– జ్యూడీషియల్ విచారణ జరిపిస్తాం :మంత్రి శ్రీధర్‌బాబు
– రాష్ట్ర ప్రభుత్వం లేఖ ఇస్తే… సీబీఐ విచారణ జరిపిస్తాం
– కాంగ్రెస్, బీఆర్‌ఎస్ కలిసిన చరిత్ర ఉంది : ఏలేటి
– బీఆర్‌ఎస్‌ను రక్షించేందుకు బీజేపీ ఆరాటం: కాంగ్రెస్
– ఆ రెండు పార్టీలు కలబోవన్న గ్యారంటీ ఇస్తారా? రాజ్‌ఠాగూర్
– లేఖ ఇస్తేనే ఈడీ, ఐటీ దాడులు చేస్తున్నారా? యెన్నం
– బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు బీజేపీ ఎందుకు విచారించలేదు : ఆది శ్రీనివాస్
– కేసీఆర్ బినామీ కిషన్‌రెడ్డి : పొన్నం
– అసెంబ్లీలో వాడివేడీ చర్చ
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ఒకవైపు కాళేశ్వరం ప్రాజెక్టు కుంగుబాటును పరిశీలించిన అధికార కాంగ్రెస్ …మరోవైపు కృష్ణా జలాల్లో తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై బీఆర్‌ఎస్ పోరుబాట సభ…ఆ రెండు వేదికల్లో రేవంత్, కేసీఆర్ మాటల తూటాలు అసెంబ్లీలో మంటలు రేపాయి. బుధవారం శాసనసభలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పద్దులపై చర్చ సందర్భంగా కాంగ్రెస్, బీజేపీ నేతల మధ్య వాడివేడీ చర్చ జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై జ్యూడీషియల్ విచారణ జరిపిస్తామంటూ అధికార కాంగ్రెస్ వివరణ ఇచ్చింది. హైకోర్టును సిట్టింగ్ జడ్జిని ఇవ్వాలంటూ సీజేను కోరామని తెలిపింది. సిట్టింగ్ జడ్జిని ఇవ్వబోమంటూ హైకోర్టు తెలిపిన విషయాన్ని బీజేపీ గుర్తు చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం లేఖ ఇస్తే, 24 గంటల్లో సీబీఐ చేత విచారణ జరిపిస్తామంటూ బీజేపీ సవాల్ చేసింది. దీంతో శాసనసభలో పద్దులపై చర్చ పక్కదారి పట్టింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో నెలకొన్న అవినీతి, పిల్లర్ల కుంగుబాటు తదితర అంశాలపై చర్చ మళ్లింది. బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలు ఒకదానికొకటి సహకరించుకుంటున్నాయనీ, అందుకే బీజేపీ సభ్యులు కాళేశ్వరం వద్దకు రాలేదంటూ కాంగ్రెస్ సభ్యులు వ్యాఖ్యానించారు. గతంలో బీజేపీ నేతలు ఈటల రాజేందర్, కిషన్‌రెడ్డి, కె లక్ష్మణ్‌ల బృందం పరిశీలించిందనీ, ఇప్పుడు కొత్తగా చూసేదేముందనీ, పిక్నిక్‌కు పోవడం తప్పా? అంటూ బీజేపీఎల్‌పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ఎద్దేవా చేశారు. ఈ దశలో బీజేపీకి, బీఆర్‌ఎస్‌కు చీకటి ఒప్పందం ఉండటం వల్లే కమలం పార్టీ…ప్రాజెక్టు పరిశీలనకు రాలేదంటూ రాష్ట్ర శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు విమర్శించారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్‌ఎస్, బీజేపీ కలిపి ఉంటాయనే తమ సభ్యులు చేసిన విమర్శలకు సమాధానం చెప్పకుండా బీజేపీ సభ్యులు దాట వేస్తున్నారని విమర్శించారు. ఆ రెండు పార్టీలు కలబోవని హామీ ఇవ్వగలరా? గ్యారంటీ ఏమైనా ఉందా? అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర విభజన చట్టంలో పొందుపరిచిన సమస్యలను పరిష్కరించకుండా కాషాయపార్టీ కాలయాపన చేసిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వాటి ప్రస్తావన చేయకుండా బీజేపీ దాట వేస్తున్నదని చెప్పారు. కాంగ్రెస్ సభ్యుడు రాజ్‌ఠాగూర్ మాట్లాడుతూ వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలు కలిసి పోటీ చేయబోమనే గ్యారంటీ ఇవ్వగలరా? అంటూ బీజేపీని ప్రశ్నించారు.
బీజేపీ, బీఆర్‌ఎస్ అలయెన్స్ ఎన్నడూ లేదు : ఏలేటి
కమలం, కారు ఎన్నడూ పొత్తు పెట్టుకోలేదనీ, భవిష్యత్తులోనూ అది జరగలేదని బీజేపీ పక్ష నేత ఏలేటి మహేశ్వరరెడ్డి ఈ సందర్భంగా వివరణ ఇచ్చారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలకు పొత్తు పెట్టుకున్న చరిత్ర ఉందన్నారు. అటు కేంద్రంలోనూ, ఇటు రాష్ట్రంలోనూ కాంగ్రెస్ క్యాబినెట్‌లో బీఆర్‌ఎస్ నాయకులు చేరారని తెలిపారు. ఎన్నికల్లోనూ కలిసి పోటీ చేశాయని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్‌ఎస్ ఒక్కటేనంటూ ప్రచారం చేసి, ఎన్నికల్లో గెలిచారని చెప్పారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో అదే నినాదాన్ని ఇచ్చి గెలవాలనే తాపత్రయం ఆ పార్టీలో కనిపిస్తోందన్నారు. అబద్ధాలను ప్రజలు అన్నిసార్లు నమ్మబోరని హెచ్చరించారు. కాంగ్రెస్ సభ్యులు కాళేశ్వరం ప్రాజెక్టు వద్దకు విహార యాత్రకు వెళ్లారని ఎద్దేవా చేశారు. సీఎంకు ఎప్పుడు మూడొస్తే అప్పుడు అక్కడికి తీసుకెళతారని ఎద్దేవా చేశారు.
ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలకు తగినట్టుగా బడ్జెట్‌లో కేటాయింపులు లేవన్నారు. ఇచ్చిన హామీల విషయంలో సీఎం రేవంత్‌రెడ్డి యూటర్న్ తీసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఫార్మాసిటీ రద్దు చేస్తానన్న మాట ఏమైందన్నారు. కులగణన చేపడతామన్న సీఎం…ఆ తర్వాత దాని ఊసేఎత్తలేదన్నారు. రుణమాఫీకి తగిన నిధులు కేటాయించకుండా ఉత్త మాటలు చెప్పారన్నారు. వ్యవసాయరంగానికి రూ. 19వేల కోట్లు కేటాయించినా, అవి ఏ మూలకు సరిపోవని తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల నుంచి తప్పించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం బీజేపీపై బురదజల్లుతున్నదని విమర్శించారు.
నష్టపోయిన ప్రజాధనాన్ని ప్రజలకు చూపించేందుకే : ఆది శ్రీనివాస్
కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై బీజేపీ పెద్ద పెద్ద మాటలు మాట్లాడిందనీ, ఎందుకు విచారణ జరిపించలేదని కాంగ్రెస్ సభ్యులు ఆది శ్రీనివాస్ బీజేపీని ప్రశ్నించారు. జ్యూడీషియల్ విచారణ జరిపిస్తామంటే, బీజేపీ ఉలిక్కిపడుతున్నదని విమర్శించారు. ప్రజాధనం దుర్వినియోగమైన విషయాన్ని ప్రజలకు చెప్పేందుకే ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను మేడిగడ్డకు తీసుకెళ్లామన్నారు.
తెలుగు భాషను భ్రష్టుపట్టించారు కేసీఆర్‌పై రామ్మోహన్‌రెడ్డి ఆగ్రహం
ప్రతిపక్ష నేత కేసీఆర్ తెలుగు భాషను భ్రష్టుపట్టించారని కాంగ్రెస్ సభ్యులు టి రామ్మోహన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మగతనం ఉందా? అని మాట్లాడం ఆయన కుసంస్కారానికి నిదర్శనమన్నారు. మహిళలను కూడా దద్దమ్మలంటూ వారిని అవమానించారని తెలిపారు. పదేండ్లలో అనేక వాగ్దానాలు చేసిన కేసీఆర్ అధికారంలోకి వచ్చాక వాటిని విస్మరించారని చెప్పారు. బీజేపీకి అన్ని విషయాల్లో మద్దతిచ్చి ఆయన తన స్వామిభక్తిని చాటుకున్నారని తెలిపారు. ‘సీఎం స్థానంలో కేసీఆర్ ఎవరిని కలవలేదు. ఎవరికి అపాయింట్‌మెంట్ ఇవ్వలేదు. అంతా దుబారా ఖర్చు. కాళేశ్వరం అవినీతికి నిలయం. ఉద్యోగులకు పీఆర్‌సీ ఇవ్వలేదు. నిరుద్యోగులకు భృతి ఇవ్వలేదు’ అని విమర్శించారు.
ఏ అధికారంతో ఈడీ, ఐటీ దాడులు చేశారు : యెన్నం
మేడిగడ్డపై సీబీఐ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం లేఖ ఇస్తే వెంటనే కేంద్రం విచారణ చేపడుతుందని ఏలేటి మహేశ్వర్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ సభ్యుడు యెన్నం శ్రీనివాసరెడ్డి ఖండించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరి అనుమతితో కాంగ్రెస్ నేతల ఇండ్లపై ఐటీ దాడులు చేయించారని బీజేపీని ప్రశ్నించారు. అన్ని రాష్ట్రాల్లో ప్రతిపక్ష నేతల ఇండ్లపై ఈడీ, ఐటీ దాడులు ఎలా కొనసాగుతున్నాయని నిలదీశారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి 30శాతం నిధులను రాష్ట్ర ప్రభుత్వం భరించిందనీ, 60 శాతం నిధులను లు వివిధ కార్పొరేషన్లతో అప్పుల రూపేణా సమీకరించారని గుర్తు చేశారు. వాటిని పర్యవేక్షించాల్సిన బాధ్యత కేంద్రానికి లేదా? అని ప్రశ్నించారు. దొంగలు, దొంగలు కలిసి ఊర్లు పంచుకున్నట్టు బీజేపీ, బీఆర్‌ఎస్ నేతలు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
‘కాళేశ్వరం’పై కథలేనా?
1:44 am