ప్రియమైన వేణు గీతికకు…
నాన్న వర్షాలు పడుతున్నాయి. జాగ్రత్త తల్లి. వర్షంలో బైటకి ఎక్కడకు వెళ్లకు, అక్కడ అన్ని చోట్లా నీళ్లు నిలిచి రోడ్డు కూడా మునిగిపోయి ఉంటుంది. నేను కిందటి సారి రాసిన ఉత్తరం చదివినట్లు లేవు. ఎందుకంటే నీ దగ్గర నుంచి ఎటువంటి చర్చ జరగలేదు. సరే సమయం ఉన్నప్పుడు చదువు. ఈ ఉత్తరం కూడా దాదాపు అలాంటి కోవలోకే వస్తుంది. కాకపోతే పరిస్థితుల్లో మార్పు వస్తే జీవితం ఎలా ఉంటుందో చెప్తాను.
నాన్న.. నేను చాలా మంది మహిళలను చూస్తుంటాను. కొందరు విద్యాధికులు, కొందరు ఎక్కువగా చదువుకోని వారు, మరి కొందరు అసలు చదువులేని వారు. వీరిలో విద్యాధికులు కొందరు ఉద్యోగాలకు వెళ్తుంటే, మరి కొందరు వ్యాపార రంగంలో రాణిస్తున్నారు. ముఖ్యంగా నేను చెప్పే విషయం ఏమిటంటే చాలా మంది టైం దొరికితే చాలు పార్టీలని, షాపింగ్లని, స్నేహితులని కాలక్షేపం చేస్తుంటారు. ఒక ప్రణాళిక లేకుండా ఉండే ఇటువంటి వారికి జీవితంలో అనుకోని సంఘటనలు ఎదురైనప్పుడు అంతా అగమ్యగోచరంగా ఉంటుంది.
మరి కొందరు ఉద్యోగాలు చేస్తారు.. కానీ ఏవి ఎక్కడున్నాయో, ఏ బస్సు ఎటు వెళ్తుందో, దేని ధర ఎంతో ఇటువంటి విషయాలపై బొత్తిగా అవగాహన ఉండదు. ఏది అడిగినా మా వారు తెస్తారు, ఇంట్లో వాళ్లు చూసుకుంటారు అనే సమాధానం వస్తుంది. బయటి ప్రపంచం గురించి ఏమీ పట్టించుకోరు. ఇక అసలు చదువు లేని వాళ్ళు కొంచం నయం. ఎందుకంటే వారు బతుకు భయం వల్ల ఏ పనైనా కష్టపడి చేయటానికి వెనుకాడరు. కష్ట పడే వాళ్ళు జీవితంలో ఎక్కడైనా రాణిస్తారు. ఎలాగైనా బతకగలము అనే ధైర్యంతో ఉంటారు.
పై రెండు కోవల్లో ఉన్నవాళ్లు మాత్రం అనేక అవస్థలు పడుతుంటారు. చివరగా నేను చెప్పేది ఏమిటంటే, ధనవంతులు, ప్రభుత్వ ఉద్యోగులు, వ్యాపార దిగ్గజాలకు ఎలాంటి లోటూ ఉండదు. ఏదైనా సమస్య వచ్చినా నిలదొక్కుకోవడానికి సమయం ఉంటుంది. అదే మిగతావారికి అనేక సమస్యలు. ముఖ్యంగా సంపాదించేవారు కనుమరుగు అయిపోయినా, దుర్ఘటనల వల్ల ఇంటికే పరిమితమైన వారి జీవితం అగ్ని గుండమే. అందుకే అనవసరంగా సమయం వృధా చేసుకునే బదులు, జీవితంలో ఆర్ధిక స్వాలంబన ఎంత ముఖ్యమో గ్రహించి అందుకు తగిన విధంగా తమని తాము మలుచుకోవాలి. పెద్దలు కీడెంచి మేలెంచమని అన్నారు. ప్రయివేటు ఉద్యోగుల కుటుంబాలకు ఎటువంటి ఆర్ధిక భరోసా ఉండదు. ముందు చూపుతో ఏదైనా వృత్తి విద్యకు సంబంధించినవి నేర్చుకోవాలి. లేదా తాము చదువుకున్న చదువుకు తగిన ఉద్యోగాన్ని చూసుకుని, సమాజంలో, చుట్టుపక్కల జరుగుతున్న విషయాల పట్ల అవగాహన పెంచుకుని జీవితంలో ముందుకు సాగాలి. అప్పుడు జీవితంలో ఒడి దుడుకులు ఎదురైనా అధైర్య పడాల్సిన అవసరం ఉండదు.
నీకు కూడా ఎప్పుడూ చెప్తూ ఉంటాను.. చుట్టుపక్కల పరిసరాలు గమనిస్తూ ఉండు, ఎవరి మీదా ఆధారపడకు, జీవితంలో ఎదగటానికి కష్టపడు అని. పైన చెప్పినటువంటి వారు ముందు ముందు నీకు తారస పడవచ్చు. ఒక శ్రేయోభిలాషిగా వారికి తగిన సలహాలు, సూచనలు ఇచ్చి వారికి మార్గదర్శివి అవ్వాలని నా ఆకాంక్ష..
ప్రేమతో అమ్మ
– పాలపర్తి సంధ్యారాణి