– రాజస్థాన్ నుంచి నామినేషన్ దాఖలు
– ఏడు రాష్ట్రాల నుంచి అభ్యర్థులు ఖరారు
– తెలంగాణ నుంచి రేణుక చౌదరి, అనిల్ కుమార్‌కు చోటు
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
దేశంలోని ఏడు రాష్ట్రాల నుంచి కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ అభ్యర్థుల్ని ప్రకటించింది. ఈ మేరకు బుధవారం కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత) కెసి వేణుగోపాల్ ప్రకటన విడుదల చేశారు. రాజస్థాన్ నుంచి సోనియా గాంధీ, బీహార్ నుంచి అఖిలేశ్ ప్రసాద్ సింగ్, హిమాచల్ ప్రదేశ్ నుంచి అభిషేక్ మను సింఘ్వి, మహారాష్ట్ర నుంచి చంద్రకాంత్ హండేరేల పేర్లను ప్రకటించింది. కాగా రాజస్థాన్ నుంచి పార్టీ రాజ్యసభ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్ పర్సన్ (పీసీసీ) సోనియా గాంధీ నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గెహ్లాట్ లు హాజరయ్యారు.
తెలంగాణ నుంచి రేణుకా చౌదరి, అనిల్ కు చోటు
తెలంగాణ, మధ్యప్రదేశ్, కర్నాటక నుంచి మొత్తం ఆరుగురు పేర్లను అధిష్టానం ప్రకటించింది. తెలంగాణ నుంచి పార్టీ సీనియర్ నాయకురాలు రేణుకా చౌదరి, యువ నేత అనిల్ కుమార్ యాదవ్ లకు పార్టీ అవకాశం కల్పించింది. అయితే తెలంగాణ నుంచి మొత్తం మూడు రాజ్యసభ సభ్యుల పదవి కాలం ముగిసింది. అసెంబ్లీలో కాంగ్రెస్ సంఖ్యా బలం బట్టి కేవలం రెండు సీట్లు మాత్రమే ఆ పార్టీ గెలుచుకునే అవకాశం ఉంది. దీంతో అధిష్టానం ఇద్దరి పేర్లను మాత్రమే ప్రకటించింది. ఇక కర్నాటక నుంచి అజరు మాకెన్, నసీర్ హుస్సేన్, జి. సి చంద్రశేఖర్ పేర్లను కాంగ్రెస్ వెల్లడించింది. మధ్య ప్రదేశ్ నుంచి అశోక్ సింగ్ పేరును ఖరారు చేసింది.
గుజరాత్ నుంచి పెద్దల సభకు బీజేపీ అధ్యక్షుడు నడ్డా
గుజరాత్, మహారాష్ట్ర రాష్ట్రాల నుంచి రాజ్యసభకు ఏడుగురు అభ్యర్థుల పేర్లను బీజేపీ ప్రకటించింది. ఇందులో గుజరాత్ నుంచి నలుగురు, మహారాష్ట్ర నుంచి ముగ్గురిని ఎంపిక చేసినట్టు బుధవారం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో గుజరాత్ నుంచి పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా, సీనియర్ నేతలు గోవింద్ భారు, మయాన్ భారు నాయక్, జశ్వంత్ సిన్హ్ సలామ్ సిన్హ్ పార్మర్ లు నామినేషన్ దాఖలు చేయనున్నారు. అలాగే మహారాష్ట్ర నుంచి మాజీ సీఎం అశోక్ చౌహాన్, మేధా కులకర్ణి, డాక్టర్ అజిత్ గోప్చాడేలు పెద్దల సభకు పోటీ చేయనున్నారు.