చైనాను సందర్శించనున్న పుతిన్‌

చైనాను సందర్శించనున్న పుతిన్‌రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ఈ వారం చివర్లో చైనాకు వెళ్లి చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్‌ను కలవనున్నట్టు క్రెమ్లిన్‌ ప్రకటించింది. రష్యా అధినేతకు తన కొత్త అధ్యక్ష పదవీ కాలంలో ఇదే మొదటి విదేశీ పర్యటన. చైనా అధినేత ఆహ్వానం మేరకు పుతిన్‌ చైనా పర్యటన మే 16, 17 తేదీలలో షెడ్యూల్‌ చేయబడిందని మంగళవారంనాడు ఒక ప్రకటనలో క్రెమ్లిన్‌ పేర్కొంది. శిఖరాగ్ర సమావేశంలో, ఇరువురు నాయకులు ”సమగ్ర భాగస్వామ్యం, వ్యూహాత్మక అంశాలను సవివరంగా చర్చిస్తారు. ఈ చర్చలు రష్యన్‌-చైనీస్‌ సంబంధాల మరింత అభివద్ధికి కీలక దిశలను నిర్ణయిస్తాయి. పుతిన్‌, జిన్‌పింగ్‌ అత్యంత ముఖ్యమైన అంతర్జాతీయ, ప్రాంతీయ సమస్యల గురించి కూడా చర్చిస్తారని క్రెమ్లిన్‌ తెలిపింది. నాయకులు ఉమ్మడి ప్రకటన చేస్తారని, అనేక ద్వైపాక్షిక పత్రాలపై సంతకం చేస్తారని భావిస్తున్నారు. రష్యా నాయకుడు పుతిన్‌ చైనా ప్రీమియర్‌ లీ కియాంగ్‌తో కూడా చర్చలు జరుపుతాడు.
ఈ సమావేశంలో ద్వైపాక్షిక వాణిజ్యం, ఆర్థిక, మానవతా సహకారంపై ప్రధానంగా చర్చించనున్నారు. అంతే కాకుండా పుతిన్‌, జిన్‌ పింగ్‌ మాస్కో, బీజింగ్‌ మధ్య దౌత్య సంబంధాల స్థాపన యొక్క 75వ వార్షికోత్సవం, అలాగే రష్యన్‌-చైనీస్‌ ఇయర్స్‌ ఆఫ్‌ కల్చర్‌ ప్రారంభోత్సవానికి సంబంధించిన సభలకు హాజరవుతారు.
రష్యా అధ్యక్షుడు ఈశాన్య చైనాలోని హర్బిన్‌ నగరాన్ని కూడా సందర్శిస్తాడు. దీనిని 19వ శతాబ్దం చివరలో రష్యా నుంచి వచ్చి స్థిరపడినవారు స్థాపించారు. అక్కడ పుతిన్‌ మే 17 నుండి 21 వరకు జరిగే రష్యన్‌-చైనీస్‌ ఎక్స్‌ పో ప్రారంభ వేడుకలో పాల్గొంటాడు. పుతిన్‌ ఇంటర్‌ రీజినల్‌ కో ఆపరేషన్‌పై రష్యన్‌-చైనీస్‌ ఫోరమ్‌ ప్రారంభోత్సవాన్ని కూడా పర్యవేక్షిస్తాడు. ఆయన విద్యార్థులు, హర్బిన్‌ ఇన్స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ ప్రొఫెసర్‌లతో కూడా సమావేశమవుతాడు.రష్యా, చైనా దేశాలు అనేక దశాబ్దాలుగా సన్నిహిత సంబంధాలను కొనసాగిం చాయి. ”రెండు దేశాల మధ్య స్నేహానికి పరిమితులు లేవు, సహకారానికి ‘నిషిద్ధ’ ప్రాంతాలు లేవు అని ఫిబ్రవరి 2022 ప్రారంభంలో ప్రకటించారు. ఈ నేపథ్యంలో, బీజింగ్‌ కీవ్‌కు వ్యతిరేకంగా మాస్కో సైనిక చర్యను ఖండించలేదు. అందువల్ల రష్యాపై పాశ్చాత్య దేశాలు విధించిన ఆంక్షలలో చైనా చేరలేదు.అదే సమయంలో అన్ని దేశాల సార్వభౌమాధికారాన్ని గౌరవిస్తూ ప్రచ్ఛన్న యుద్ధ మనస్తత్వాన్ని విడిచిపెట్టి కాల్పుల విరమణకు పిలుపునిస్తూ ఉక్రెయిన్‌ వివాదాన్ని పరిష్కరించడానికి చైనా ఒక ప్రణాళికను సిద్ధం చేసింది. రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్‌ ఈ చొరవను ప్రశంసించాడు. ఇది ఈ రకమైన అత్యంత స్పష్టమైన, వివరణాత్మక ప్రణాళిక అని లవ్రోవ్‌ పేర్కొన్నాడు.

Spread the love