– సింగాపురం రాజేశ్వరరావు ఆశయ సాధనకు కృషి
– కాంగ్రెస్ హజురాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థి ఒడితెల ప్రణవ్ బాబు
నవతెలంగాణ-వీణవంక: మాజీ రాజ్యసభ సభ్యుడు సింగాపురం రాజేశ్వరరావు ఆశయ సాధనకు కృషి చేస్తానని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఒడితెల ప్రణవ్ బాబు స్పష్టం చేశారు. మండలంలోని మామిడాలపల్లి, ఇప్పలపల్లి, చల్లూరు, ఎల్బాక, గంగారం, బొంతుపల్లి గ్రామాల్లో సోమవారం ఎన్నికల ప్రచారం నిర్వహించి కార్నర్ మీటింగ్ లు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నవంబర్ 30న జరిగే ఎన్నికలల్లో కాంగ్రెస్కు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీలను అందించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. గతంలో ఇక్కడే ఏడు సార్లు గెలిచిన ఈటల రాజేందర్ గజ్వేల్ కు వలస వెళ్లాడని, ఇక్కడున్న ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి గత రెండు సంవత్సరాలుగా ప్రజలకు చేసిందేమీ లేదని ఆరోపించారు. కావున తనకు గెలిపిస్తే ప్రజలకు అందుబాటులో ఉండి ప్రతీ సంక్షేమ పథకాన్ని ప్రజలకు అందజేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు చింతల శ్యాం సుందర్ రెడ్డి, జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ తుమ్మేటి సమ్మిరెడ్డి, మాజీ డైరెక్టర్ నల్ల కొండాల్ రెడ్డి, నాయకులు కర్ర భగవాన్ రెడ్డి, రాకేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.