రైతులపై పోలీసుల కర్కశం

Police crackdown on farmers– మళ్లీ టియర్‌ గ్యాస్‌ ప్రయోగం
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
రైతులు చేపట్టిన ‘ఢిల్లీ చలో’ నిరసన ప్రదర్శనను అడ్డుకునేందుకు ఢిల్లీలో అడుగుడుగునా భద్రతా ఏర్పాట్లు చేయడం, సెంట్రల్‌ ఢిల్లీలో హర్యానా సరిహద్దు పాయింట్ల వద్ద ఆంక్షలు విధించడంతో సరిహద్దుల్లో ఉద్రిక్తత నెలకొంది. పంజాబ్‌-హర్యానా సరిహద్దులో శాంతియుతంగా నిరసనలు తెలుపుతున్న రైతులపై పోలీసులు మరోసారి టియర్‌ గ్యాస్‌ ప్రయోగించారు. భారీ భద్రత, కాంక్రీట్‌ బారికేడ్లు ఉన్నప్పటికీ రైతులు తమ ఢిల్లీ చలో మార్చ్‌ను కొనసాగించడంతో శంభు ప్రాంతం వద్ద వందలాది ట్రాక్టర్లు బారులు తీరాయి. బారికేడ్లు దాటి రాకుండా ఉండేందుకు ఆందోళనకారులపై పోలీసులు భాష్పవాయువును ప్రయోగించారు. నిరసనల కారణంగా దేశ రాజధాని ఢిల్లీతో పాటు సమీప నగరాల్లోనూ ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. రైతులు ఢిల్లీకి రాకుండా అడ్డుకునేందుకు సరిహద్దు వద్ద భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు.
రైతుల ‘చలో ఢిల్లీ’ మార్చ్‌ను అడ్డుకునేందుకు పోలీసులు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. డ్రోన్లతో టియర్‌ గ్యాస్‌ షెల్స్‌ ప్రయోగిస్తున్నారు. అయితే రైతులు గాలిపటాలు ఎగురవేసి డ్రోన్లను అడ్డుకుంటున్నారు. గాలిపటాల దారాలు డ్రోన్లకు చుట్టుకోవడంతో కొన్ని కూలిపోయాయి. ఈ వీడియో క్లిప్స్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి.
హర్యానా పోలీసులు, భద్రతా సిబ్బంది టియర్‌ గ్యాస్‌ షెల్స్‌ ప్రయోగం నేపథ్యంలో రైతులు తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. టియర్‌ గ్యాస్‌ ప్రభావాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నారు. వెంట తెచ్చుకున్న వాటర్‌ బాటిల్స్‌తో దుస్తులు తడిగా ఉంచుకుంటున్నారు. అలాగే టియర్‌ గ్యాస్‌ ప్రభావం నుంచి రక్షణ కల్పించే దుస్తులు ధరిస్తున్నారు.
మూడు వ్యవసాయ చట్టాల రద్దు కోసం 2020-21 నిరసనల తరువాత మరోసారి ఆందోళనలు కొనసాగిస్తున్నారు. తమ పంట ఉత్పత్తులకు కనీస మద్దతు ధర కల్పించాలని కోరుతూ ఢిల్లీ బాటపట్టారు. వ్యవసాయ ఉత్పత్తులపై ప్రభుత్వం ఇప్పటికే ఎంఎస్‌పిని అందజేస్తున్నప్పటికీ దానికి హామీ ఇచ్చే చట్టం తీసుకురావాలని డిమాండ్‌ చేస్తున్నారు.
చర్చలకు సిద్ధంగా ఉన్నాం: కేంద్ర మంత్రి అర్జున్‌ ముండా
ఆందోళన చేపట్టిన అన్నదాలతో చర్చలకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి అర్జున్‌ ముండా పేర్కొన్నారు. చర్చలకు అనువైన వాతావరణం కల్పించాలని, సాధారణ జనజీవనానికి అవాంతరాలు కల్పించరాదని రైతులకు విజ్ఞప్తి చేశారు. సాధారణ జనజీవనం భగం కాకుండా చూడాలని తాను రైతు సంఘాలను కోరుతున్నానని, రైతు సంఘాలతో సానుకూల వాతావరణంలో చర్చలు కొనసాగుతాయని తానిప్పటికే స్పష్టం చేశానని మంత్రి పేర్కొన్నారు. రైతు సంఘంతో నిర్మాణాత్మక చర్చలకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని అన్నారు. అన్ని దృక్కోణాలను పరిగణనలోకి తీసుకుని చర్చలు జరిపేందుకు సంసిద్ధత వ్యక్తం చేసిన మంత్రి, చర్చలకు అనుకూలమైన వాతావరణం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. చట్టంపై నిర్ణయం తీసుకోలేమని రైతు సంఘాలు అర్థం చేసుకోవాలని ఆయన అన్నారు. చర్చలతో రైతు సంఘాలు సమస్యల పరిష్కారానికి ముందుకు రావాలని, అంతేగానీ.. రాజకీయ పార్టీల ప్రలోభాలకు రైతు సంఘాలు గురి కావొద్దని అన్నారు.
నిర్బంధాన్ని ఆపాలి : రైతు సంఘం నేత
పంజాబ్‌ కిసాన్‌ మజ్దూర్‌ సంఘర్ష్‌ కమిటీ జనరల్‌ సెక్రటరీ సర్వన్‌ సింగ్‌ పంధేర్‌ బుధవారం నాడు ఆందోళన చేస్తున్న రైతులపై టియర్‌ గ్యాస్‌, ఇతర బలగాల ప్రయోగాన్ని నిలిపివేసి సుహృద్భావ వాతావరణాన్ని సృష్టించాలని ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. దేశ రాజధానికి పాదయాత్ర చేస్తున్న రైతులను చెదరగొట్టేందుకు పోలీసులు సెల్ఫ్‌లోడింగ్‌ రైఫిల్‌ (ఎస్‌ఎల్‌ఆర్‌)ను ప్లాస్టిక్‌, రబ్బరు బుల్లెట్‌లు, టియర్‌ గ్యాస్‌ ప్రయోగించారని ఆయన విమర్శించారు. ”మా రైతులను చెదరగొట్టేందుకు పోలీసులు ఎస్‌ఎల్‌ఆర్‌ బుల్లెట్లు, టియర్‌ గ్యాస్‌, ప్లాస్టిక్‌, రబ్బర్‌ బుల్లెట్‌లను ప్రయోగించారు. ఇలాంటి చర్యలు ఆమోదయోగ్యం కాదు. మమ్మల్ని పిలిచి ఖలిస్తానీ ట్యాగ్‌ను వేస్తున్నారు. కాంగ్రెస్‌, పంజాబ్‌ ప్రభుత్వానికి మద్దతుదారు, ఇది సరైనది కాదు” అని పంధేర్‌ అన్నారు. తమ డిమాండ్లపై కేంద్రం నుండి చర్చలకు ఆహ్వానం అందితే దానిని పరిశీలిస్తామని, అయితే చర్చలకు సానుకూల వాతావరణం ఉండేలా చూడాలన్నారు. కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి)కి హామీ ఇచ్చేలా చట్టం చేయాలని డిమాండ్‌ చేశారు.

Spread the love