ఒడిశా ఘోర రైలు ప్రమాదం.. సీబీఐ దర్యాప్తునకు రైల్వే బోర్డు సిఫార్సు

నవతెలంగాణ – ఒడిశా
ఒడిశాలోని బాలేశ్వర్‌లో జరిగిన రైలు దుర్ఘటనకు సంబంధించి సీబీఐతో దర్యాప్తు జరిపించాలని రైల్వే బోర్డు నిర్ణయించింది. ఈ మేరకు రైల్వే బోర్డు సీబీఐతో దర్యాప్తునకు సిఫారసు చేసినట్లు ఆ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈ దుర్ఘటనపై సీబీఐ సమగ్రంగా దర్యాప్తు చేస్తుందని ఆయన తెలిపారు. ‘ఘటనాస్థలిలో సహాయ చర్యలు పూర్తయ్యాయి. పునరుద్ధరణ చర్యలు కొనసాగుతున్నాయి. రైల్వే ట్రాక్‌కు సంబంధించిన పనులు కూడా పూర్తి కాగా.. ఓవర్‌హెడ్‌ వైరింగ్‌ పనులు కొనసాగుతున్నాయి. బాధితులకు ఆస్పత్రుల్లో చికిత్స కొనసాగుతోంది’ అని మంత్రి వివరించారు. అంతకుముందు, ఘోర రైలు ప్రమాదానికి డ్రైవర్‌ తప్పిదమో.. వ్యవస్థలోని లోపాలో కారణం కాదని అశ్వనీ వైష్ణవ్‌ స్పష్టం చేశారు. ఉద్దేశపూర్వకంగా విధ్వంసం సృష్టించటం, ఎలక్ట్రానిక్స్‌ ఇంటర్ లాకింగ్‌ వ్యవస్థను టాంపరింగ్‌ చేసేందుకు అవకాశాలు ఉన్నాయని చెప్పారు. ఘోర రైలు ప్రమాదానికి కారణాలను, బాధ్యులను గుర్తించినట్లు రైల్వేమంత్రి తెలిపారు. ఎలక్ట్రానిక్‌ ఇంటర్‌లాకింగ్‌, పాయింట్‌ మెషిన్‌లో మార్పుల వల్లనే ఘోర ప్రమాదం జరిగినట్లు చెప్పారు. అయితే రైల్వే భద్రతా విభాగ కమిషనర్‌.. రైలు దుర్ఘటనకు దారితీసిన పరిస్థితులపై విచారణ జరుపుతున్నారని రైల్వే మంత్రి తెలిపారు. ప్రమాదానికి దారితీసిన తప్పిదంపై నిర్ధారణకు రావడమే కాకుండా, ప్రమాదానికి కారకులను కూడా గుర్తించారని వివరించారు. పూర్తి నివేదికను ఇంకా సమర్పించాల్సి ఉందన్నారు. ఎలక్ట్రానిక్‌ ఇంటర్‌ లాకింగ్‌లో మార్పు కారణంగానే ప్రమాదం జరిగిందన్న రైల్వే మంత్రి.. ఎవరు చేశారు.. ఎందుకు చేశారు అన్నది.. దర్యాప్తులో బయటపడుతుందన్నారు.ఎలక్ట్రానిక్‌ ఇంటర్‌లాకింగ్‌ వ్యవస్థ పూర్తిగా లోపరహితమైనదని, భద్రతతో కూడినదని దిల్లీలో రైల్వేశాఖ ఉన్నతాధికారులు తెలిపారు. అయితే రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ చెప్పినట్లు వెలుపలి వ్యక్తుల ప్రమేయానికి గల అవకాశాలను తోసిపుచ్చలేమన్నారు. ఇది పూర్తిగా ఫెయిల్‌ సేఫ్‌ వ్యవస్థ అని, ఒకవేళ ఫెయిల్‌ అయినా సిగ్నల్స్‌ అన్నీ రెడ్‌గా మారి రైళ్ల రాకపోకలు పూర్తిగా నిలిచిపోతాయని అధికారులు చెబుతున్నారు.

Spread the love