ఆ నిర్ణయాలు సరైనవి కావు..

Those decisions Not correct..– నియోజకవర్గాల పునర్విభజన, జమిలి ఎన్నికలకు
– వ్యతిరేకంగా తమిళనాడు అసెంబ్లీలో తీర్మానం
చెన్నై : తాజా జనగణన ఆధారంగా 2026లో జరిగే నియోజకవర్గాల పునర్విభజన, ‘ఒకే దేశం-ఒకే ఎన్నికలు’ ప్రతిపాదనకు వ్యతిరేకంగా తమిళనాడు అసెంబ్లీలో బుధవారం రెండు తీర్మానాలను ఆమోదించారు. ఈ రెండు విషయాల్లోనూ కేంద్ర ప్రభుత్వం ముందుకు వెళ్లకూడదని ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్‌ విజ్ఞప్తి చేశారు. తాజా జనాభా లెక్కలతో 2026లో నియోజకవర్గాల పునర్విభజన జరిగితే దక్షిణాది రాష్ట్రాల రాజకీయ ప్రాతినిధ్యం తగ్గిపోతుందని స్టాలిన్‌ ఆవేదన వ్యక్తం చేశారు. జనాభా నియంత్రణ చర్యలను దక్షిణాది రాష్ట్రాలు అత్యంత చిత్తశుద్ధితో అమలు చేశాయని, అందుకు అవి శిక్షకు గురికాకూడదని తెలిపారు. ఇందుకు పరిష్కారంగా రాజ్యాంగాన్ని సవరించి 1971 జనాభా లెక్కల ఆధారంగా నిర్ణయించిన ‘ప్రస్తుత నిష్పత్తి’నే పార్లమెంట్‌, అసెంబ్లీ నియోజకవర్గాలకు కొనసాగించాలన్నారు. 2026లో జరిగే పునర్విభజనను తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌, కేరళ, తెలంగాణ రాష్ట్రాలకు ‘తలపై వేలాడుతున్న కత్తి’గా అభివర్ణించిన స్టాలిన్‌.. ఈ పునర్విభజన ఆయా రాష్ట్రాల రాజకీయ ప్రాతినిధ్యాన్ని తగ్గిస్తుందని తెలిపారు. ‘దీనిని మొగ్గలోనే తుంచేయాలి. తమిళనాడు వంటి దక్షిణాది రాష్ట్రాల నుంచి పార్లమెంటు స్థానాల సంఖ్యను తగ్గించడానికి ఈ పునర్విభజన ప్రక్రియ ఒక కుట్ర కూడా కావచ్చు’ అని స్టాలిన్‌ తెలిపారు. తాజా జనగణన ఆధారంగా 2026లో జరిగే నియోజకవర్గాల పునర్విభజనతో జరిగే నష్టాలను ఉదాహరణలతో స్టాలిన్‌ వివరిస్తూ ‘1971లో తమిళనాడు, బీహార్‌ జనాభా ఒకే విధంగా ఉండడంతో వీటికి 39, 40 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. అయితే ప్రస్తుతం బీహార్‌ జనాభా తమిళనాడు కంటే 1.5 రెట్లు అధికంగా ఉంది. 2026 పునర్విభజన జరిగితే పార్లమెంటులో తమిళనాడు ప్రాతినిధ్యం అనేక ఉత్తరాది రాష్ట్రాల కంటే తక్కువగా ఉంటుంది’ అని వివరించారు. జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన తమిళనాడు వంటి రాష్ట్రాలను బలహీనపరుస్తుందని అన్నారు. ‘గత 50 ఏళ్లుగా ప్రజా ప్రయోజనాల కోసం వివిధ సామాజిక-ఆర్థిక అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను అమలు చేసిన తమిళనాడు వంటి రాష్ట్రాలకు శిక్ష విధించకుండా చూడాలని ఈ సభ కోరుతోంది’ అని తీర్మానం పేర్కొంది. ఈ తీర్మానాన్ని పార్టీలకు అతీతంగా హజరైన సభ్యులంతా ఆమోదించారు.
‘ఒకే దేశం-ఒకే ఎన్నికలు’ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ రెండో తీర్మానాన్ని ఆమోదించారు. ఇలాంటి ప్రతిపాదన అమలు చేయడం ‘అసాధ్యం’ అని తీర్మానంలో పేర్కొన్నారు. స్వేచ్ఛ, నిష్పాక్షికమైన, స్వతంత్ర ఎన్నికలను పేర్కొన్న రాజ్యాంగం ప్రాథమిక సిద్ధాంతాలకు ఈ ప్రతిపాదన విరుద్ధమని విమర్శించారు. జమిలి ఎన్నికలు ఒకవేళ అమలు చేస్తే ‘కేంద్రంలో ప్రభుత్వం పడిపోతే రాష్ట్ర ప్రభుత్వాలన్నింటినీ రద్దు చేస్తారా’ అని స్టాలిన్‌ ఈ సందర్భంగా ప్రశ్నించారు. అదేవిధంగా కొన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాలు పతనం చెందితే కేంద్రంలో అధికారంలో ఉన్నవారు తమకు తాముగా దిగిపోతారా? అని ప్రశ్నించారు.

Spread the love