ప్రజాధనాన్ని కొల్లగొడుతున్నారు

ప్రజాధనాన్ని
కొల్లగొడుతున్నారు– కాంగ్రెస్‌ది బూటకపు సెక్యులరిజం
– బీజేపీ, బీఆర్‌ఎస్‌ మిలాఖత్‌ అయ్యాయి
సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు ఎంఏ గఫూర్‌ విమర్శ
విలువైన ప్రజాధనాన్ని కొల్లగొడుతున్న బీజేపీ, బీఆర్‌ఎస్‌ పార్టీలను ఎన్నికల్లో ఓడించాలని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు ఎంఎ గఫూర్‌ ప్రజలకు పిలుపునిచ్చారు. ఎన్నికల్లో కోట్లు ఖర్చుపెట్టి, అనంతరం వందల కోట్లు సంపాదిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.. బీజేపీ, బీఆర్‌ఎస్‌ అంతర్గతంగా కుమ్మక్కయి ప్రజలను మోసం చేస్తున్నా యన్నారు. కాంగ్రెస్‌ బూటకపు సెక్యులరిజంను అనుసరిస్తున్నని అన్నారు. రాజకీయాలు ప్రజాసేవ కోసం కాకుండా వ్యాపారమయంగా మార్చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
సోమవారం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గ కేంద్రంలో సీపీఐ(ఎం) ఇబ్రహీంపట్నం అభ్యర్థి పగడాల యాదయ్య తరపున ఇంటింటి ప్రచారం నిర్వహంచారు.
అనంతరం ఇబ్రహీంపట్నం చౌరస్తాలో జరిగిన కార్నర్‌ మీటింగ్‌లో మాట్లాడుతూ గ్యాస్‌, డీజీల్‌, పెట్రోల్‌ ధరలు పెంచిన మోడీని గద్దెదింపాల్సిన అవసరం ఉందన్నారు. ఆపార్టీ అభ్యర్థులను ఎన్నికల్లో తిరస్కరించాలని కోరారు. మోడీ హయాంలో పెట్టుబడిదారులకు రాయితీలు ఇచ్చి, పేద ప్రజలపై భారాలు మోపారని విమర్శించారు. ఎన్నికల్లో వచ్చే ప్రజల తీర్పులను గందరగోళపరిచి ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ప్రజల అభివృద్ధి, సంక్షేమం కాకుండా అధికారమే పరమావధిగా మారిందన్నారు. దేశాన్ని అమ్మకానికి పెట్టారని అన్నారు. చారు అమ్మిన మోడీ, ప్రభుత్వ రంగసంస్థలైన రైళ్లు, బొగ్గు, విమానాలు, ఒక్కటేమిటీ ఏదిబడితే అది అమ్ముకుంటూ వస్తున్నారన్నారు. ప్రాజెక్టుల పేర తెలంగాణ సీఎం కేసీఆర్‌ లక్షల కోట్లు కొల్లగొట్టారన్నారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌ కలయికతో రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారని విమర్శించారు. స్థానిక సమస్యలను పరిష్కరించకుండా నిర్లక్ష్యం చేశార న్నారు. ఈ కార్యక్రమానికి సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బి. సామేల్‌ అధ్యక్షత వహించగా పార్టీ రాష్ట్రకార్యదర్శివర్గ సభ్యులు జాన్‌వెస్లీ, రాష్ట్ర కమిటీ సభ్యులు పి.జయలక్ష్మి, జిల్లా కార్యదర్శివర్గ సభ్యురాలు కవిత మండల కార్యదర్శి జంగయ్య, పట్టణ కార్యదర్శి ఎల్లేశ్‌, నాయకులు వెంకటేశ్‌ తదితరులతోపాటు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Spread the love