ఫ్రంట్‌లైన్ సిబ్బందికి ఆయుధాల కోసం రూ.4.095 కోట్ల ప్రతిపాదనలు
ప్రభుత్వ పరిశీలనలో ఎక్సైజ్ శాఖకు ఆయుధాల అంశం
అటవీ అమరవీరుల త్యాగాలు భవిష్యత్ తరాలకు స్ఫూర్తి : మంత్రి జూపల్లి కృష్ణారావు
నెహ్రూ జూలాజికల్ పార్క్ స్మారక చిహ్నం వద్ద పుష్పాంజలి
నవతెలంగాణ – గోషామహల్
అడవులు, వన్యప్రాణుల సంరక్షణలో ప్రాణాలను పణంగా పెడుతున్న అటవీ సిబ్బంది భద్రత, సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. అటవీ అమరవీరుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకుని అటవీ సంరక్షణను మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. శుక్రవారం జాతీయ అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని నెహ్రూ జూలాజికల్ పార్క్ స్మారక చిహ్నం వద్ద ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, డీజీపీ సీవీ ఆనంద్, వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్, పీసీసీఎఫ్ వినయ్‌కుమార్, పీసీసీఎఫ్ (డెవలప్మెంట్) రత్నాకర్ జోహరి, టీజీఎఫ్డీసీ వైస్ చైర్మెన్, ఎండీ సునీతా భగవత్, అటవీ శాఖ ఉన్నతాధికారులు, సిబ్బంది, విశ్రాంత అధికారులు, సిబ్బందితో కలిసి స్మారక మంత్రి పుష్పాంజలి ఘటించి అమరవీరులకు నివాళులర్పించారు. వన్యప్రాణుల వేట కోసం అమర్చిన విద్యుత్ వైర్లు తగిలి మృతిచెందిన చెరువుసింగారం వెస్ట్ బీట్ ఆఫీసర్ బానోత్ నవీన్ కుటుంబానికి మంత్రి రూ.30 లక్షల చెక్కును అందజేశారు.
అనంతరం మంత్రి మాట్లాడుతూ.. అటవీశాఖను బలోపేతం చేసేందుకు 1,393 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు, 15 ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్లు, 18 అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్తో పాటు ఇతర కేటగిరీల్లో మొత్తం 1,516 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం అనుమతిచ్చిందని తెలిపారు. ఇందుకు సంబంధించిన నియామక ప్రక్రియ కొనసాగుతోందన్నారు. 2014 నుంచి 2026 జులై వరకు 1,06,685 అటవీ నేరాల కేసులు నమోదైనట్టు చెప్పారు. వీటిలో రూ.55.99 కోట్ల విలువైన కలపకు సంబంధించిన కేసులు ఉన్నాయని, రూ.160.75 కోట్ల పరిహార రుసుమును వసూలు చేసినట్టు వెల్లడించారు. ఈ కేసులకు సంబంధించి 19,482 వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అదనంగా 31,523 గుర్తుతెలియని అటవీ నేరాల కేసులు నమోదు చేసి, రూ.70.72 కోట్ల విలువైన కలపను స్వాధీనం చేసుకుని కలప డిపోలకు తరలించినట్లు చెప్పారు. 11,824 అటవీ ఆక్రమణ కేసులు కూడా నమోదయ్యాయని వెల్లడించారు.
ఫ్రంట్‌లైన్ సిబ్బందికి ఆయుధాలు
అటవీ రక్షణ విధుల్లో సిబ్బంది ఎదుర్కొంటున్న ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని ఫ్రంట్‌లైన్ సిబ్బందికి ఆయుధాలు అందించేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించినట్టు మంత్రి తెలిపారు. ఆయుధాలు, మందుగుండు సామగ్రి అందించేందుకు రూ.4.095 కోట్ల అంచనాతో రూపొందించిన ప్రతిపాదనలు ప్రస్తుతం ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయని వెల్లడించారు. అటవీ సిబ్బందికి రక్షణ కల్పించడంతో పాటు సమాచార వ్యవస్థ, వాహనాలు, సాంకేతిక సదుపాయాలను మరింత బలోపేతం చేస్తామని తెలిపారు. ఎక్సైజ్ శాఖకు కూడా ఆయుధాలు అందించే అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉందని చెప్పారు.
అటవీ సంరక్షణలో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్న ప్రతి అటవీ అధికారి, ఫ్రంట్‌లైన్ సిబ్బందికి మంత్రి అభినందనలు తెలిపారు. అమరవీరుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకుని తెలంగాణ అటవీ సంపదను మరింత బలోపేతం చేయాలని, వన్యప్రాణులకు సురక్షితమైన ఆవాసాలు కల్పించాలని, ప్రజలకు–ప్రకృతికి మధ్య సమతుల్యత సాధిస్తూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, జూ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
అటవీ సిబ్బంది భద్రత, సంక్షేమానికి ప్రాధాన్యత
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



