– జిల్లా అధ్యక్షుడు మహమ్మద్ అల్లావుద్దీన్
నవతెలంగాణ – కామారెడ్డి
రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖలలో, కార్పొరేషన్లు, సొసైటీలలో, స్థానిక సంస్థలలో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు బీమా పథకాన్ని వర్తింపచేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై రాష్ట్ర ఔట్సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ రాష్ట్ర ఉప అధ్యక్షుడు అరుణ్ కుమార్ జిల్లా అధ్యక్షుడు మహమ్మద్ అల్లావుద్దీన్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉప అధ్యక్షుడు అరుణ్ కుమార్ మాట్లాడుతూ.. గ్రామస్థాయి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న వేలాది మంది ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు 60 లక్షల వరకు భీమా రక్షణ లభించనుండడం వారి కుటుంబాలకు భరోసానిస్తుందని పేర్కొన్నారు. ఉద్యోగి ఏదైనా అనుకోని ప్రమాదానికి గురైన సమయంలో కుటుంబ సభ్యులకు ఆర్థిక భద్రత కల్పించి ఈ పథకం సామాజిక భద్రతకు నిదర్శనంగా నిలుస్తుందని పేర్కొన్నారు.
జేఏసీ జిల్లా అధ్యక్షుడు మహమ్మద్ అల్లావుద్దీన్ మాట్లాడుతూ ప్రతి ప్రభుత్వ కార్యాలయాలలో ఔట్సోర్సింగ్ ఉద్యోగులు కీలక పాత్ర పోషించినప్పటికీ గతంలో అనేక సంక్షేమ పథకాలకు దూరంగా ఉండేవారని ప్రస్తుతం ప్రభుత్వం వారిని బీమా పరిధిలోకి తీసుకురావడం అభినందనీయమని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువేయడంలో కార్యాలయ వేలకు మించి ఎక్కువ సమయం కేటాయిస్తూ పని పరంగా ప్రతి ఒక్క ఔట్సోర్సింగ్ ఉద్యోగి గ్రామస్థాయి నుండి జిల్లా, రాష్ట్ర స్థాయి వరకు కష్టపడుతున్నారని పేర్కొన్నారు. కావున తక్షణమే ప్రభుత్వం ఏజెన్సీ విధానాన్ని రద్దుచేసి కార్పొరేషన్ ఏర్పాటు చేసి పే స్కేల్ ఇవ్వాల్సిందిగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా బీమా పథకంపై ఇది గొప్ప సామాజిక భద్రత చర్య అని జేఏసీ కమిటీ సభ్యులు కొనియాడారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క,పలు శాఖల మంత్రులకు, ప్రభుత్వ సలహాదారులకు, ఎమ్మెల్యేలకు,రాష్ట్ర,జిల్లా స్థాయి అధికారులకు రాష్ట్ర జేఏసీ ఉప అధ్యక్షుడు అరుణ్ కుమార్ జిల్లా అధ్యక్షుడు అల్లావుద్దీన్, ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్, జిల్లా కోశాధికారి రాజేందర్, జేఏసీ జిల్లా సలహాదారులు రాజ్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జేఏసీ సభ్యులు ఇమ్రాన్, పద్మ ,అనసూయ, జగన్ విక్రమ్ మునీర్ నాగేష్ నవీన్ అంజయ్య, కన్నయ్య హరీష అనిత పరమేశ్వరి, దేవేందర్, సాయిబాబా, వినోద్ క్రాంతి శ్రీనివాస్ ఉన్నారు.



