ఆహార విషయాల ద్వారా సైన్స్‌ ప్రమోషన్‌

Promotion of Science through Food Matters– పద్మశ్రీ డాక్టర్‌ దాసరి ప్రసాదరావు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
సమతుల్యాహారం తదితర విషయాలను ప్రచారం చేయడం ద్వారా సైన్స్‌ను ప్రమోట్‌ చేయాలని పద్మశ్రీ డాక్టర్‌ దాసరి ప్రసాదరావు సూచించారు. శుక్రవారం హైదరాబాద్‌లో జన విజ్ఞాన వేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కోయ వెంకటేశ్వర రావు అధ్యక్షతన ఆల్‌ ఇండియా పీపుల్స్‌ సైన్స్‌ నెట్‌వర్క్‌ (ఏఐపీఎస్‌ఎన్‌) ఆధ్వర్యంలో సైంటిఫిక్‌ టెంపర్‌ అనే అంశంపై జాతీయ స్థాయి సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశం ప్రారంభోత్సవంలో దాసరి ప్రసాదరావు మాట్లాడుతూ తల్లి గర్భం నుంచే శిశువుల ఆహారం, ఆరోగ్యం పొందుతారని తెలిపారు. 30 ఏండ్లుగా డాక్టర్‌గా తన అనుభవంలో రోగాలకు నివారణ ముఖ్యమని గ్రహించినట్టు తెలిపారు. ప్రస్తుతం వస్తున్న రోగాల్లో మూడింట రెండు వంతులు అసాంక్రమిత (నాన్‌-కమ్యూనికేబుల్‌ డిసీజెస్‌) ఉంటున్నాయని తెలిపారు. స్మోకింగ్‌, సరైన శారీరక శ్రమ లేకపోవడం, వ్యాయమం లేకపోవడం తదితర సరైన జీవనశైలి లేకపోవడంతో ఈ రోగాలు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలనీ, మందులకు తర్వాతి స్థానం ఇవ్వాలని సూచించారు. కాలుష్యం లేని వాతావరణంలో ఆహారం, నీరు ప్రజలకందాల్సి ఉందని తెలిపారు. ఏమి తినాలి? ఎలా తినాలి? తదితర విషయాలను ప్రజలు తెలుసుకోవాలని సూచించారు. పూర్తిగా మాంసాహారం తినాలనీ లేదా పూర్తిగా మాంసాహారం మానేయాలని చెబుతుంటారనీ, కానీ, ప్రతి ఒక్కరు సమతుల్యాహారం గురించి తెలుసుకోవాలని కోరారు. భారతదేశంలో ఎక్కువగా ఉత్పత్తి రహిత చర్చలు జరుగుతుంటాయని ఆవేదన వ్యక్తం చేశారు. చాలా అభివద్ధి చెందిన దేశాల్లో ఉత్పత్తిసహిత చర్చలతో ఎదుగుదల కనిపిస్తున్నదన్నారు.
సైన్సులో ఆరోగ్యం, వ్యవసాయం, ఇంజినీరింగ్‌ ముడిపడి ఉన్నాయని తెలిపారు. సైన్స్‌ అంటేనే ఆహారమనీ, ఆహారమంటేనే ఇంజినీరింగ్‌ అని, ఆహారమంటేనే ఔషధంమంటూ డాక్టర్‌ దాసరి ప్రసాదరావు తెలిపారు. ఆహారానికి – సైన్సుకు ఉన్న సంబంధాన్ని వివరిస్తూ ప్రచారం చేయాలని సైన్స్‌ ప్రమోటర్లకు ఆయన సూచించారు. అల్లోపతి వైద్యం ఆధారాలతో నిరూపితమైందని తెలిపారు. కొన్ని వైద్య విధానాలకు ఆధారాలుండవనీ, అవి కేవలం తమ పూర్వీకుల అనుభవాల మేరకు వాడుతుంటారని విమర్శించారు. మధ్యాహ్న భోజన పథకం గొప్ప పథకమని కొనియాడారు. ఏఐపీఎస్‌ఎన్‌ ప్రధాన కార్యదర్శి ఆశా మిశ్రా మాట్లాడుతూ భారతదేశంలో పాలకవర్గాలు అశాస్త్రీయ భావాలను పెంపొందిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యా పాఠ్యాంశాల్లోనూ అశాస్త్రీయ అంశాలను పొందుపరుస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. నిజమైన సైన్సు అంటే ఏంటో చెప్పాల్సిన బాధ్యత అందరిపై ఉందని గుర్తుచేశారు. గోవింద్‌ పన్సారే, గౌరీ లంకేష్‌, కల్బుర్గి తదితరులు ఏ ఆశయం కోసమైతే పని చేశారో దాన్ని కొనసాగించాలని పిలుపునిచ్చారు.

Spread the love