ప్రచారం మీదే ధ్యాస

ప్రచారం మీదే ధ్యాస– ఇదే మోడీ తీరు
– తను చదువుకున్న స్కూల్‌ నుంచి రైళ్ల వరకు..
– దేనిని వదలని ప్రధాని
– తన ఫోటోలు, పేరు విపరీతంగా ప్రచారం కావటానికి విపరీత ప్రయత్నాలు
–  మోడీని దేవుడిగా కీర్తిస్తూ.. ఆలయాలు నిర్మిస్తూ బీజేపీ నాయకుల వింత చర్యలు
న్యూఢిల్లీ : ప్రధాని మోడీకి ప్రచారం మీద ఉన్న ధ్యాస గురించి వేరే చెప్పనక్కర్లేదు. కార్యక్రమం, ప్రదేశం, సందర్భం ఏదైనా.. తాను హైలట్‌ అవ్వటమే ఆయనకున్న అలవాటు. కేంద్రంలో 2014లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మొదలుకొని ఇప్పటి వరకు మోడీ ఇదే తరహా ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. ఇందుకు చిన్నతనంలో తాను విద్యనభ్యసించిన పాఠశాలను సైతం మోడీ వదలలేదు. ఆ ప్రాథమిక పాఠశాలకు పవిత్రమైన ‘ప్రేరణ స్థల్‌’ (ప్రేరణ ప్రదేశం)గా పేరు పెట్టారు. విద్యార్థులను అధ్యయన పర్యటనలకు వివిధ రాష్ట్రాల నుంచి తీసుకువస్తున్నారు. మోడీ రేడియో షో మన్‌ కీ బాత్‌ 100వ ఎపిసోడ్‌కు గుర్తుగా రూ.100 నాణెం తీసుకురావటం గమనార్హం. తన పేరు మీద ఉన్న నమో భారత్‌ రైలును మోడీ స్వయంగా జెండా ఊపి ప్రారంభించారు. అలాగే, కమలంలో కొత్త జాతికి మోడీ పేరు పెట్టారు. స్వంత రాష్ట్రం గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో గల క్రికెట్‌ స్టేడియానికి సర్దార్‌ పటేల్‌ పేరుండేది. అయితే ఆ పేరును మార్చి మోడీ పేరును పెట్టటం గమనార్హం.
‘మోడీ సెల్ఫీ స్టాండ్‌’లు కూడా ఎక్కువగా కనిపించే మోడీ ప్రచార పర్వంలో ఒక భాగం. రాబోయే కొద్ది నెలల్లో, బీజేపీ నేతృత్వంలోని కార్పొరేషన్‌లు, పౌర సంస్థల వద్ద కూడా ఈ సెల్ఫీ పాయింట్లు వచ్చే అవకాశాలున్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ సెల్ఫీ పాయింట్ల వద్ద మోడీ బొమ్మ ఉంటుంది. వీటిని ఇప్పటికే రైల్వే స్టేషన్లు, విశ్వవిద్యాలయాలకు వ్యాప్తి చెందించటం గమనార్హం. అయితే, అనేక చోట్ల పౌర, సామాజిక సంఘాల నాయకుల నుంచి ప్రతిఘటన ఎదురైంది. అయితే, అత్యంత ఆందోళనకరమైన విషయమేమిటంటే.. ఈ మోడీ సెల్ఫీలు, ఇతర ‘కాషాయ’ చిహ్నాలను రాజకీయాలతో సంబంధంలేని మిలిటరీ సంస్థలకూ వ్యాప్తి చేయటం. దేశవ్యాప్తంగా బహిరంగ ప్రదేశాల్లో ఆర్మీ, నేవీ, ఎయిర్‌ ఫోర్స్‌, ఇతర సైనిక సంస్థలు మోడీ ఫోటోను కలిగి ఉండవచ్చనీ, జియో-ట్యాగ్‌ చేయబడిన 822 సెల్ఫీ పాయింట్లను ఇన్‌స్టాల్‌ చేయాలని గతేడాది అక్టోబర్‌లో రాసిన లేఖలో రక్షణ మంత్రిత్వ శాఖ సూచించింది. ఈ ఆదేశాలను వెంటనే అమలు చేయాలని వివరించింది. చివరిసారిగా మోడీ ప్రసంగించిన సంయుక్త కమాండర్ల సమావేశం భోపాల్‌లోని కుషాభౌ ఠాక్రే సెంటర్‌లో జరిగింది. ఇక్కడి గేటు వద్ద మోడీ చిత్రపటం ఉన్నది. భద్రతా బలగాల విషయాల్లో రాజకీయాలు ఉండకూడదనీ, వీటిని రాజకీయాలకు దూరంగా ఉంచాలని ఆర్మీ మాజీ చీఫ్‌ వేద్‌ ప్రకాశ్‌ మాలిక్‌ అన్నారు. సైన్యాన్ని రాజకీయం చేసే ప్రయత్నాలను ఆయన నిలదీశారు. ఇటువంటి పరిణామాలు బలగాలపై దీర్ఘకాలిక ప్రభావం చూపుతాయని అడ్మిరల్‌ అరుణ్‌ ప్రకాష్‌ అన్నారు.
బీజేపీలో ‘మోడీ’ నామస్మరణ
ఇక బీజేపీలో ‘మోడీ’ నామస్మరణ తీవ్రమయింది. పార్లమెంట్‌లో 2021లో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా బీజేపీ సభ్యులు మోడీని 420 సార్లు ప్రస్తావించారు. ఒక బీజేపీ ఎంపీ అయితే మోడీని దేవుడి అవతార మని ప్రశం సించారు. అలాగే, యూపీలోని యోగి ఆదిత్యనాథ్‌ ప్రభుత్వంలోని ఒక సీనియర్‌ మంత్రి మోడీని దేవుని అవతారంతో పోల్చారు. యూపీలోని కౌశాంబిలో మరొక ఆలయం ఉన్నది. ఇక్కడ మోడీ శివునితో పాటు పూజించబడ్డారని నివేదించబడింది. ఒక బీజేపీ నాయకుడు పూణెలో మోడీ ఆలయాన్ని నిర్మించాడు. యూపీలోని మీరట్‌లో రూ. 10 కోట్ల అంచనా వ్యయంతో ఐదు ఎకరాల స్థలంలో 100 అడుగుల మోడీ విగ్రహంతో ఆలయం రాబోతున్నట్టు సమాచారం.జన్‌ ఔషధి ఔట్‌లెట్‌ల మాదిరిగానే బీజేపీ పాలిత రాష్ట్రాల్లోని పీఎంజీకేఏవై రేషన్‌ షాపుల్లో కూడా మోడీ చిత్రాలను ప్రదర్శించే చర్యలు చోటు చేసుకున్నాయి.
మోడీకి ఆలయాలు
మోదీ దేవుడనీ, ఆయన భక్తులు ఆయనకు ప్రార్థనలు చేసి, మొక్కులు చెల్లించుకునే ఆలయాలు కూడా నిర్మించిన ఘటనలున్నాయి. రాజ్‌కోట్‌లో మోడీని ప్రధాన దేవుడిగా భావించి ఒక ఆలయాన్ని నిర్మించారు. అలాగే, ఒక విగ్రహానికి 3,000 డాలర్ల కంటే ఎక్కువ ఖర్చైందని సమాచారం. ప్రధానిగా ఎన్నికైన తొలి నాళ్లలో ఇది జరిగింది. దీనిపై విదేశాల్లో దుష్ప్రచారం రావటంతో మోడీ తన అసంతృప్తిని సైతం వెల్లడించక తప్పని పరిస్థితి ఏర్పడింది.
దేవుడి అవతారమంటూ.. 
బీజేపీ జాతీయ కార్యవర్గం తీరు కూడా ఇలాగే ఉన్నది. శివుడిలాగే మోడీ కూడా పార్టీపై ప్రతిపక్షాల దాడిని భరించి, భారత్‌తో పాటు ప్రపంచంలోనే అత్యున్నతమైన, అత్యంత ప్రజాదరణ పొందిన నాయకుడయ్యారని బీజేపీ జాతీయ కార్యవర్గ తీర్మానం పేర్కొన్నది. ప్రజలు మోడీని రాముడు, కష్ణుడి అవతారంగా భావిస్తారని తిరేంద్ర సింగ్‌ రావత్‌ ఉత్తరాఖండ్‌ సీఎంగా ఉన్న సమయంలో అన్నారు. మోడీ విష్ణువు 11వ అవతారమనీ బీజేపీ అధికార ప్రతినిధి అవధూత్‌ వాఫ్‌ తెలిపారు. బీజేపీ నాయకుడు కమల్‌ పటేల్‌ మోడీని నిరాశ వాతావరణం అంతం చేయటానికి జన్మించిన భగవంతుని అవతారంగా అభివర్ణించారు. మోడీలో దేవుని జాడలు ఉన్నాయనీ, ఆయన ”అతీంద్రియుడు” అని శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చెప్పారు. హిమాచల్‌ మంత్రి ఒకరు మోడీని శివుని అవతారంగా కీర్తించారు. ఇక గుజరాత్‌లో మోడీని బంగారు కడ్డీల్లో పెట్టి పూజించడం మొదలుపెట్టారు. ‘అవతార్‌ పాత్ర’ను ఆమోదిస్తూ..మహిళలకు సాధికారత కల్పించేందుకు దేవుడు నన్ను ఎంచుకున్నాడని మోడీ చెప్పటం గమనార్హం.
సంక్షేమ పథకాలను సైతం మోడీ విడిచిపెట్టలేదు. పీఎం ఆవాస్‌ యోజన, పీఎం కిసాన్‌ పథకం వంటి రెండు డజన్ల కంటే ఎక్కువ పథకాల పేర్లు ‘పీఎం’ పేరును కలిగి ఉంటాయి. వీటన్నిటిలోనూ ప్రధాని మోడీ ఫోటో కనబడే విధంగా ప్రచారానికి దిగటం గమనార్హం.

Spread the love