మంత్రి జూపల్లి కృష్ణారావు
మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాల/కళాశాల భవనం ప్రారంభం
పాల్గొన్న మంత్రి అజహరుద్దీన్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ
నవతెలంగాణ-ఆదిలాబాద్‌రూరల్
మైనార్టీ విద్యార్థులకు అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్యతోపాటు ఆధునిక వసతులు కల్పించి, వారు అన్ని రంగాల్లోనూ రాణించేలా చేయడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి, ఆదిలాబాద్ జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పారు. ఆదిలాబాద్ పట్టణంలోని బంగారుగూడలో రూ.20కోట్లతో నిర్మించిన మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాల/కళాశాల (బాలుర) భవనాన్ని మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అజహరుద్దీన్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీతో కలిసి శనివారం మంత్రి జూపల్లి ప్రారంభించారు. భవనంలోని తరగతి గదులు, వసతి గదులు, భోజనశాల, ఇతర మౌలిక సదుపాయాలను మంత్రులు పరిశీలించారు. మైనార్టీ విద్యార్థులు విద్యనే ఆయుధంగా మలుచుకుని ఉన్నత లక్ష్యాలను సాధించాలని, ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని సూచించారు. విద్యారంగంలో సమాన అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం పాటుపడుతోందని, రాష్ట్రంలోని మైనార్టీ విద్యాసంస్థలను మరింత బలోపేతం చేసే దిశగా చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. ఇలాంటి విద్యాసంస్థల ద్వారా గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు ఉన్నత విద్యలో రాణించే అవకాశాలు మరింత మెరుగుపడతాయన్నారు. అనంతరం కళాశాల ప్రాంగణంలో మంత్రులు మొక్కలు నాటి, పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా మొక్కలను నాటి సంరక్షించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీ జి.నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్, మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనూష, జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్, అదనపు కలెక్టర్ ఆర్‌ఎస్.చిత్రు, పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
మైనార్టీ విద్యార్థులకు నాణ్యమైన విద్య
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



