి వివాహం చేసుకోవడం లేదా వివాహం చేసుకుంటానని నమ్మించి ఆర్థిక ప్రయోజనాలు పొందడం నిందితుడి అలవాటుగా మారినట్టు పోలీసులు గుర్తించారు. ఇదే విధంగా బాధితురాలు ధనలక్ష్మితో కూడా పరిచయం ఏర్పరుచుకుని వివాహం చేసుకున్నాడు.

కాలక్రమేణా ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో ధనలక్ష్మి అతడిని దూరం పెట్టింది. హాజీపూర్‌లో ఒక మహిళను మోసం చేసిన కేసులో జైలులో ఉన్న సమయంలో తనకు సహాయం చేయకపోవడం, బెయిల్ కోసం ప్రయత్నించకపోవడం పట్ల నిందితుడు ఆగ్రహం పెంచుకున్నాడు. ఈ క్రమంలో ధనలక్ష్మి, ఆమె పిల్లలను హత్య చేయాలని ముందుగానే నిర్ణయించుకున్నాడు. తన ప్రణాళికలో భాగంగా నేరానికి కొన్ని రోజుల ముందే పరిస్థితులను పరిశీలించాడు. సంఘటన జరిగిన రోజు ఉదయం తన ఇంటి సమీపంలో ఉన్న యాక్టివా స్కూటీని దొంగిలించి మిర్యాలగూడ వైపు బయల్దేరాడు. మార్గమధ్యలో ఒక ప్లాస్టిక్ క్యాన్ కొనుగోలు చేసి పెట్రోల్ బంకులో పెట్రోల్ నింపించుకున్నాడు. అనంతరం పలు ప్రాంతాల్లో తిరుగుతూ రాత్రి వరకు సమయం గడిపి అనుమానం రాకుండా జాగ్రత్త పడ్డాడు. రాత్రి సమయంలో బాధితురాలి ఇంటి పరిసరాలను గమనించి అందరూ నిద్రలో ఉన్నారని నిర్దారించుకున్న తర్వాత ఇంట్లోకి ప్రవేశించాడు. అక్కడ ఉన్న ప్లాస్టిక్ బకెట్‌లో పెట్రోల్ పోసి నిద్రిస్తున్న వారిపై చల్లాడు. అనంతరం అగ్గిపుల్ల గీసి మంటలు అంటించి సంఘటనను ప్రమాదవశాత్తు జరిగిన అగ్నిప్రమాదంలా కనిపించేలా ప్రయత్నించాడు.

ఈ క్రమంలో మంటలు నిందితుడికి కూడా అంటుకున్నప్పటికీ అక్కడి నుంచి తప్పించుకుని పరారయ్యాడు. బాధితురాలు ధనలక్ష్మి సంఘటన జరిగిన రోజు ఇంట్లో లేకపోవడంతో ప్రాణాపాయం నుంచి తప్పించుకుంది. అయితే ఇంట్లో నిద్రిస్తున్న ఆమె తల్లి వనం చంద్రమ్మ (48), కుమారుడు లక్ష్మణ్ (17), కుమార్తె ప్రణతి (15) మంటల్లో చిక్కుకుని సజీవదహనమయ్యారు. సంఘటనా స్థలంలో లభించిన సూక్ష్మ ఆధారాలు, కాలిపోయిన ఇంటి వెనుక భాగంలో లభించిన పెట్రోల్ వాసన ఉన్న బకెట్, వివిధ ప్రాంతాల్లోని సీసీటీవీ దృశ్యాలు, ప్రయాణ మార్గానికి సంబంధించిన సమాచారం, సాంకేతిక ఆధారాలను విశ్లేషించిన పోలీసులు నిందితుడి కదలికలను గుర్తించి అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి స్కూటీ, పెట్రోల్ క్యాన్, బకెట్, పాక్షికంగా కాలిపోయిన షర్ట్, హెల్మెట్, సెల్‌ఫోన్, ఘటనాస్థలంలో వదిలివెళ్లిన చెప్పులను స్వాధీనం చేసుకున్నారు. ఈ క్లిష్టమైన కేసును అత్యంత వేగంగా ఛేదించిన డీసీఆర్‌బీ డీఎస్పీ జి.రవి, మిర్యాలగూడ వన్ టౌన్ ఇన్‌స్పెక్టర్ ఎం. నాగభూషణరావు, ప్రొహిబిషనరీ ఎస్‌ఐ వెంకటేశ్వర్లు, హెడ్ కానిస్టేబుళ్లు జి. రాజారాం, నల్లగంతుల శ్రీను, ఎస్. వెంకటేశ్వర్లు, హుస్సేన్, బి. వీరబాబు, జి. నర్సింహ, బి. ప్రసాద్‌ను ఎస్పీ ప్రత్యేకంగా అభినందిస్తూ ప్రశంసాపత్రాలు, నగదు రివార్డులను ప్రకటించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -