హస్తం గూటికి పోచారం

Raise your hand– ఇంటికెళ్లి ఆహ్వానించిన సీఎం
– పనిచేసే నాయకుడిని ప్రోత్సహించాలి : మాజీ స్పీకర్‌
– జానారెడ్డితో ఉప్పల్‌ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి భేటీ
– క్యూలైన్లో మరికొంత మంది ఎమ్మెల్యేలు : దానం నాగేందర్‌
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
అసెంబ్లీ మాజీ స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి అధికార కాంగ్రెస్‌లో చేరారు. తద్వారా ఆయన బీఆర్‌ఎస్‌కు పెద్ద షాక్‌ ఇచ్చారు. శుక్రవారం ఉదయం సీఎం రేవంత్‌, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి హైదరాబాద్‌లోని పోచారం నివాసానికి వెళ్లారు.ఈ సందర్భంగా రేవంత్‌కు ఆయనకు శాలువా కప్పి స్వాగతం పలికారు. కొద్దిసేపు ఆయనతో చర్చించిన రేవంత్‌… పోచారానికి, ఆయన కుమారుడు భాస్కర్‌రెడ్డికి పార్టీ కండువా కప్పి కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు. మరోవైపు పార్టీ సీనియర్‌ నేత కె. జానారెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని ఆయనకు శుభాకాంక్షలు తెలిపేందుకు బీఆర్‌ఎస్‌ ఉప్పల్‌ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి వెళ్లారు. బొకే ఇచ్చి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. దీంతో ఆయన కూడా హస్తం గూటికి చేరుతారనే ప్రచారం జరుగుతున్నది.
రైతు సంక్షేమం కోసం శ్రమించారు :సీఎం రేవంత్‌
రైతుల సంక్షేమం కోసం పోచారం శ్రీనివాస్‌రెడ్డి అహర్నిశలు శ్రమించారని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. తమ ప్రభుత్వం రైతు సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ఈ విషయంలో పోచారం సూచనలు స్వీకరిస్తామని తెలిపారు. తెలంగాణ పునర్నిర్మాణంలో భాగంగా పోచారం శ్రీనివాస్‌ రెడ్డిని కలిశాననీ, పెద్దలుగా అండగా నిలబడాలని కోరామన్నారు. భవిష్యత్తులో పోచారం శ్రీనివాస్‌రెడ్డికి పార్టీలో, ప్రభుత్వంలో సముచిత గౌరమిస్తామన్నారు. నిజామాబాద్‌ జిల్లాలో అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులను పూర్తిచేసేందుకు ఆయన సహకారం తీసుకుంటామని చెప్పారు. ‘ఇది రైతు రాజ్యం… రైతు సంక్షేమ రాజ్యం. రైతు సంక్షేమం కోసం అవసరమైన అందరినీ కలుపుకుని పోతాం’ అన్నారు.
పనిమంతుడిని ప్రోత్సహించాలి: పోచారం
రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి బాధ్యతలు చేపట్టాక ఆయన పని విధానాన్ని గమనిస్తున్నట్టు పోచారం శ్రీనివాసరెడ్డి చెప్పారు. అందుకే పనిమంతుడిని ప్రోత్సహించేందుకు సీఎం రేవంత్‌ను మనస్ఫూర్తిగా ఇంటికి ఆహ్వానించానన్నారు. రైతు సంక్షేమం, సాగునీటి ప్రాజెక్టుల ప్రగతికి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఆమోదయోగ్యంగా ఉన్నాయన్నారు. తాను రైతుబిడ్డననీ, అందుకే ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలకు అండగా ఉండాలనే రేవంత్‌ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరినట్టు తెలిపారు. ‘గతంలో వ్యవసాయ మంత్రిగా పనిచేశాను. అందరి సహకారంతో రాష్ట్ర భవిష్యత్‌ కోసం పనిచేస్తాం. నా రాజకీయ జీవితం ప్రారంభమైందే కాంగ్రెస్‌తో. ఆ తర్వాత టీడీపీ, బీఆర్‌ఎస్‌లో పనిచేశాను. రేవంత్‌ చేపడుతున్న కార్యక్రమాలకు అండగా ఉండాలనే కాంగ్రెస్‌లో చేరాను. 20 ఏండ్లపాటు రాష్ట్రానికి నాయకత్వం వహించే ఓపిక ఆయనకు ఉంది. మాకు వయసైపోయింది. పనిచేసే నాయకుడిని ప్రోత్సహించాలి’ అని పోచారం వ్యాఖ్యానించారు.
గ్రేటర్‌లో బీఆర్‌ఎస్‌ ఖాళీ : దానం
గ్రేటర్‌ హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్‌ ఖాళీ కాబోతున్నదని ఖైరాతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ చెప్పారు. త్వరలోనే 20 మంది బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరబోతున్నారని తెలిపారు. కేసీఆర్‌ విధానాలే బీఆర్‌ఎస్‌ను ముంచాయని తెలిపారు. పోచారం శ్రీనివాస్‌ రెడ్డే కాదనీ, చాలామంది బీఆర్‌ఎస్‌ నేతలు ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. కాలే యాదయ్య, అరికపూడి గాంధీ, గూడెం మహిపాల్‌రెడ్డి, ముఠా గోపాల్‌, దేవిరెడ్డి సుధీర్‌ రెడ్డి, కుత్బుల్లాపూర్‌ ఎమ్మెల్యే వివేకానంద్‌, కొత్త ప్రభాకర్‌ రెడ్డి, ప్రకాష్‌ గౌడ్‌ తదితరులు కూడా తమ పార్టీలో చేరతారని తెలిపారు. మాజీ మంత్రి మల్లారెడ్డి కూడా కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. సీఎం రేవంత్‌ రెడ్డి, సునీల్‌ కనుగోలు ఇప్పటికే చేరికలపై రెండు మూడు రోజులుగా చర్చించారని వివరించారు. పల్లా రాజేశ్వర్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌ రెడ్డి, హరీశ్‌రావు, కేటీఆర్‌ తప్ప మిగతా బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలంతా కాంగ్రెస్‌లోకి క్యూ లైన్‌ కడతారని తెలిపారు. హరీశ్‌రావుతో కొంత మంది బీజేపీలోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. ఎన్నికల తర్వాత బీఆర్‌ఎస్‌ అయోమయంలో పడిందనీ, ఆ ప్రమాదం నుంచి బయటపడే పనిలో ఎమ్మెల్యేలు ఉన్నారని చెప్పారు.
పోచారం ఇంటి వద్ద ఉద్రికత్త
సీఎం రేవంత్‌రెడ్డి శుక్రవారం ఉదయం పోచారం నివాసానికి వెళ్లగానే ఆయన ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. పోచారం కాంగ్రెస్‌లోకి పోవద్దు…అధికార పార్టీ ప్రలోభాలకు పాల్పడితే సహించబోమంటూ మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్‌ నాయకత్వంలో బీఆర్‌ఎస్‌కు చెందిన నాయకులు, కార్యకర్తలు అందోళనకు దిగారు. ఈ క్రమంలో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ నేతల మధ్య తోపులాట, ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో సుమన్‌తోపాటు బీఆర్‌ఎస్‌ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు.

Spread the love