ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీ అప్పుడున్నారా?

– కమ్యూనిస్టుల పోరాటాన్ని హైజాక్‌ చేయాలన్న వక్రబుద్ది : సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
కమ్యూనిస్టుల నాయకత్వంలో సాగిన తెలంగాణ రైతాంగ పోరాట సమయంలో ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీ ఎక్కడున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ సంఫ్‌ుపరివార్‌ను ఉద్దేశించి ప్రశ్నించారు. తెలం గాణ రైతాంగ సాయుధ పోరాటం 75 వసంతాల వజ్రోత్సవాలలో భాగంగా శుక్రవారం హైదరాబాద్‌లోని గన్‌ పార్క్‌ ఎదుట హైదరాబాద్‌ జిల్లా సమితి ఏర్పాటు చేసిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ఛాయాచిత్ర ప్రదర్శనను సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వి.ఎస్‌. బోస్‌, ఈ.టి. నరసింహ, హైదరాబాద్‌ జిల్లా కార్యదర్శి ఎస్‌. ఛాయా దేవి, సహాయ కార్యదర్శులు కమతం యాదగిరి, బి. స్టాలిన్‌, రాష్ట్ర సమితి సభ్యులు బి. వెంకటేశం, ప్రముఖ సంఘసేవకులు మోటూరి కృష్ణ ప్రసాద్‌లతో కలసి నారాయణ ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ నాటి సాయుధ పోరాటాన్ని హైజాక్‌ చేసి, అది మత ప్రాతిపదికన జరిగిన పోరాటంగా చిత్రించాలన్న వక్రబుద్దిని బీజేపీ ప్రదర్శిస్తున్నదని చెప్పారు. పోరాటం దేశ చరిత్రలోనే మరవలేని ఘట్టమని కొనియాడారు. నిజాం నవాబుకు వ్యతిరేకంగా, భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం అన్ని తరగతుల ప్రజలు సాయుదులుగా తిరగబడ్డారని గుర్తు చేశారు. ఆ పోరాటంలో అనేక మంది ప్రాణాలర్పించారని తెలిపారు. ఆనాడు నిజాం నిరంకుశ పాలన రూపంలాగే నేడు ప్రధాని మోడీ పాలన ఉందని చెప్పారు. నిజాం నిరంకుశ పాలనా పునాదులను పెకిలించినట్లే, ఫాసిస్ట్‌ మోడీ పాలనా పునాదులను కూడా పెకిలిస్తామని హెచ్చరించారు.

Spread the love