‘రమా’రాజ్యం..!

– నెం.1 మహిళా పారిశ్రామిక వేత్త ఆక్రమణలు
– అనుమతులు లేకుండా ఇసుక, మట్టి తరలింపు
– ప్రశ్నించిన వారిపై దాడులు…అక్రమ కేసులు మంత్రితో లేని చుట్టరికాన్ని చూపుతూ ఆగడాలు
– విషయం తెలిసి మంత్రి తుమ్మల సీరియస్‌..
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి / కొణిజర్ల:
తెలంగాణలోనే నెంబర్‌ 1 మహిళా పారిశ్రామిక వేత్తగా తనకు తానుగా చెప్పుకునే రమాజ్యోతి (బిలీఫ్‌ హస్పిటల్‌ ) వ్యాపార సామ్రాజ్యంతో పాటు దందాల పరంపరను విస్తరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కొణిజర్ల మండలం లాలాపురంలో తన సార్‌ (ఎస్‌ఏఆర్‌) పారాబాయిల్డ్‌ రైస్‌మిల్లుకు అనుసంధానంగా నిర్మించిన గోదాంలను రెండో ఫ్యాక్టరీగా అభివృద్ధి చేస్తున్నారు. దీనిలో భాగంగా అనేక అక్రమాలు, ఆక్రమణలకు పాల్పడుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి తన ఇష్టారాజ్యమన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. అక్రమంగా మట్టి, ఇసుక తవ్వకాలు చేపడుతున్నారు. ‘నా పేరే శివగామి…నామాటే శాసనం’ అనే రీతిలో ఆమె వ్యవహార శైలి ఉందని స్థానికులు చెబుతున్నారే తప్ప…కనీసం తనపై ఫిర్యాదు చేసేందుకు కూడా జంకుతున్నారు. ఇదేమంటే మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు చెందిన స్థలమని బెదిరిస్తున్నారు. ఆయనతో లేని చుట్టరికాన్ని తనకు ఆపాదించుకుంటున్నారు.
అడ్డుచెబితే ‘దండ’న యాత్రే…
తన చర్యలకు, మాటకు అడ్డుచెబితే స్వయంగా రమాజ్యోతే దండనకు దిగుతారనే ఆరోపణలు ఉన్నాయి. తన దగ్గర పనిచేసే కూలీలు సైతం తను ఇచ్చిందే తీసుకోవాలి..ఇచ్చినప్పుడే పుచ్చుకోవాలి తప్ప కూలీ డబ్బుల కోసం ప్రశ్నిస్తే స్వయంగా దండనకు పూనుకున్న ఉదంతాలు ఉన్నాయి. తప్పుడు కేసులు పెట్టి వేధించిన సందర్భాలూ అనేకం. మండలంలోని గుబ్బగుర్తిలో తన ఆక్వాపామ్‌లో పనిచేసే ఓ కూలీ ఇలాగే డబ్బుల కోసం అడిగాడు. ఇవ్వకపోవడంతో అటుగా వచ్చిన రమాజ్యోతికి చెందిన ట్రాక్టర్‌ను అడ్డుకున్నాడు. ఈ విషయం తెలియడంతో కొణిజర్ల పోలీస్‌స్టేషన్‌లో అతనిపై కేసు పెట్టింది కాక, తన ఫ్యాక్టరీలో అతన్ని పడవేసి స్వయంగా బడితెలతో చిత్రహింసలకు గురిచేశారు. ఆ తర్వాత అతని కూలి డబ్బులు ఇచ్చి…కేసు విత్‌డ్రా చేసుకున్నారని సమాచారం.
సు’జలా’నికీ ముప్పు…
ఇదంతా ఒకెత్తయితే తన పారాబాయిల్డ్‌ రైస్‌మిల్లుకు సమీపంలోని పగిడేరుకు తన ఫ్యాక్టరీ వ్యర్థాలను తరలిస్తూ ప్రజల ప్రాణాలతో చెలాగాటమాడుతున్నారు. పగిడేరు నుంచి మిల్లు వ్యర్థపు నీరు వైరా రిజర్వాయర్‌కు చేరుతున్నాయి. జలాశయం ఆధారంగా వైరా, మధిర నియోజకవర్గాల్లో వందలాది గ్రామాల ప్రజల కోసం నిర్వహిస్తున్న బోడేపూడి సుజల స్రవంతి తాగునీటి పథకానికి సైతం ముప్పు పరిణమిస్తోంది. ప్రస్తుతం పగిడేరు అడుగంటింది. ప్రవాహం లేదు కాబట్టి ప్రస్తుతానికి ఇబ్బంది లేదు. కానీ ఈ తంతు ఇలాగే కొనసాగితే వర్షాలకు పగిడేరు నుంచి వ్యర్థాల ప్రవాహం రిజర్వాయర్‌కు చేరుతుంది. కలుషిత నీటితో ప్రజలు అనారోగ్యం బారిన పడే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఆక్రమణలు..అక్రమాల పర్వం…
నెం.1 మహిళా పారిశ్రామికవేత్త అక్రమాలు, ఆక్రమణల పర్వం కొనసాగుతోంది. లాలాపురం శివారు వెంకటాపురం రెవెన్యూలో 12, 13, 14, 15 సర్వే నంబర్లలో రెండో పారాబాయిల్డ్‌ రైస్‌మిల్‌, గోదాంల కోసం ఎకరానికి రూ.40 లక్షలు వెచ్చించి 10 ఎకరాలు కొనుగోలు చేశారు. ఎలాంటి కన్వర్షన్‌ అనుమతులు తీసుకోకుండానే గోదాంను నిర్మించారు. సుమారు ఐదు ఎకరాల విస్తీర్ణంలో ఉన్న మొదటి పారాబాయిల్డ్‌ రైస్‌మిల్లు స్థలానికి గాను కేవలం 30 కుంటలు మాత్రమే కన్వర్షన్‌ చేయించి…మిగిలిన మొత్తాన్ని అక్రమ పద్ధతుల్లోనే కొనసాగిస్తున్నారు. ఇప్పుడు రెండో ఫ్యాక్టరీ నిర్మాణం కోసం పగిడేరు నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుక, ఏరు సరిహద్దు నుంచి మట్టి తరలిస్తున్నారు. ఏరుకు పావు కి.మీ దూరంలో ఉన్న ఈ రైస్‌మిల్‌ కోసం అక్రమంగా పొక్లెయిన్‌లు ఉపయోగించి దారి సైతం నిర్మించారు. టిప్పర్ల సహాయంతో ఇసుక, మట్టిని తన ఫ్యాక్టరీ నిర్మాణం కోసం తరలిస్తున్నారు. పనిలో పనిగా రైతుల పొలాలకు వెళ్లే తన గోదాం పక్కనున్న దారిని సైతం ఆక్రమించేశారు. నెమ్మదిగా రైతులు ఆ మార్గంలో వెళ్లకుండా చేసి…వారిని ఇబ్బందులు పెట్టి ప్రస్తుతం అక్కడ ఎకరం రూ.కోటి పలుకుతున్న భూమిని కారుచౌకగా కొట్టివేసేందుకు వ్యూహం పన్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. రెవెన్యూ, మైనింగ్‌శాఖ అధికారులు సైతం తాము ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని తెలిపారు. జిల్లాలో ఎక్కడా మట్టి, ఇసుక తవ్వకాలు చేపట్టడానికి వీల్లేదని ఇటీవల కలెక్టర్‌ సైతం ఉత్తర్వులు ఇచ్చారు. అయినా అవేవీ రమాజ్యోతి విషయంలో అమలుకాకపోవడం గమనార్హం.
మంత్రి పేరు చెప్పి…
కొణిజర్ల మండలం లక్ష్మీపురం గ్రామ రైతులు జట్ల ఆనందరావు, సత్యం, శ్రీను, కృష్ణారావు, రంగారావు, ప్రసాద్‌తో పాటు సుమారు 50 మంది పొలానికి వెళ్లే దారిని రమాజ్యోతి ఆక్రమించారు. ఎప్పటి నుంచో ఉన్నదారిని తన 30 ఎకరాల పొలంలో కలుపుకుని ఫెన్సింగ్‌ వేయించింది. అడ్డుచెప్పిన రైతులను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పొలం అంటూ బెదిరిస్తోంది. కోపోద్రిక్తులైన రైతులు గత్యంతరం లేక ఫెన్సింగ్‌ రాళ్లను తొలగించారు. రమాజ్యోతి ఆరాచకాలను సోషల్‌ మీడియాలో వైరల్‌ చేస్తున్నారు. దీనిపై ‘నవతెలంగాణ’లో శుక్రవారం కథనం ప్రచురితమవడంతో మంత్రి రమాజ్యోతికి ఫోన్‌ చేసి సీరియస్‌ అయ్యారు.

మట్టి, ఇసుక తరలింపుకు అనుమతిలేదు…
తబ్జల్‌హుస్సేన్‌, తహశీల్దార్‌, కొణిజర్ల
పగిడేరు నుంచి మట్టి, ఇసుక తరలించేందుకు ఎవరికీ ఎలాంటి అనుమతి ఇవ్వలేదు. దీనిపై రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ను పంపించి పరిశీలిస్తాం. తగు చర్యలు తీసుకుంటాం. ఆక్రమణలు, కన్వర్షన్‌ అనుమతులకు విరుద్ధంగా నిర్మాణాలు, తదితర వ్యవహారాలన్నింటిపై విచారణ చేస్తాం.

Spread the love