అభివృద్ధిపై పొన్నం ప్రభాకర్ కు అవగాహన లేదు

– రాజకీయ పబ్బం  కోసం విమర్శలు

– హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్
నవతెలంగాణ- హుస్నాబాద్ రూరల్ 
నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసిన అభివృద్ధిపై మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ అవగాహన లేకుండా మాట్లాడడం రాజకీయ పబ్బం గడుపుకోవడం  కోసమేనని హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ మండిపడ్డారు. శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ..  హుస్నాబాద్ నియోజకవర్గం అభివృద్ధి చెందలేదు అనడం పొన్నం దిగజారుడుతనానికి నిదర్శనం అన్నారు.పొన్నం ప్రభాకర్ కరీంనగర్ ఎంపీగా ఉన్నప్పుడు ఎన్ని నిధులు తెచ్చావని, నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి ఏంటో తెలపాలని సవాలు విసిరారు. రాజకీయ పబ్బం గడుపుకోవడానికి నోటికి ఏది వస్తే అది మాట్లాడితే ప్రజలు విశ్వసించే రోజులు పోయాయని అన్నారు . గతంలో కల్లబొల్లి కబుర్లు చెప్పి కాంగ్రెస్ నాయకులు తమ పబ్బం గడుపుకున్నారే కానీ హుస్నాబాద్ అభివృద్ధి గురించి ఏ కోశానా ఆలోచించలేదని అన్నారు.  తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటి నుండి సీఎం కేసీఆర్  నాయకత్వంలో హుస్నాబాద్ నియోజకవర్గానికి చాలా నిధులు తెచ్చి అభివృద్ధి చేశానని చెప్పారు. నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తూ రాష్ట్రంలోనే ప్రత్యేకంగా నిలబెడుతున్నానని అవి చూసి ఓర్వలేని తనంతో ఇలాంటి దిగజారుడు మాటలు మాట్లాడడం వారి వివేకానికి వదిలేస్తున్నానన్నారు. తెలంగాణ గురించి పార్లమెంటులో కొట్లాడిన వ్యక్తిగా వ్యక్తిగతంగా పొన్నం ప్రభాకర్ అంటే గౌరవం ఉందని ఇలాంటి చిల్లర మాటలు మాట్లాడి అతని వ్యక్తిత్వాన్ని దిగజార్చుకోవద్దని హితవు పలికారు.
Spread the love