నిలోఫర్‌ ఆస్పత్రిలో చిన్నారి అదృశ్యం

– తల్లికి పరిచయమైన మహిళపై అనుమానం..!
– దర్యాప్తు చేస్తున్న పోలీసులు
నవతెలంగాణ-మెహిదీపట్నం
హైదరాబాద్‌ నిలోఫర్‌ ఆస్పత్రిలో ఆరు నెలల చిన్నారి అదృశ్యమైన ఘటన కలకలం రేపింది. పోలీసులు, బాలుడి తల్లి తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌కు చెందిన సల్మాన్‌- ఫరీదా దంపతులు గండిపేట ప్రాంతంలోని ఒక వ్యవసాయ క్షేత్రంలో సెక్యూరిటీ సిబ్బందిగా పని చేస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారులు. నాలుగేండ్ల పెద్ద కుమారుడికి జ్వరం రావడంతో ఫరీదా గురువారం ఇద్దరు పిల్లలను తీసుకొని నీలోఫర్‌ ఆస్పత్రికి వచ్చింది. డాక్టర్‌ సలహా మేరకు పెద్ద కుమారుడిని ఆస్పత్రిలో అడ్మిట్‌ చేసి.. ఆరు నెలల చిన్న కుమారుడు పైజల్‌ ఖాన్‌ను ఎత్తుకుని వార్డు బయటికి వచ్చింది. ఈ క్రమంలో ఆమెకు ఒక మహిళ పరిచయమైంది. అనంతరం బాబుని ఆ మహిళ కొద్దిసేపు ఎత్తుకుంది. తర్వాత ఫరీదా భోజనం చేయడానికి బాబును వార్డులో పడుకోబెట్టి వెళ్లి 15 నిమిషాల తర్వాత తిరిగి రాగా బాలుడు కనిపించలేదు. చిన్నారి కోసం చుట్టుపక్కల అంతా వెతికినా దొరక్కపోవడంతో ఆమె గురువారం రాత్రి నాంపల్లి పోలీసులను ఆశ్రయించింది. తనతో మాట్లాడిన ఆ మహిళ కూడా కనిపించడం లేదని.. ఆమెపైనే అనుమానం ఉందని పోలీసులకు ఫరీదా తెలిపింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాబు ఆచూకీ కోసం గాలిస్తున్నారు ఆస్పత్రిలో సీసీ కెమెరాలు పనిచేయకపోవడంతో దర్యాప్తు సంక్లిష్టంగా మారింది. తన బిడ్డను వెతికిపెట్టాలంటూ తల్లి ఫరీదా బేగం కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది.

Spread the love