– ఎఐకెఎస్ సంతాపం
న్యూఢిల్లీ : శాస్త్రీయ దృక్పథం కలిగిన నేత, ప్రముఖ రైతు సంఘ నాయకుడు కామ్రేడ్ కె.వి.రామకృష్ణన్ (74) కన్నుమూశారు. కేరళ కర్షక సంఘం మాజీ రాష్ట్ర కార్యదర్శి, సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులైన రామకృష్ణన్ పాలక్కాడ్ జిల్లా పొన్నాని తాలుకా కుమరనెల్లార్‌లో 1950 ఏప్రిల్ 8న జన్మించారు. అఖిల భారత కిసాన్ సభ కేంద్ర కిసాన్ కమిటీ సభ్యుడిగా కూడా ఆయన వున్నారు. కేరళలో రైతాంగ ఉద్యమాన్ని నిర్మించడానికి తన జీవితాన్ని ధారపోసిన ఆయన మంచి నిర్మాణదక్షుడు. కేరళ కర్షక సంఘం రాష్ట్రంలో అతిపెద్ద ప్రజా సంఘంగా అవతరించడంలో ఆయన ప్రధాన పాత్ర పోషించారు. కేరళ రాష్ట్ర వ్యవసాయ ప్రణాళిక రూపకల్పనలో కూడా ఆయన ప్రమేయం వుంది. సంయుక్త కర్షక సమితి కన్వీనర్ అయిన కేరళ కర్షక సంఘం మేగజైన్ కర్షక నాదమ్ మేనేజర్‌గా వున్నారు. కేరళ రాష్ట్ర రైతు రుణ రిలీఫ్ కమిషన్‌కు సభ్యుడుగా కూడా పనిచేశారు. వరి, కొబ్బరి, రబ్బర్ వంటి పంటల విషయాల్లో ఆయన విశేషమైన కృషి చేశారు. రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ఆయన చాలా అధ్యయనం చేశారు. వాటినన్నింటినీ ఉద్యమంగా మార్చడంలో ముందుండేవారు.
కె.వి.రామకృష్ణన్ మృతికి ఎఐకెఎస్ తీవ్ర సంతాపం తెలిపింది. వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేసింది. రైతాంగ ప్రయోజనాల పట్ల ఆయనకు గల నిబద్ధత తిరుగులేనిదని అఖిల భారత కిసాన్ సభ వ్యాఖ్యానించింది. దేశంలో వ్యవసాయ ఉద్యమానికి ఆయన అందించిన సేవలను గుర్తు చేసుకుంటూ, ఆయన మృతికి గౌరవ సూచకంగా ఎఐకెఎస్ పతాకాలను అవనతం చేశారు.