క్రీడల్లో రాణులు మన బిడ్డలు

Queens in sports are our babiesనేడు మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. ఒకప్పుడు కేవలం పురుషులకే పరిమితమైన అనేక రంగాల్లో దూసుకెళుతున్నారు. ఇటీవలె చంద్రయాన్‌ 3లో శక్తిమేర శ్రమించి ఆ విజయంలో భాగస్వాములయ్యారు. ఎదురవుతున్న అడ్డంకులు దాటుకుంటూ తమ సత్తా  చాటుకుంటున్నారు. అందివచ్చిన ప్రతి అవకాశాన్ని ఆసరా చేసుకుని తామేంటో నిరూపించుకుంటున్నారు. ప్రపంచ స్థాయిలోగుర్తింపు తెచ్చుకుంటున్నారు. అలాగే క్రీడల్లోనూ నిలదొక్కుకుంటున్నారు. ఈ రోజు జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా క్రీడా రంగంలో రాణిస్తున్న మన తెలంగాణ అమ్మాయిలగురించి తెలుసుకుందాం…
శ్రీజ ఆకుల…
మన రాష్ట్రానికి చెందిన ప్రఖ్యాత టేబుల్‌ టెన్నిస్‌ క్రీడా కారిణి. ఈమె 2022 ఏప్రిల్‌లో జరిగిన 83వ సీనియర్‌ జాతీ య, అంత ర్రాష్ట్రీయ టేబుల్‌ టెన్నిస్‌ పోటీల లో మహిళల సింగిల్స్‌, మహిళల డబుల్స్‌లో విజేతగా నిలిచింది. అదే ఏడాదిలో జరి గిన కామన్వెల్త్‌ క్రీడలలో ఆచంట శరత్‌ కమల్తో మిక్స్‌ డ్‌ డబుల్స్‌లో స్వర్ణాన్ని సాధించింది. హైదరాబాద్‌ క్రీడాకారులు టేబుల్‌ టెన్నిస్‌లో జాతీయ ఛాంపియన్‌గా అవతరించి ఆరు దశాబ్దాలు అవుతుంది. మీర్‌ ఖాసింఅలీ 1964లో మొదటి సారిగా జాతీయ టైటిల్‌ను గెలుచుకున్నాడు. అప్పటి నుండి అతను ఒక్కడే. 58 ఏండ్ల తర్వాత మరో హైదరాబాదీ జాతీయ ఛాంపియన్‌గా అవతరించింది. 23 ఏండ్ల ఆకుల శ్రీజ మౌమా దాస్‌ను ఓడించి మహిళల టైటిల్‌ను గెలుచుకుంది. తెలుగు మాట్లాడే రెండు రాష్ట్రాల నుంచి ఈ ఘనత సాధించిన ఏకైక మహిళగా చరిత్రలో ఆమె పేరు నిలిచిపోయింది. కోచ్‌ సోమనాథ్‌ ఘోష్‌తో కలిసి పదేండ్లపాటు కష్టపడి పనిచేసిన శ్రీజ తన విజయాన్ని తన కోచ్‌లకు అంకితం చేసింది.
జరీన్‌ నిఖత్‌…
1996 జూన్‌ 14న తెలంగాణలోని నిజామాబాద్‌లో ఎండి జమీల్‌ అహ్మద్‌, పర్వీన్‌ సుల్తానా దంపతులకు జన్మించింది. 13 ఏండ్ల వయసులో బాక్సింగ్‌ ప్రారంభించింది. ఈమెకు తండ్రి పూర్తి సహకారం అందించారు. మేరీకోమ్‌ను స్ఫూర్తి ప్రదాతగా భావించేది. హైదరాబాద్‌లోని ఏవీ డిగ్రీ కాలేజీలో డిగ్రీ చదువుతున్న సమయంలో జలంధర్‌లో జరిగిన అఖిల భారత అంతర విశ్వవిద్యాలయ పోటీల్లో ఆమె బెస్ట్‌ బాక్సర్‌ ఛాంపియన్‌ షిప్‌ సాధించింది. 2009లో ద్రోణాచార్య అవార్డు గ్రహీత ఐవీ రావు ఆధ్వర్యంలో వైజాగ్‌లోని స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియాలో శిక్షణ పొందేందుకు ఈమెకు అవకాశం లభించింది. 2010లో ఈరోడ్‌లో జరిగిన నేషనల్స్‌లో ‘గోల్డెన్‌ బెస్ట్‌ బాక్సర్‌గా’ గుర్తింపు తెచ్చుకుంది.
2010లో నేషనల్‌ సబ్‌ జూనియర్‌ మీట్‌లో జరీన్‌ తొలి బంగారు పతకాన్ని గెలుచుకుంది. 2011 టర్కీలో జరిగిన మహిళల జూనియర్‌, యూత్‌ వరల్డ్‌ బాక్సింగ్‌ ఛాంపియన్‌ షిప్‌లో, ఫ్లై వెయిట్‌ విభాగంలో తొలి అంతర్జాతీయ బంగారు పతకాన్ని సాధిం చింది. టర్కిష్‌ బాక్సర్‌ ఉల్కు డెమిర్‌తో పోరాడి మూడు రౌండ్ల తరువాత 27:16 తేడాతో ఆమెపై గెలిచింది. 2014లో సెర్బియా లోని నోవి సాడ్‌లో జరిగిన మూడవ నేషన్స్‌ కప్‌ ఇంటర్నేషనల్‌ బాక్సింగ్‌ టోర్నమెంట్‌లో బంగారు పతకం సాధించింది. 51 కిలోల విభాగంలో రష్యాకు చెందిన పాల్ట్సేవా ఎకాటెరినాను ఓడించింది. అలాగే 2015లో అస్సాంలో జరిగిన 16వ సీనియర్‌ ఉమెన్‌ నేషనల్‌ బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో బంగారు పతకం సాధిచింది. కొన్నేండ్ల విరామం తర్వాత 2019లో బ్యాంకాక్లో జరిగిన థాయిలాండ్‌ ఓపెన్‌ ఇంటర్నేషనల్‌ బాక్సింగ్‌ టోర్నమెంట్‌లో రజతం సాధించి మరో అంతర్జాతీయ పతకాన్ని తన ఖాతాలో వేసుకుంది.
గొంగడి త్రిష…
భద్రాచలం ప్రాంతానికి చెందిన ఈ 17 ఏళ్ల అమ్మాయి అండర్‌ -19 టీ20 వరల్డ్‌ కప్‌లో అద్భుత ప్రదర్శనతో అందరినీ ఆకట్టుకుంది. బ్యాటింగ్‌తో పాటు అవసరమైన సందర్భాల్లో బౌలింగ్‌లోనూ రాణించి టీమిండియా వరల్డ్‌కప్‌ విజయంలో కీలక పాత్ర పోషించింది. ముఖ్యంగా ఇంగ్లండ్‌తో జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో 24 పరుగులు చేసి టాప్‌స్కోరర్‌గా నిలిచింది. లక్ష్యం తేలికే అయినా ఓపెనర్లు త్వరగా ఔట్‌ కావడం, దీనికి తోడు విపరీతమైన ఒత్తిడి మధ్య పిచ్‌ను అర్థం చేసుకుని, పరిస్థితులకు తగినట్లుగా నిలకడగా ఆడి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ పోటీలో తుదికంటా క్రీజులో ఉండి జట్టును విజయతీరాలకు చేర్చింది. అంతకుముందు ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌గా నిలిచిన ఇంగ్లండ్‌ కెప్టెన్‌ను చురుకైన క్యాచ్‌తో ఔట్‌ చేసి మ్యాచ్‌ను మలుపుతిప్పింది. ఈ టోర్నీలో మొత్తం 7 మ్యాచ్‌ల్లో 116 పరుగులు చేసింది త్రిష. అందులో స్కాట్లాండ్‌పై మెరుపు అర్ధశతకమూ ఉంది. కాగా టీమిండియా ప్రపంచ ఛాంపియన్‌గా నిలవడంలో కీ రోల్‌ పోషించిన త్రిషపై అందరి నుండి ప్రశంసలు అందుకుంది. రోజూ తండ్రితో కలిసి జిమ్‌కు వెళ్లేది త్రిష. అక్కడే క్రికెట్‌ ప్రాక్టీస్‌ చేసేదట. గొంగడి రామిరెడ్డి స్వతహాగా హాకీ క్రీడాకారుడు. అయితే కొన్ని కారణాలతో దేశానికి ప్రాతినిథ్యం వహించాలన్న ఆయన కల సాకారం కాలేదు. అందుకే కూతురు రూపంలో తన కలను నెరవేర్చుకోవాలనుకున్నాడు. కూతురుకు మెరుగైన క్రికెట్‌ శిక్షణను అందించాలని కుటుంబ సభ్యులతో కలిసి సికింద్రాబాద్‌కు వచ్చి స్థిరపడ్డాడు. ఇందుకోసం భద్రాచలంలో తన పేరిట ఉన్న జిమ్‌ను సగం ధరకు అమ్మేశాడు. ఇక ట్రైనింగ్‌ ఖర్చులకోసం భూమిని కూడా అమ్ముకున్నాడు. తన కోసం హైదరాబాద్‌కు వచ్చిన తల్లిదండ్రుల త్యాగాన్ని త్రిష వృథా చేయకూడదనుకుంది. తన వంతు కష్టపడింది.
గూగులోత్‌ మమత…
నిజామాబాద్‌కు చెందిన సాఫ్ట్‌బాల్‌ క్రీడాకారిణి. కోచ్‌ డాక్టర్‌ కృష్ణ ప్రత్యేక శిక్షణలో 23 సెప్టెంబర్‌ నుండి 08 అక్టోబర్‌ 2023 వరకు చైనాలో జరగనున్న ఏషియన్‌ గేమ్స్‌ సాఫ్ట్‌బాల్‌ ఛాంపి యన్షిప్‌ పోటీ లకు ఎంపి కయ్యింది. 2016 నుండి సాఫ్ట్‌బాల్‌ జాతీయ క్రీడలో పాల్గొంటుంది. ఇప్పటి వరకు 20 సార్లు జాతీయ పోటీలలో పాల్గొని పలుమార్లు ఉత్తమ క్యాచర్‌గా ప్రత్యేక బహు మతిని అందుకొని జట్టు విజ యానికి కృషి చేసింది. నిజామాబాద్‌ జిల్లా సుద్ద పల్లిలోని సాంఘిక సంక్షేమ స్పోర్ట్స్‌ అకాడమీలో నీరజ రెడ్డి ఆధ్వర్యంలో సాఫ్ట్‌బాల్‌ క్రీడలో స్పెషల్‌ ట్రైనింగ్‌ తీసుకుంది. మమత గత 8 ఏండ్లుగా జాతీయస్థాయిలో క్రీడా కారిణిగా రాణిస్తోంది. వివిధ కేటగిరీల్లో ఇప్పటి వరకు మొత్తం 18 సార్లు జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని పతకాలను సొంతం చేసుకుంది. అదే విధంగా ఉత్తమ క్యాచర్‌గా అవార్డులను దక్కించుకుంది. 2022 గుజరాత్‌లో జరిగిన 36వ నేషనల్‌ గేమ్స్‌లో పాల్గొని చక్కని ప్రతిభ కనబరిచింది. చైనాలో జరిగిన జూనియర్‌ ఏషియన్‌ ఛాంపియన్‌షిప్‌ పోటీలలో భారత జట్టు తరఫున పాల్గొంది. ప్రస్తుతం భువనగిరి సాంఘిక సంక్షేమ ఆర్మీ ఫోర్స్డ్‌ ప్రిపరేటరీ డిగ్రీ కళాశాలలో బి.ఏ చదువుతుంది.
బుద్ధా అరుణా రెడ్డి...
ప్రముఖ జిమ్నాస్టర్‌ క్రీడాకారిణి. 2018 మెల్బోర్న్లో జరిగిన ప్రపంచ జిమ్నాస్టిక్స్‌ పోటీలో భారతదేశం తరపున మెదటి సారిగా కాంస్య పతకం గెలచు కొని చరిత్ర సృష్టించింది. ఈమె 1995, డిసెంబర్‌ 25న సుభధ్ర, నారాయణ రెడ్డి దంపతులకు హైద్రాబాద్లో జన్మించారు. తండ్రి వృత్తి రీత్యా అకౌంటెంట్‌. తల్లి గృహిణి. తన ఇంటర్‌ విద్యని 2013లో బషీర్‌బాగ్‌లోని సెయిట్‌ మేరీస్‌ జూనియర్‌ కాలేజీలో పూర్తి చేసింది. ఇదే కాలేజ్‌లో తన డిగ్రీ విద్యను కూడా పూర్తీ చేసింది. తండ్రి అరుణను ఐదేండ్ల వయసులోనే కరాటేలో చేర్పించాడు. అందులో ప్రతిభ చాటిన తను రెండేండ్ల లోపే బ్లాక్‌బెల్ట్‌ సాధించింది. అయితే అరుణ శరీరం జిమ్నాస్టిక్స్‌కు సరిపో తుందన్న సలహా మేరకు తర్వాత అందులో చేర్చాడు తండ్రి. నిజానికి మొదట్లో జిమ్నాస్టిక్స్‌ అంటే అంత ఆసక్తి లేకున్నా తండ్రి మాట ప్రకారం అందులోనే సాధన చేసింది. వయసు పెరిగే కొద్దీ ఆటపై ఆసక్తి పెరిగి పదేండ్ల వయసులోనే జాతీయ స్థాయి పోటీల్లో సత్తా కనబరిచి 12 ఏండ్ల వయసులోనే 2007 జాతీయ క్రీడల్లో వాల్ట్‌ విభాగంలో పతకం గెలిచుకొని తన సత్తాను నిరూపించుకుంది.2013, 2014, 2017లో ప్రపంచ జిమ్నాస్టిక్‌ పోటీలో పాల్గొంది. అయితే ఈ పోటీలో అరుణ ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. 2018లో నిర్వహించిన ప్రపంచ జిమ్నాస్టిక్‌ పోటీలో భారతదేశం తరపున పాల్గొని కాంస్య పతకం సాధించి ఈ పోటీలో గెలిచిన తొలి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించింది.
అగసర నందిని…
నందిని నాలుగేండ్ల క్రితమే అథ్లెటిక్స్‌లో శిక్షణ ప్రారంభించింది. ఏప్రిల్‌ 2018లో గచ్చిబౌలి స్టేడియంలో ప్రాక్టీస్‌ కోసం వెళ్ళినప్పుడు అసిస్టెంట్‌ కోచ్‌లలో ఒకరు ఆమె ప్రదర్శనకు ముగ్ధులయ్యారు. అతను ఆమెను ప్రధాన కోచ్‌ నాగపురి రమేష్‌ వద్దకు తీసుకెళ్లాడు. అతను వెంటనే ఆమెను తన అకాడమీలో చేరమని అడిగాడు. అథ్లెటిక్స్‌- హర్డిల్స్‌, లాంగ్‌ జంప్‌లలో ఆమె ప్రయాణం ప్రారంభమైంది. అప్పటి నుంచి ప్రతి ఏటా 10-12 పతకాలు సాధిస్తూనే ఉంది. అకాడమీలో చేరిన మూడు నెలల్లోనే తొలి జాతీయ పతకం సాధించింది నందిని. ఆమె ప్రపంచ ఛాంపియన్‌షిప్‌కు ఎంపికవ్వ డమే కాకుండా 75శాతం మార్కులతో ఇంటర్మీడియట్‌ పూర్తి చేసింది.
సాంఘిక సంక్షేమ పాఠశాలలో చేరక ముందు నందిని కేంద్రీయ విద్యాలయంలో చదువుకునేది. ఆమె తండ్రి టీ దుకాణం నడిపేవాడు. తల్లి గృహిణి. ఆ రోజుల్లో ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంది. సాంఘిక సంక్షేమ పాఠశాలకు మారిన తర్వాత ఆమెకు మంచి ప్రోత్సాహం లభించింది. ”నా తల్లిదండ్రులు పెద్దగా చదువుకోలేదు. అందుకే మొదట్లో నా ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ గురించి వారు అర్థం చేసుకోలేకపోయారు. తర్వాత దీని గురించి నా అన్నలు వారికి వివరించి, సంతోషించారు” అని నందిని చెప్పింది. జూనియర్‌ వరల్డ్‌ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌లో నందినికి ఇది రెండోసారి.
ఇషా సింగ్‌…
హైదరాబాద్‌కు చెందిన షూటర్‌. సచిన్‌ ర్యాలీ డ్రైవర్‌. షూటింగ్‌ కన్నా ముందు ఇషాకు గో కార్టింగ్‌, బ్యాడ్మింటన్‌, టెన్నిస్‌, స్కేటింగ్‌లో క్రీడల్లో కూడా ప్రవేశం ఉంది. గచ్చిబౌలీ స్టేడియంలోని షూటింగ్‌ రేంజ్‌ను చూసిన తర్వాత షూటింగ్‌ పట్ల ఎక్కడ లేని ఆసక్తిని ప్రదర్శించిన ఆమె దాన్నే కెరియర్‌గా ఎంచుకుంది. స్టేడియంకి వెళ్లాలంటే గంటల కొద్దీ ప్రయాణం చెయ్యాలి. మరో దారి లేకపోవడంతో రైల్లో వెళ్ళేది. అయితే ఇంటి వద్ద ప్రాక్టీస్‌ కోసం ఆమె తండ్రి పేపర్‌ టార్గెట్‌ రేంజ్‌ను సిద్ధం చేశాడు. ఆ తర్వాత ఆమె మహారాష్ట్రలోని పూణెలో ఒలింపిక్‌ మాజీ విజేత గగన్‌ నారంగ్‌ నిర్వహిస్తున్న గ్లోరీ అకాడమీకి శిక్షణ కోసం వెళ్ళింది. బిడ్డ వెన్నంటి ఉంటూ ప్రోత్సహిస్తున్న ఆమె తండ్రి మెటార్‌ స్పోర్ట్స్‌ దుకాణాన్ని నడుపుతున్నాడు. తండ్రి, కూతుళ్లు ఇద్దరూ పోటీల కోసం వెళ్లినప్పుడు క్రీడా సామాగ్రి దుకాణాన్ని తల్లి శ్రీలత చూసుకుంటుంది. దేశంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచే 18 ఏండ్లలోపు పిల్లలకు ఇచ్చే అత్యుత్తమ పుర స్కారం ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్‌ను కూడా ఇషా అందుకుంది. 2014లో షూటింగ్‌ కెరియర్‌ను ప్రారంభిం చిన ఇషా కేవలం ఏడాది కాలంలోనే తెలంగాణ రాష్ట్ర ఛాంపియన్‌గా నిలి చింది. అయితే జాతీయ స్థాయిలో మాత్రం రాణిం చేందుకు మరో మూడేండ్లు పట్టింది. కేరళలోని తిరువ నంతపురంలో జరిగిన 62వ జాతీయ షూటింగ్‌ ఛాంపియన్‌ షిప్‌లో 10మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ విభాగంలో కామన్‌ వెల్త్‌ గేమ్స్‌, యూత్‌ ఒలంపిక్స్‌లో స్వర్ణ పతక విజేత మను భకర్‌, షూటర్‌ హీనా సిద్ధు కన్నా మెరుగైన ప్రదర్శన చేసి స్వర్ణపతకం సాధించింది. అలా 13 ఏండ్ల వయసులోనే సీనియర్‌ విభాగంలో ఛాంపియన్‌గా నిలిచింది. అటు జూనియర్‌ ఇటు సీనియర్‌ విభాగంలో మొత్తం ఐదు పతకాలు పొందింది. ఆ ప్రదర్శనతో మరింత కష్టబడితే దేశానికి పతకాలు సాధించగలనన్న విశ్వాసం ఆమెలో ఏర్పడింది.

Spread the love