అవినీతిపరులకు అందలం రైల్వే శాఖ నిర్వాకం

Railway department management is a beauty for the corrupt– ఆరోపణలు రుజువైనా చర్యలు లేవు
– పైగా పదవులలో కొనసాగింపు
– తాజాగా సీఎండీ పదవి ఇంటర్వ్యూకు పిలుపు
న్యూఢిల్లీ : రైల్వే మంత్రిత్వ శాఖ తన అనుబంధ విభాగమైన ఇండియన్‌ రైల్వే ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ (ఐఆర్‌ఎఫ్‌సీ) ఛైర్మన్‌-మేనేజింగ్‌ డైరెక్టర్‌ (సీఎండీ) పోస్టుకు సోమవారం ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది. ఈ పోస్టు గత సంవత్సర కాలంగా ఖాళీగా ఉంటోంది. గతంలో ఈ పదవిని నిర్వహించిన అమితాబ్‌ బెనర్జీని గత సంవత్సరం అక్టోబర్‌లో విధుల నుండి తొలగించారు. కోట్లాది రూపాయల అవినీతి కేసులో బెనర్జీపై సీబీఐ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినప్పటికీ ఆయనను పదవిలో కొనసాగించారంటూ ‘ది వైర్‌’ ప్రత్యేక కథనాన్ని ప్రచురించడంతో ఆయనకు ఉద్వాసన పలికారు. ఐఆర్‌ఎఫ్‌సీ సీఎండీ పోస్టుకు జరిగే ఇంటర్వ్యూకు ఎంపిక చేసిన అభ్యర్థుల జాబితాలో తాత్కాలిక సీఎండీగా వ్యవహరిస్తున్న షెల్లీ వర్మ కూడా ఉన్నారని తెలుస్తోంది.
అయితే షెల్లీ వర్మ ఇప్పటికే వివాదాస్పద వ్యక్తిగా పేరు తెచ్చుకున్నారు. ఇంటర్వ్యూకు ఎంపిక చేసిన వారిలో ఆమె పేరు కూడా ఉండడంతో అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. బెనర్జీ సీఎండీగా ఉన్నప్పుడు ఆమె డైరెక్టర్‌ (ఫైనాన్స్‌)గా వ్యవహరించారు. ఆ సమయంలో ఆమె పలు సందర్భాలలో లక్షలాది రూపాయల విలువ కలిగిన బంగారం, వెండి పతకాల కొనుగోలుకు ఆర్థికపరమైన అనుమతులు మంజూరు చేశారు. ఈ పతకాలను ‘ప్రముఖుల’కు బహుమతిగా అందించేందుకు కొనుగోలు చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలు ప్రముఖులకు ఖరీదైన బహుమతులు అందించడాన్ని ప్రోత్సహించరాదని కేంద్ర విజిలెన్స్‌ కమిషన్‌ నిబంధనలు స్పష్టం చేస్తున్నప్పటికీ షెల్లీ వాటిని బేఖాతరు చేశారు. అదీకాక దీపావళి, నూతన సంవత్సరం, క్రిస్టమస్‌ వంటి సందర్భాలు వచ్చినప్పుడు ప్రభుత్వ అధికారులు బహుమతులను స్వీకరించకూడదు. వాణిజ్య, వ్యాపార ప్రయోజనాల కోసం మాత్రమే బహుమతులు ఇవ్వవచ్చునని ప్రభుత్వ నిబంధనలు చెబుతున్నాయి.
వినోద అలవెన్సుల పేరిట నిధుల దుర్వినియోగం
బెనర్జీ సహా అప్పటి ఐఆర్‌ఎఫ్‌సీ ఉద్యోగులపై 30 ఆరోపణలకు సంబంధించి రైల్వే విజిలెన్స్‌ శాఖ కేసు నమోదు చేసింది. ‘వినోద అలవెన్సుల’ పేరిట 27 వేల డాలర్ల వ్యయంతో ఖరీదైన గడియారాలు, మొబైల్‌ ఫోన్లు, లాప్‌టాప్‌లు, బంగారు నాణేలు, విలువైన శాలువాలు వంటి వస్తువులు కొనుగోలు చేసి నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని మోపిన కేసు కూడా వీటిలో ఉంది. 2020-21 మధ్యకాలంలో డజన్ల కొద్దీ పతకాలను కొనుగోలు చేయడానికి షెల్లీ వర్మ అనుమతులు ఇచ్చారని విచారణలో తేలింది. అయితే బంగారం, వెండి పతకాలను అందుకున్న ప్రముఖుల జాబితాను సమర్పించడంలో బెనర్జీ సహా అధికారులు విఫలమయ్యారు. తాము రైల్వే బోర్డుకు చెందిన ఇద్దరు స్వతంత్ర సభ్యులకు బంగారు పతకాలు ఇచ్చామని ఐఆర్‌ఎఫ్‌సీ అధికారులు చెబుతున్నప్పటికీ ఆ సభ్యులు దీనిని తోసిపుచ్చారు. దీంతో బెనర్జీ సహా పలువురు అధికారులపై అనుమానాలు తలెత్తుతున్నాయి.

విచారణలో తేలినా..
ఈ వ్యవహారంపై విచారణ జరపాల్సిందిగా ఫిబ్రవరిలో సీబీఐ డైరెక్టర్‌కు రైల్వే విజిలెన్స్‌ డైరెక్టరేట్‌ లేఖ రాసింది. దీనిపై సీబీఐ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. ఈ ఎఫ్‌ఐఆర్‌లో షెల్లీ వర్మ పేరు కూడా ఉంది. బెనర్జీపై నమోదు చేసిన కేసులో ఆయన తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం పలు సందర్భాలలో అవినీతికి పాల్పడ్డారని, ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేశారని ఆరోపించారు. బెనర్జీపై విచారణ జరుగుతున్నప్పటికీ ‘ది వైర్‌’లో వార్త వచ్చేంతవరకూ రైల్వే మంత్రిత్వ శాఖ, రైల్వే బోర్డు ఆయన్ని పదవిలో కొనసాగించాయి. అప్పటి వరకూ ఆయన ఆర్థికపరమైన నిర్ణయాలు తీసుకుంటూనే ఉన్నారు. ఆర్‌బీఐ నుండి విదేశీ మారక ద్రవ్యాన్ని పొందే హక్కును కూడా వినియోగించుకున్నారు. ఇక బహుమతుల కొనుగోలుకు సంబంధించి ఆర్థికపరమైన అనుమతులు మంజూరు చేయడం ద్వారా వర్మ నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని రైల్వే విజిలెన్స్‌ శాఖ నిర్ధారించినప్పటికీ తాత్కాలిక సీఎండీగా కొనసాగేందుకు ఆమెను అనుమతించడం గమనార్హం.

Spread the love