నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
టీఎస్‌ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ (ఈయూ) ప్రధాన కార్యదర్శి కే రాజిరెడ్డిని ఆ పదవి నుంచి తొలగించారు. ఆయన స్థానంలో యూనియన్ డిప్యూటీ జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్న ఈదురు వెంకన్నను ప్రధాన కార్యదర్శిగా నియమించారు. ఈ మేరకు యూనియన్ అత్యవసర రాష్ట్ర కార్యావర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్టు అధ్యక్షులు ఎస్ బాబు తెలిపారు. శనివారం యూనియన్ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి ఏఐటీయూసీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బాలరాజు, యూసుఫ్, వీఎస్ బోస్, నర్సింహం తదితరులు మాట్లాడారు. జనరల్ సెక్రటరీగా ఉన్న కే రాజిరెడ్డి యూనియన్ నియమ నిబంధనలు పాటించకుండా, ఏ ఫోరంలోనూ చర్చించకుండా ఎల్‌బీ నగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యేగా నామినేషన్ వేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. ఏఐటీయూసీ ప్రాథమిక సభ్యత్వానికి రాజిరెడ్డి స్వచ్ఛందంగా రాజీనామా చేశారనీ, దాన్ని ఆమోదించామని తెలిపారు. యూనియన్ నూతన జనరల్ సెక్రటరీగా ప్రస్తుత డిప్యూటీ జనరల్ సెక్రటరీ ఈదురు వెంకన్నను ఏకగ్రీవంగా ఎన్నుకున్నామన్నారు.
చెల్లదు – రాజిరెడ్డి
తనను ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి తప్పించడం చెల్లదని రాజిరెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. శనివారం జరిగిన ఎలాంటి చట్ట బద్దత లేదన్నారు. 90 మంది రాష్ట కార్యవర్గ సభ్యులు ఉంటే కేవలం 12 మంది మాత్రమే హాజరయ్యారని అభ్యంతరం వ్యక్తం చేశారు. యూనియన్ అధ్యక్షులు ఎస్ బాబు, ఉపాధ్యక్షులు వెంకన్న గౌడ్, డిప్యూటీ జనరల్ సెక్రటరీ ఈదురు వెంకన్నను తానే యూనియన్ నుంచి బహిష్కరిస్తున్నానని చెప్పుకొచ్చారు.