కొత్త రాష్ట్రం కాబట్టి.. నవ్వేవాళ్ళ ముందు జారిపడొద్దు
2028లో కేసీఆర్ మళ్ళీ సీఎం
ప్రజల సంక్షేమం, కార్యకర్తల బాగోగులు..
చూసుకునే బాధ్యత నాది : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
నవతెలంగాణ-చేవెళ్ల
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ రంగం పూర్తిగా దెబ్బతిన్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. గురువారం రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం, సర్ శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో షాబాద్ పరిసర ప్రాంతాల్లో పారిశ్రామిక అభివృద్ధి, ఐటీ సంస్థల రాకతో భూముల విలువలు గణనీయంగా పెరిగాయని, ప్రస్తుతం పరిస్థితి పూర్తి భిన్నంగా మారిపోయిందన్నారు. ఎన్నికలకు ముందు కోటి రూపాయలు పలికిన ఎకరం భూమి.. ప్రస్తుతం రూ.50-60 లక్షలకు కూడా కొనుగోలుదారులు ముందుకు రావడం లేదని తెలిపారు. రియల్ ఎస్టేట్‌పై ఆధారపడి జీవిస్తున్న లక్షలాది మంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం బీఆర్‌ఎస్ ప్రభుత్వం పనిచేసిందని, పాలనపై ఎక్కువ దృష్టి పెట్టడం వల్ల పార్టీ బలోపేతంపై తగినంత సమయం కేటాయించలేకపోయామని చెప్పారు. అయితే రాబోయే రోజుల్లో పార్టీని మరింత బలోపేతం చేస్తామని, 2028లో కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేశారు. కొత్త రాష్ట్రం కాబట్టి.. నవ్వేవాళ్ళ ముందు జారిపడొద్దని అన్నారు. అధికారంలో ఎవరున్నా.. రాష్ట్ర అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. అర్హులైన ప్రతి ఓటునూ కాపాడాల్సిన బాధ్యత పార్టీ కార్యకర్తలు, నాయకులపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పట్నం నరేందర్ రెడ్డి, మాజీ జిల్లా అధ్యక్షులు నాగేందర్ గౌడ్, జిల్లా మహిళా అధ్యక్షులు స్వప్న, నియోజకవర్గ ఇన్‌చార్జి దేశమొళ్ల ఆంజనేయులు, డీసీఎంఎస్ చైర్మెన్ కృష్ణారెడ్డి, మాజీ జడ్పీటీసీ అవినాష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ పాలనలో రియల్ ఎస్టేట్‌కు దెబ్బ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



