హైకోర్టు, జిల్లా కోర్టుల జోక్యం తగదు!

Interference of High Court and District Court is inappropriate!– జస్టిస్‌ ఎల్‌.నాగేశ్వర రావు కమిటీ అంశంలో సుప్రీం
– కమిటీ విధులకు ఆటంకం కలిగించే ఆదేశాలు చెల్లవు
– హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం ఎన్నికలకు లైన్‌ క్లియర్‌
నవతెలంగాణ-న్యూఢిల్లీ
హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం (హెచ్‌సీఏ) ఎన్నికలు, సంస్కరణలకు సంబంధించి సర్వోన్నత న్యాయస్థానం శుక్రవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఏండ్లుగా హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘంలో గ్రూపు రాజకీయాలు ఆట అభివృద్ధికి గొడ్డలిపెట్టుగా నిలుస్తుందని, హెచ్‌సీఏ సమూల సంస్కరణలు, భవిష్యత్‌లో వివాద రహిత అపెక్స్‌ కౌన్సిల్‌ ఎన్నికకు అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా ఈ ఏడాది ఫిబ్రవరి 14న జస్టిస్‌ లావు నాగేశ్వర రావుతో కూడిన ఏక సభ్య కమిటీని సుప్రీంకోర్టు నియమించిన సంగతి తెలిసిందే. హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం సమస్యలను సమూలంగా అధ్యయనం చేసిన ఏకసభ్య కమిటీ.. అపెక్స్‌ కౌన్సిల్‌ ఎన్నికను ప్రభావితం చేస్తున్న బహుళ క్లబ్‌ల యజమానులను ఎన్నికల ప్రక్రియకు దూరం చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఏకసభ్య కమిటీ నిర్ణయంపై పలు క్లబ్‌లు జిల్లా, హైకోర్టును ఆశ్రయించాయి. దీంతో షెడ్యూల్‌ ప్రకారం సెప్టెంబర్‌ 15న నిర్వహించాల్సిన ఎన్నికలు పట్టాలెక్కలేదు. దిగువ న్యాయస్థానాల్లో పెండింగ్‌లో ఉన్న కేసులపై జస్టిస్‌ లావు నాగేశ్వర రావు సుప్రీంకోర్టులో పిటిషను దాఖలు చేయగా.. జస్టిస్‌ సంజరు కిషన్‌ కౌల్‌, జస్టిస్‌ సిదాన్షు ధులియలతో కూడిన ద్వి సభ్య ధర్మాసనం కీలక ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టు న్యాయ పరిధి మేరకు ఆర్టికల్‌ 142 ప్రకారం ప్రత్యేకంగా ఈ ఆదేశాలు జారీ చేస్తున్నాం. సంపూర్ణ న్యాయం అందించే ప్రక్రయలో భాగంగా ఆర్టికల్‌ 142ను వినియోగిస్తారు.
ఆ ఆదేశాలు చెల్లవు!
జస్టిస్‌ లావు నాగేశ్వర రావు కమిటీ హెచ్‌సీఏ ఎన్నికల్లో పాల్గొనకుండా బహుళ యాజమాన్యంలోని 57 క్లబ్‌లపై మూడేండ్ల పాటు నిషేధం విధిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. దీనిపై పలు క్లబ్‌లు న్యాయస్థానాలను ఆశ్రయించాయి. ఎలక్టోరల్‌ కాలేజ్‌ ఏర్పాటు తుది ప్రక్రియ ఖరారు చేసిన జస్టిస్‌ లావు నాగేశ్వర రావు.. ఎన్నికల అధికారిగా మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్‌ వి.ఎస్‌ సంపత్‌ను నియమించారు. కానీ ఓటు హక్కు, ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేకుండా చేయటంపై కొన్ని క్లబ్‌లు దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టు సహా జిల్లా కోర్టులు పలు ఆదేశాలు జారీ చేశాయి. దీంతో హెచ్‌సీఏ ఎన్నికల ప్రక్రియకు బ్రేక్‌ పడింది. ఈ పరిస్థితిపై జస్టిస్‌ లావు నాగేశ్వరరావు సుప్రీంకోర్టులో పిటిషను దాఖలు చేయగా.. ద్వి సభ్య ధర్మాసనం దిగువ కోర్టుల ఆదేశాలు చెల్లవని పేర్కొంది. ‘ ఎలక్టోరల్‌ కాలేజ్‌ జాబితా మార్పులు, చేర్పులపై దిగువ కోర్టులు ఆదేశాలు చెల్లవు. ఏక సభ్య కమిటీ విధులకు విఘాతం కలిగించే ఆదేశాలు అమల్లోకి రాలేవు. హెచ్‌సీఏ ఎన్నికలు, సంస్కరణల అంశంలో ఏక సభ్య కమిటీకి సుప్రీంకోర్టు పూర్తి అధికారాలు ఇచ్చింది. సుప్రీంకోర్టు ఎదుట పెండింగ్‌లో ఉన్న పిటిషను సైతం ఎన్నికల నిర్వహణకు ఆటంకం కాబోదు. జస్టిస్‌ నాగేశ్వర రావు కమిటీ తన విధులను యథావిధిగా నిర్వర్తించాలి’ అని జస్టిస్‌ సంజరు కిషన్‌ కౌల్‌ అన్నారు.
రిటైర్డ్‌ జడ్జితో విచారణ కమిటీ!
విశ్రాంత జస్టిస్‌ లావు నాగేశ్వర రావు పిటిషను విచారణ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం సహా ఇతర క్రీడా సంఘాల్లోనూ ఇదే తీరు కనిపిస్తుంది. కొందరు వ్యక్తులు శాశ్వతంగా పదవుల్లో కొనసాగేందుకు ఎన్నికల ప్రక్రియకు అడ్డుగా నిలుస్తున్నారు. గ్రూపు రాజకీయాలకు కేంద్రంగా మారిన హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘంలోనూ ఇదే తీరు. గతంలో అంబుడ్స్‌మన్‌ ఎంపిక విషయంలో హెచ్‌సీఏ అపెక్స్‌ కౌన్సిల్‌ సరైన రీతిలో వ్యవహరించలేదు. అంబుడ్స్‌మన్‌, ఎథిక్స్‌ ఆఫీసర్‌ ఎంపిక వివాదం సహా హెచ్‌సీఏ వ్యవహారాలపై సమగ్ర విచారణకు సుప్రీంకోర్టు లేదా హైకోర్టు మాజీ న్యాయమూర్తితో కమిటీ ఏర్పాటుకు ఆదేశిస్తామని ఈ సందర్భంగా జస్టిస్‌ సంజరు కిషన్‌ కౌల్‌ వ్యాఖ్యానించారు. ఈ కేసులో విచారణను అక్టోబర్‌ 31కి వాయిదా వేశారు.

Spread the love