ఛత్తీస్‌గఢ్‌, మిజోరాం రాష్ట్రాల్లో పోలింగ్ ప్రారంభం..

నవతెలంగాణ- ఛత్తీస్‌గఢ్‌: శాసనసభ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఆ రాష్ట్రంలోని 20 అసెంబ్లీ స్థానాలకు నేడు పోలింగ్ జరగనుంది. ఇందులో 12 అసెంబ్లీ సెగ్మెంట్లు బస్తర్‌ పరిధిలోనే ఉన్నాయి. ఈ స్థానాల్లో మొత్తం 223 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. బస్తర్‌లోని 12 అసెంబ్లీ సెగ్మెంట్లలో తొమ్మిది స్థానాల్లో ఉదయం 7 నుంచి 3గంటల వరకు పోలింగ్‌ నిర్వహించనున్నారు. మిగతా మూడు స్థానాల్లో ఉదయం 8 నుంచి సాయంత్రం 5గంటల వరకు పోలింగ్‌ కొనసాగనున్నట్లు అధికారులు తెలిపారు. మరోవైపు.. మావోయిస్టుల ప్రభావిత ప్రాంతమైన బస్తర్‌ డివిజన్‌లో మొత్తం 5304 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా.. వీటిలో 600 కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. ఈ కేంద్రాల్లో నిఘాను పటిష్ఠం చేసి మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. ఇక్కడ 60 వేల మంది భద్రతా సిబ్బంది విధుల్లో ఉండగా.. వారిలో 40 వేల మంది సీఆర్‌పీఎఫ్‌, 20 వేల మంది రాష్ట్ర పోలీసులు ఉన్నారు. మావోయిస్టుల ఏరివేత కోసం ప్రత్యేకంగా పనిచేసే కోబ్రా యూనిట్‌, మహిళా కమాండోలు కూడా విధులు నిర్వర్తిస్తున్నారు.
40 అసెంబ్లీ స్థానాలున్న మిజోరాంలో కూడా పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. అయితే పోలింగ్ సమయం ముగిసినప్పటికీ, అప్పటికే క్యూలైన్‌‌లో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం ఇవ్వనున్నారు. అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో నేడు ఒకే దశలో పోలింగ్ పూర్తి చేయనున్నారు. ఇక్కడ మిజో నేషనల్‌ ఫ్రంట్‌ (ఎంఎన్‌ఎఫ్‌), జోరాం పీపుల్స్‌ మూవ్‌మెంట్‌ (జడ్‌పీఎం), కాంగ్రెస్‌ నడుమ త్రిముఖ పోటీ నెలకొంది. 18 మంది మహిళలు సహా 174 మంది అభ్యర్థులు పోటీచేస్తున్నారు. 8,51,895 మంది ఓటర్లు ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. 1,276 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎన్నికల నేపథ్యంలో మయన్మార్‌, బంగ్లాదేశ్‌ సరిహద్దులను మూసివేశారు. అసోం, మణిపూర్‌, త్రిపుర రాష్ట్ర సరిహద్దులను బంద్‌ చేశారు. కాగా గత ఎన్నికల్లో ఎంఎన్‌ఎఫ్‌కు 27 స్థానాలు, జడ్‌పీఎంకు 7, కాంగ్రె్‌సకు 5, బీజేపీకి ఒక్క స్థానం దక్కాయి. కాగా ఈ ఎన్నికల ఫలితాలు డిసెంబర్ 3న వెల్లడికానున్నాయి.

Spread the love