తెలంగాణ స్ఫూర్తితో దేశమంతటా మొక్కలు నాటాలి

–  గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో ప్రపంచ ప్రఖ్యాత పర్యావరణవేత్త ఎరిక్‌ సోల్హీమ్‌
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
తెలంగాణకు హరితహారం కార్యక్రమం ద్వారా ఏడు శాతం కొత్తగా అటవీ విస్తీర్ణం పెరగడం అద్భుతమనీ, ఇదే స్ఫూర్తితో దేశంలోని మిగతా రాష్ట్రాల్లోనూ మొక్కలను పెంచాలని ఐక్యరాజ్యసమితి ఎన్విరాన్‌ మెంటల్‌ ప్రొగ్రాం మాజీ ఎగ్జికూటివ్‌ డైరెక్టర్‌, నార్వే మాజీ మంత్రి, ‘గ్రీన్‌ బెల్డ్‌ అండ్‌ రోడ్‌ ఇనిస్టిట్యూట్‌ వ్యవస్థాపకులు, పర్యావరణవేత్త ఎరిక్‌ సోల్హీమ్‌ పిలుపునిచ్చారు. అందరూ కలిసి పనిచేస్తే భూమిపై సాధించలేనిదంటూ లేదనే తన ఆశయానికి గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ నిర్వాహకులు, ఎంపీ జోగినిపల్లి సంతోశ్‌కుమార్‌ ప్రతిరూపంగా కనిపించారని కొనియాడారు.
శుక్రవారం హైదరాబాద్‌లోని బేగంపేటలో సంతోశ్‌కుమార్‌తో కలిసి ఆయన మొక్కలు నాటారు. ఈ సందర్భంగా సోల్హీమ్‌ మాట్లాడుతూ.. ప్లాస్టిక్‌ నియంత్రణ కోసం కార్యక్రమాల్ని రూపొందించి అమలు చేయడం చాలా సంతోషించదగ్గ విషయమన్నారు. మనం కావాలని తెచ్చిపెట్టుకున్న ప్లాస్టిక్‌ భూతం ఇవ్వాళ నేలను, మానవాళిని తినేస్తున్నదనీ, ఇది ఆగిపోవాలంటే ప్రతీ ఒక్కరు జోగినిపల్లి సంతోష్‌ కుమార్‌ కావల్సిన అవసరముందని నొక్కి చెప్పారు.
ముగ్గురు ప్రపంచ పర్యావరణవేత్తలకు ”గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌” విసిరారు. ఈ కార్యక్రమాన్ని విస్తరించేందుకు తన వంతు తోడ్పాటు అందిస్తానని హామీనిచ్చారు. అనంతరం జోగినిపల్లి సంతోష్‌ కుమార్‌ ”గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌” ద్వారా రూపొందించిన ”వృక్షవేదం” ”హరితహాసం” ”వింగ్స్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌” టేబుల్‌ బుక్స్‌ను ఎరిక్‌ సోల్హీమ్‌కు అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రపంచంలో గొప్ప పర్యావరణవేత్త.. ప్రకృతి ప్రేమికుడు ఎరిక్‌ సోల్హీమ్‌ తో కలిసి మొక్కలు నాటడం చాలా సంతోషం కలిగించిందన్నారు. కార్యక్రమంలో ప్రొక్లైమ్‌ సీఈఓ కెవిన్‌ కందస్వామి, సీఓఓ శశిధర్‌తో పాటు ”గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌” వ్యవస్థాపక సభ్యులు రాఘవ, కర్ణాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Spread the love